Sunday, March 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగ్రేడింగ్‌లో పాస్‌ అయితేనే సేల్‌

గ్రేడింగ్‌లో పాస్‌ అయితేనే సేల్‌

- Advertisement -

పసుపు పంట కొనుగోలుకు కొర్రీలు
ధర తగ్గడంపై మార్కెట్‌ కమిటీకి చెడ్డపేరు వస్తున్నట్టు భావన
ఎండిన పసుపునకే గ్రేడింగ్‌తో లాట్‌ కేటాయింపు
ఎంత ఎండినా అంతే ధర : రైతుల ఆవేదన

పసుపు పంట కొనుగోలుకు ఇకపై గ్రేడింగ్‌ విధానం పాటించేందుకు మార్కెట్‌ కమిటీ అధికారులు సిద్ధమయ్యారు. పసుపు కొమ్ముల తేమ శాతం ఆధారంగా గ్రేడ్‌లు కేటాయించినవాటికే లాట్‌ నెంబర్‌ ఇవ్వనున్నారు. గ్రేడింగ్‌లో పాస్‌ కాకపోతే టెండర్‌ ప్రక్రియలో విక్రయించేందుకు అవకాశం ఉండదు. ప్రస్తుతం ధర తక్కువగా వస్తుండటంతో మార్కెట్‌ కమిటీకి చెడ్డపేరు వస్తుందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారవర్గాల సమాచారం.

పూర్తిగా ఎండిన పంటకే గ్రేడింగ్‌ కేటాయిస్తే ధర కూడా అధికంగా వచ్చే అవకాశాలుంటాయని మార్కెట్‌ కమిటీ, అధికారులు ఆలోచనలో ఉన్నట్టున్నారు. అయితే, ఎంత ఎండబెట్టినా ధర మాత్రం అంతే ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. గ్రేడింగ్‌ ఇవ్వని పసుపునకు కమీషన్‌ ఏజెంట్‌లు ఎంతోకొంత ముట్టజెప్పి ఇప్పుడు వచ్చే ధర కన్నా మరింత తక్కువ ఇచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నవతెలంగాణ – నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డు.. పసుపు కొనుగోళ్లకు ప్రసిద్ధి. నిజామాబాద్‌ జిల్లాతోపాటు నిర్మల్‌, మెట్‌పల్లి, జగిత్యాల నుంచి రైతులు నేరుగా తమ పంటను ఇక్కడి మార్కెట్‌కు తీసుకొస్తారు. ఈ నామ్‌ పద్ధతిలో కుప్పలకు లాట్‌ నెంబర్‌ కేటాయిస్తే ఐదారుగురు ఖరీద్‌దారులు తమకు నచ్చిన ధర నిర్ణయిస్తుంటారు. అందులో గరిష్ట ధరను మార్కెట్‌ కమిటీ ఫైనల్‌ చేసి రైతులకు సమాచారం ఇస్తుంది. ఆ ధర నచ్చితే పంటను అమ్ముకోవచ్చు. నచ్చకపోతే తిరస్కరించి మరుసటి రోజు మరోసారి పాల్గనవచ్చు. అయితే, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 3,75,000 క్వింటాళ్ల పసుపు కొనుగోళ్లు పూర్తవగా.. మే తొలి వారం వరకు సుమారు 8 లక్షల క్వింటాళ్ల పసుపు కొనుగోళ్లు చేయనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

రేపటి నుంచి గ్రేడింగ్‌
కొన్ని రోజులుగా పసుపు పంట ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రారంభంలో వచ్చిన ధర ప్రస్తుతం ఇవ్వడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అందరూ కుమ్మక్కై ధరను తగ్గిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే యుద్ధం కారణంతో ఎగుమతులు నిలిచిపోవడం, వర్షాల వల్ల పసుపు తేమ శాతం రాకపోవడంతోనే ధర రావడం లేదని కమీషన్‌ ఏజెంట్‌లు, ఖరీద్‌దారులు చెబుతున్నారు. ఈ క్రమంలో మార్కెట్‌ కమిటీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని కమిటీ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో గ్రేడిగ్‌ విధానం తెరమీదకు తీసుకొచ్చారు. సోమవారం నుంచి ఇదే విధానం అమలు చేయనున్నట్టు ఇప్పటికీ కమిటీ ప్రకటించింది.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
పసుపు కొనుగోలులో కొర్రీలు పెట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర తగ్గుతుందంటే దాన్ని పెంచే చర్యలు తీసుకోకపోగా.. పైగా గ్రేడింగ్‌ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేసేలా మార్కెట్‌ కమిటీ వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఎంత ఎండినా ధర మాత్రం అంతే చెల్లిస్తున్నారని, పైగా ఇప్పుడు గ్రేడింగ్‌ పద్ధతితో తమకు మరింత నష్టం చేకూరే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. కమీషన్‌, ఖరీద్‌దారులతో సమావేశం ఏర్పాటు చేసి ధర పెంచే ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు.

రైతులు తొందరపడొద్దు
పంట విక్రయాల్లో రైతులు తొందరపడొద్దు. ఎండిన పంటకే అధిక ధర వస్తుంది. వాతావరణం అనుకూలించకపోతే కొద్ది రోజులు వేచి చూసి ఆరబెట్టి పంటను మార్కెట్‌కు తీసుకురావాలి. రైతుల శ్రేయస్సు కోసమే మార్కెట్‌ కమిటీ పని చేస్తుంది. అందుకే పసుపునకు కటాఫ్‌ రేట్లు కూడా ఇది వరకే నిర్ణయించాం. గ్రేడింగ్‌ ఇవ్వని పంటపై అనుమానాలుంటే మా దృష్టికి తీసుకొస్తే మాయిశ్చర్‌ మిషిన్‌లో సైతం చెక్‌ చేసి ఇస్తాం. రైతులకు అత్యధిక ధర వచ్చేందుకే మార్కెట్‌ కమిటీ కృషి చేస్తుంది.
-ముప్ప గంగారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ నిజామాబాద్‌

ఎంత ఎండినా అంతే ధర
పసుపును ఎంత ఎండ బెట్టి తీసుకొచ్చినా అంతే ధర ఇస్తున్నారు. రోజూ లిస్టు చూస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా రూ.16 వేల ధర రాలేదు. ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి. తొందరగానే పంట ఎండుతుంది. ఎంత ఎండబెట్టి తీసుకొచ్చినా రూ.12 వేల నుంచి 11,500 ధరే ఇస్తున్నారు. మళ్లీ కొత్తగా గ్రేడింగ్‌ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు. ఇప్పటికే పెట్టుబడులు పెరిగిపోయాయి. వాటితో పోలిస్తే వచ్చే ధరకు, మా కష్టానికి విలువే లేకుండా పోతోంది.
-అనిల్‌, రైతు, పెర్కిట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -