మానేరులో ఇసుక తోడేళ్ళు..
అభివృద్ధి మాటున..అక్రమ దందా
పట్టించుకోని రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని తాడిచెర్ల, ఇప్పలపల్లి, కేశారంపల్లి, వళ్లెంకుంట తదితర గ్రామాల్లోని మానేరు పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొద్దిరోజులుగా జోరుగా సాగుతున్నాయి. అధికారుల కళ్లుగప్పి ట్రాక్టర్ యజమానులు, అక్రమ ఇసుక వ్యాపారులు దందాను మూడు పువ్వులుగా, ఆరు కాయలుగా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ట్రాక్టర్లలో ఇసుకను కూలీలతో కాకుండా నేరుగా ట్రాక్టర్ డ్రోజర్లతో అడ్డుఅడుపు లేకుండా భారీగా తవ్వకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పిడి, ఏపిడీ అధికారులచే అనుమతులతో డీడీలు లేకుండా ఉచితంగా అందించాలని ఆదేశించింది.
ఇదే అదునుగా భావించిన ఇసుకాసురులు రాత్రియితే చాలు పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. తాడిచెర్ల మానేరు నుంచి పెద్దతూండ్ల, ఖాసింపల్లి, జంగెడు, భూపాలపల్లికి, అలాగే కేశారంపల్లి, వళ్లెంకుంట మానేరు నుంచి కాటారం, గంగారం అక్రమంగా తరలిస్తూ వేలు ఘడిస్తున్నారు. అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయకపోతే రానున్న వేసవి కాలంలో భూగర్భజలాలు అడుగంటిపోయి తాగు, సాగు నీటికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచిఉంది.
రాత్రయితే గుట్టుగా..
ఇసుకాసురులు ధనార్జనే ద్యేయంగా రాత్రయితే గుట్టుగా అక్రమ ఇసుక దందా నడుస్తోంది. తాడిచెర్ల మానేరు నుంచి అక్రమార్కులు ట్రాక్టర్లతో పెద్దతూండ్ల, కిషన్ రావుపల్లి మీదుగా భూపాలపల్లి తరలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తాడిచెర్ల నుంచి ఓసిపి బెల్టు మార్గం నుంచి ఖాసింపల్లి, జంగెడు, భూపాలపల్లి, గొర్లవిడు, కొంపెళ్లికి భారీగా ఇసుకను తరలిస్తూ వ్యాపారులు లక్షలు ఘడిస్తున్నారు. తాడిచెర్ల, కేశారంపల్లి గ్రామాల్లో రహస్య ప్రాంతాల్లో ఇసుక డంపులు సైతం పోస్తూ రాత్రియితే టిప్పర్లలో ఇసుకను దూర ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతా జరిగిన సంబంధించిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చర్యలు తీసుకుంటాం: రెవెన్యూ, పోలీస్ అధికారులు
అక్రమ ఇసుక దందాపై రెవెన్యూ, పోలీస్ అధికారుల దృష్టికి నవ తెలంగాణ తీసుకపోగా త్వరలోనే సంయుక్తంగా అక్రమ ఇసుకాసురుల దందాకు అడ్డుకొని చర్యలు చేపడుతామన్నారు. అక్రమ ఇసుక దందాపై ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మైనింగ్ అధికారులు మాత్రం అందుబాటులోకి రాలేదు.



