Sunday, March 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలురైతు భరోసా నిధులు విడుదల

రైతు భరోసా నిధులు విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. రైతు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ఆయన విడుదల చేశారు. ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చింది. సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్వహించిన సభలో తొలి విడతగా రూ.3,590 కోట్లు విడుదల చేశారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం అన్నదాతల ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. ఇరవై రోజుల అనంతరం రెండో విడతలో రూ.2,650 కోట్లు, మూడో విడతలో రూ.2,760 కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా.. రైతుల విషయంలో వెనుకంజ వేయడం లేదన్నారు. 

‘‘వరికి బోనస్‌ ఇస్తున్నాం. వరదల వల్ల నష్టపోతే పరిహారం ఇస్తున్నాం. రైతుల కోసం ఇప్పటివరకు రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్రంలో పంటల విధానంలో మరిన్ని మార్పులు రావాలి. గతంలో రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు బాగా పండించేవారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వల్ల ఆ జిల్లాలో పంటల సాగు తగ్గింది. కూరగాయలు, పండ్లు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. కేంద్రం 50 లక్షల టన్నుల వరి మాత్రమే కొంటామని చెప్తోంది. పంటమార్పిడి ద్వారా మాత్రమే.. వ్యవసాయం లాభసాటి అవుతుంది. సిద్దిపేటలో నిర్మించిన ఫ్యాక్టరీ కొడంగల్‌లోనూ నిర్మించాలని మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా. నిజామాబాద్‌ జిల్లాలోని అంకాపూర్‌ రైతులను ఆదర్శంగా తీసుకొని రైతులంతా ముందుకెళ్లాలి. తెలంగాణలో ఒక్కో జిల్లా.. ఒక్కో పంటకు ప్రసిద్ధి. రాష్ట్రంలో సారవంతమైన భూములున్నాయి.. కష్టపడే రైతులు ఉన్నారు. మన పంటలను ఎగుమతి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది.

ప్రజలకు ఇచ్చే నిధుల విషయంలో వివక్షచూపే సీఎంను కాదు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలోనూ కాంగ్రెస్‌ గెలవాలి. ఇక్కడి నుంచి గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తా. గత పాలకులు విపక్షనేతల నియోజకవర్గాల పట్ల వివక్ష చూపించారు. నేను నేతలతో వ్యతిరేకిస్తాను గానీ, ప్రజల పట్ల వివక్ష చూపను. సిద్దిపేటకు కూడా నిధులు భారీగా ఇచ్చాను. వివక్ష చూపే వ్యక్తినయితే.. ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని కొడంగల్‌కు తీసుకెళ్లేవాడిని. కాంగ్రెస్ ప్రజలు బీఆర్‌ఎస్‌కు రెండుసార్లు అధికారం మీకు ఇచ్చారు.. మాకు రెండు సార్లు ఇస్తారు.’’ అని రేవంత్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -