Monday, March 23, 2026
E-PAPER
Homeదర్వాజ'ప్రపంచాంత యుద్ధం'లో మానవతావాదం

‘ప్రపంచాంత యుద్ధం’లో మానవతావాదం

- Advertisement -

మారియో వర్గాస్‌ లోసా లాటిన్‌ అమెరికా రచయితల్లో విస్తారంగా, ప్రయోగాత్మకంగా, శక్తివంతంగా రాసి రచయిత. 2010 లో నోబెల్‌ బహుమతి గ్రహీత. ఈయనపై ఫ్లోబే, విలియం ఫాక్నర్‌, జేమ్స్‌ జాయిస్‌, టాల్స్టాయ్, దాస్తొయెవ్‌స్కీ, ఇవాన్‌ బునిన్‌ మొదలైన ప్రఖ్యాత రచయితల ప్రభావముంది. పెరూలో జన్మించిన లోసా లాటిన్‌ అమెరికా ప్రజా మేధావుల్లో, కళ, సంస్కృతి, నవలా సాహిత్యంలో ప్రఖ్యాతి చెందాడు. రాజకీయాల్లో ఒకసారి దేశ అధ్యక్ష పదవికి పోటీ చేశాడు. లోసా తన రచనా వ్యాసంగం ‘టైం ఆఫ్‌ ది హీరో’, ‘ది గ్రీన్‌ హౌస్‌’, ‘ది ఫీస్ట్‌ ఆఫ్‌ ది గోట్‌’, ‘ఆంట్‌ జూలియా అండ్‌ ది స్క్రిప్ట్‌ రైటర్‌’, ‘ది వార్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ అనే ప్రఖ్యాత నవలలు రచించాడు.

‘ప్రపంచాంత యుద్ధం’ అనే తన నవలారాజంలో అన్ని రకాల ఉన్మాదాలని, యుద్ధ బీభత్సాన్ని తనదైన శైలిలో వర్ణించాడు. యుద్ధం యొక్క క్షమించరాని స్వభావాన్ని దాదాపు ఏడు వందల యాభై పేజీల్లో రాశాడు. ఇది టాల్స్టాయ్ పదమూడు వందల పేజీల పై చిలుకు నవల ‘యుద్ధం, శాంతి’ నవల లాగే ఎపిక్‌ స్థాయిలో ఉంది బ్రెజిల్‌ నేపథ్యంలో రాసిన ఈ నవలలో సంప్రదాయ వాస్తవికత కథన శైలి , గత వర్తమానాలు ఒక దాని తర్వాత మరొకటి మారుతుండటం, భిన్న స్వరాలు, భిన్న కేంద్రీకరణలు కనిపిస్తాయి. నవలలో పాత్రికేయ, పుస్తక, శ్రవణ ఆధారిత కథనాలతో వాస్తవికతను చిత్రీకరించాడు.

ఈ నవలలో లోసా యుద్ధమనేది, ప్రత్యేకంగా ఉన్మాద శక్తుల మధ్య యుద్ధం వ్యర్థమని చూపించాడు. యూక్లిడ్‌ దా కన్హా రాసిన నాన్‌ ఫిక్షన్‌ పై ఆధారపడిన రచన ఇది. దీనిలో సంప్రదాయం – ఆధునికత, జాతీయ వాదం – ప్రాంతీయ వాదం, రిపబ్లికనిజం – మోక్ష ఆధారిత మత విశ్వాసాల మధ్య పోరాటాన్ని చిత్రీకరించాడు. లోసా జాతీయ వాదం అనేది ”సంస్కృతి హీనుల సంస్కృతిగా, రెచ్చగొట్టే నేతల మతంగా, అపోహ, హింస, వర్ణ వివక్షల ముసుగుగా” అని తన వ్యాసం ‘జాతీయ వాదాలు మరియు ఉటోపియా’ వ్యాసంలో అభివర్ణించాడు.

ఈ నవలలో బ్రెజిల్లోని బాహియా ప్రాంత జనంలో బడుగు వర్గాలవారు జనాభా లెక్కలు, సివిల్‌ మ్యారేజ్‌లను తీసుకొచ్చిన రిపబ్లిక్‌కు వ్యతిరేకంగా ఒక కౌన్సిలర్‌ నేతృత్వంలో ఐక్యమై తమ మీదకు వచ్చిన కేంద్ర బలగాలను మూడు దండయాత్రలలో పరాజితులను చేస్తారు. ఈ పోరులో భిన్న వర్గాలు, పాత్రలు , అరాచక విప్లవకారులు, భూస్వాములు, సెనేటర్లు, సేనా నాయకులు, మతోన్మాదులు, పాత్రికేయులు, స్త్రీలు, చిన్న పిల్లలు అందరూ చిక్కుకుంటారు. ఈ వ్యాసంలో యుద్ధ నేపథ్యంలో భిన్న స్వరాలు, కథనాలు, అనిర్దిష్ట సత్యాలు, స్త్రీ పాత్రల పరిస్థితి, మానవ స్థితిగతులపై కేంద్రీకరణ ఉంటుంది. ప్రముఖ మార్క్సిస్ట్‌ విమర్శకుడు టెర్రీ ఈగిల్టన్‌ చెప్పినట్లు” ఒకే గొప్ప కథనం ఉండదు. అనేక చిరు కథనాలు, వాటిలో ప్రతి ఒక్కటి పాక్షిక సత్యాన్ని కలిగినవి ఉంటాయి.

వాస్తవికత అతి మామూలు అంశం గురించి కూడా ఎన్ని కథనాలైనా, ఒక దానితో మరొకటి సరిపోలనివి ఇవ్వవచ్చు. (హౌ టు రీడ్‌ లిటరేచర్‌,పే.107) ఈ నవలలో పాత్రికేయుడు, భూస్వామి కెనబ్రావా, యారేమా, ఇతరులు భిన్న కథనాలు వినిపిస్తారు. యుద్ధ కాలంలో అధికార నిచ్చెనలో అడుగున ఉన్న స్త్రీలను ఎలా అవమానిస్తారో చూపిస్తాడు లోసా . ఆధునికతకు ప్రతీకగా ఉన్న రిపబ్లిక్‌, విశ్వాస ప్రతినిధిగా ఉన్న బాహియా ప్రాంత జనం మధ్య యుద్ధంలో విపరీత జన నష్టం జరుగుతుంది. రెండు ఉన్మాదాల మధ్య ప్రజలకు సొంతంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉండదు అని ఉదారవాద లోసా భావన. ఈ నవలలో జన పయనాలు, ఘోర మరణాలు, రాబందులు శవాల్ని పీక్కుని తినడం, ఆస్తి నష్టం, విరుద్ధ ఆవేశాలు తనకు ఇష్టం లేకున్నా యుద్ధంలో చిక్కున్న పాత్రికేయ కథనం, కల్పన జోడించి సత్యం అనేది అనుభవేకవేద్యమని తెలుస్తుంది.

పోరాటకారుల, పౌరుల విషాద గాథ పాఠకులను ఆలోచింపచేస్తుంది. ఈ జాతీయ, ప్రాంతీయ అసమాన యుద్ధం బాహియా ప్రాంత పోరాటం అంతం అవటంతో ముగుస్తుంది. అయితే యుద్ధ బీభత్స చిత్రీకరణలో స్త్రీల వ్యక్తిత్వ వికాస తీరు, వారి భావాల లోతు కొంత నిర్లక్ష్యానికి గురయ్యాయి. భూస్వామి కెనబ్రావా భూస్వామ్యానికి, కొత్తగా ఏర్పడిన రిపబ్లిక్ల మధ్య పోరులో ఊగిసలాట చూపిస్తాడు. కనుడా నగర పతనం, జుగుంచోల మరణం కతలు వింటాడు. రాజకీయాలు లేవని నటిస్తూ పని మనిషి సెబాస్టియానోను మానభంగం చేసి ఆమెను ప్రేమిస్తున్నట్లు వ్యవహరిస్తాడు. అతడి పిచ్చి భార్య భర్తను ఆపలేక సెబాస్టియానో ను ఓదారుస్తుంది. మరియా, యారేమా, సెబాస్టియానో అందరూ పితస్వామ్య వ్యవస్థ, యుద్ధ పరిస్తితుల బాధిత స్త్రీలే. అయితే పవిత్ర భావంతో మరియా విప్లవ మార్గంలో మరణిస్తే యారేమా తన స్వీయ చైతన్యం పెంచుకుని స్వీయ ఆనందం అన్వేషిస్తుంది. సెబాస్టియానో నిస్సహాయురాలుగా మిగులుతుంది.

రచయిత లోసా ఈ నవలలో దోపిడీ వర్గాల కుతంత్రాలు చూపిస్తూనే బాధితుల మానవత్వాన్ని స్పష్టంగా చిత్రిస్తాడు. బహుళ ప్రేమ సంబంధాలు, వర్గవైరుధ్యాలు బిన్న రాజకీయ పార్టీల నాయకుల, భూస్వాములు, పత్రిక యాజమానుల, రైతులు, లుంపెన్‌ ల ప్రాతినిధ్య వ్యవస్థల పోరు ఈ నవల కాన్వాస్‌ పై చూపాడు.మత విశ్వాసులుగా ఉన్న కౌన్సిలర, ఫాదర్‌ జోక్విం, చిన్న ఆశీర్వాదం, కౌన్సిలర్‌ ప్రతి మాటను లిఖించే నటుబా, చివరి దాకా తాను నమ్మిన కౌన్సిలర్‌తో నిలిచి చనిపోయిన మరియా పాత్రల పట్ల మనకు సానుభూతి కలుగుతుంది. విమర్శకుడు టెర్రీ ఈగిల్టన్‌ మాటల్లో ”అర్థం అనేది మునిసిపల్‌ పార్కుల్లా వస్తుగతంగా ఉండదు.అలాగని వ్యక్తిగతమూ కాదు.ఇది సాహితీ రచనలకు వర్తిస్తుంది. అవి సంభాషణలు. భౌతిక వస్తువులు కాదు. పాఠకుడు లేకుండా సాహిత్యం లేదు.” (హౌ టు రీడ్‌ లిటరేచర్‌,పే.146). ‘ప్రపంచాంత యుద్ధం ‘రచయిత లోసా దృష్టిలో ఒకరు ఏ విధంగా అనుకున్నా నవలలో చివరకు ముఖ్యమైనది జ్ఞాపకం ఎన్నుకునేదే.

డా. జె. రవీంద్రనాథ్‌, విశ్రాంత ఆంగ్ల ఆచార్యులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -