Monday, March 23, 2026
E-PAPER
Homeదర్వాజమనిషేక్కడ?

మనిషేక్కడ?

- Advertisement -

సెలవుల వాలుపై రోజులు
బడిపిల్లల్లా జర్రన జారిపోయాయా లేక
వారంతాలు కాలం కాలువలో పడి
కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయా?
అయినా…
మనసు గోడమీద వేలాడే క్యాలండర్‌ పేజీలు
మసక మసక జ్ఞాపకాల్లా ఒక్కొక్కటి పల్టీలు కొడుతుంటే…
అసలు సంవత్సరాలే మన మీద నుంచి దొర్లిపోతుంటే
ఈ కాస్త సెలవులదేముంది!
సూర్య చంద్రుల క్రషర్ల మధ్య చెరుకు గడల్లా నలిగి
సాయంత్రానికి చెమట చుక్కల్లా మిగిలిన శ్రమజీవులు
వెలుగు జొర్రని A. C భవంతుల కొలిమిల్లో
మెదళ్ళని దోర జామకాయ్యల్లా
లాప్టాప్‌ మడతల్లో
రెండు పచ్చలు చేసే సాఫ్ట్వేర్‌ ఉద్యోగులు
ట్రాఫిక్‌ సముద్రంలో
పేరుకుపోయిన మంచు గడ్డల్లాంటి
బండ్లని జరుపుకుంటూ
ఎండ పొడల్లో జడివానల్లో తడిసిపోతూ
బతుకు నావని తెలియని తీరం వైపుకు తోసే
డెలివరీ బాయ్స్
సెలవు ముందు సాయంత్రం రేపటి చిత్రాలని
తొందర అడుగుల రంగులతో
తారురోడ్డు కాగితంపై అద్దుకుంటూ
అలిసి ఇంటికి చేరే హోమోసెపియన్స్‌
ఉద్యోగాన్ని తొడుక్కున్న ప్రతీ జీవికి
ఈ సెలవులు కొందరికి ఓయసిస్సయితే
మరికొందరికి ఎండమావి
సెలవొచ్చింది, పోయింది
మనిషేక్కడ?

వివేక్‌ ఎండ్లూరి, 8500179807

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -