తిరుమలలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టిటిడి ఉన్నతాధికారులతో సమీక్ష
తిరుపతి : తిరుమలలో ఏర్పాటు చేసిన ఆధునిక ల్యాబ్‌తో కల్తీకి చెక్ పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రసాదాల తయారీలో వాడే నెయ్యి, ఇతర ముడి పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు, యాత్రికులకు అత్యాధునిక ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను తీసుకొచ్చేందుకు తిరుమలలో ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్ఎస్ఎఐ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఎఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించారు. అక్కడే టిటిడి ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్షించారు. ఇటువంటి క్షేత్రాల్లో దేశంలోని తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ దాదాపు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించారు.
రూ.10 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. ఒకే నమూనాపై 50కుపైగా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఈ ల్యాబ్‌కు ఉంది. శ్రీవారి ప్రసాదాల నాణ్యత, స్వచ్ఛతను నిర్ధారించడంతోపాటు ముడిసరుకుల్లో కల్తీని గుర్తించి, యాత్రికులకు ఉత్తమ ప్రమాణాల ప్రసాదాలు అందేలా ఈ ల్యాబ్ కీలక పాత్ర పోషించనుందని అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కల్తీకి ఏ మాత్రమూ ఆస్కారం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. తాను స్వయంగా యాత్రికులను కలిసినప్పుడు వారు ప్రసాదం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.
ఆ నమ్మకాన్ని నిరంతరం కాపాడాలని ఆదేశించారు. క్యూలైన్లలో సామాన్య యాత్రికులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఎఐ టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించాలని సూచించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ యాత్రికుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత నిస్తూ సేవలందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. యాత్రికుల విశ్వాసాన్ని చూరగొనేలా సాంకేతికతను జోడించి అత్యున్నత ప్రమాణాలతో కూడిన సేవలందించాలని అధికారులను దిశానిర్దేశం చేశారు. లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని ఆదేశించారు. తిరుమల కొండపై శ్రీవారి సేవకుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు.



