చీఫ్ జస్టిస్ ఆందోళన
న్యూఢిల్లీ : సమాజంలో కొరవడుతున్న సున్నితత్వం పట్ల చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. తమ రోజువారీ పనులతో బిజీ బిజీగా గడిపే వ్యక్తులు కూడా ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగితే చాలు వెంటనే కారు దిగి పరుగులు పెడతారని, ఇంతా చేసి మృత్యుముఖంలో వుండే బాధితులకు సాయం చేయడానికి కాదని, తమ సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకు వీడియోలు తీసుకోవడానికని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానితులుగా పేర్కొంటున్న వారి ముఖాలు, పేర్లు, ఇతర వివరాలను పోలీసులు సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టడానికి సంబంధించిన రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
నిందితులను ఫోటోలు తీసుకోవడానికి, వారి చేతులకు సంకెళ్ళు వేసి బహిరంగంగా చూపించడానికి అనుమతించడం ద్వారా పోలీసులు మీడియాతో సహకరిస్తున్న తీరును పిటిషన్‌దారు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజ్యాంగంలో 21వ అధికరణ ప్రకారం, నిందితుడు గౌరవంతో జీవించే ప్రాధమిక హక్కును తీవ్రంగా ఉల్లంఘించడం కిందకు వస్తుందని పిటిషనర్ హేమేంద్ర పటేల్ తరపున న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ తెలిపారు. దీనివల్ల నిందితులపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుందన్నారు. పైగా క్రిమినల్ జస్టిస్ వ్యవస్థకు విఘాతం కలుగుతుందన్నారు.
దానిపై జస్టిస్ జోమాల్యా బాగ్చి స్పందిస్తూ, పోలీసులు తటస్థ వైఖరితో నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. అటు నిందితులు, ఇటు బాధితులు ఎవరి పక్షాన నిలబడరాదన్నారు. పైగా మీడియాలో ఇలాంటివి షేర్ చేయడం వల్ల స్వేచ్ఛగా, సక్రమంగా, పారదర్శకంగా విచారణ జరిగే హక్కు దెబ్బతింటుందన్నారు. ప్రజాభిప్రాయాన్ని బట్టి కాదని న్యాయస్థానాలు దోషి ఎవరో నిర్ధారిస్తాయని చెప్పారు. అయినా నిబంధనల ద్వారా పోలీసులను నియంత్రించగలం కానీ, సోషల్ మీడియా, ప్రజలు సంగతేంటి? వారిని నియంత్రించగలమా? అని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుతానికి పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని పిటిషన్‌దారుడిని కోర్టు కోరింది. పోలీసు బ్రీఫింగ్లపై కొత్త నిబంధనవాళికి అనుగుణంగా రాష్ట్రాలు వ్యవహరిస్తున్న తీరును పరిశీలించిన తర్వాత ఏప్రిల్ నాటికి సమగ్రంగా పిటిషన్ దాఖలు చేయాలని కోరింది.



