సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరులో భాగమే ”జన్ ఆక్రోష్” ర్యాలీ అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ అన్నారు. ఆదివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ”కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవడం, ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీయడానికి తీసుకువచ్చిన వీబీ- జీఆర్‌ఏఎంజీ చట్టాన్ని రద్దు చేయడం, విద్యుత్, విత్తన చట్ట సవరణలను విరమించుకోవడం, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం నుంచి వైదొలగడం వంటి డిమాండ్లను జన ఆక్రోష్ ర్యాలీ ముందుకు తెస్తోంది” అని అన్నారు. ”వివిధ రాష్ట్రాల్లో జరిగిన యాత్రలలో భాగంగా పర్యటనలతో గ్రామాలు, చిన్న పట్టణాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధ ప్రభావాలను భారత్‌లోని సామాన్య ప్రజలు అనుభవిస్తున్నారు. వంటగ్యాస్, ఇంధన ధరల పెరుగుదల, గ్యాస్ సిలిండర్ల కొరత, ధరల పెరుగుదల, చిన్న, మధ్య తరహా వ్యాపార రంగం కుప్పకూలడం వంటి సమస్యలు ప్రజల జీవితాలను దుర్భరం చేశాయి. ఇటువంటి సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రజల గళాన్ని వినిపించే ఒక గొప్ప వేదికగా జన ఆక్రోష్ ర్యాలీ నిలుస్తుంది” అని తెలిపారు. ఈ ర్యాలీలో సీపీఐ(ఎం) అఖిల భారత నాయకులు ప్రసంగిస్తారని, మరిన్ని ఉద్యమాలకు కూడా పిలుపునిస్తారని తెలిపారు.
’50 వేల మంది ర్యాలీ’
జన్ ఆక్రోష్ ర్యాలీలో వివిధ ఉత్తర భారత రాష్ట్రాల నుంచి వేల మంది ప్రజలు పాల్గొననున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఢిల్లీకి రావడానికి ప్రజలు ప్రయాణాలు ప్రారంభించారు. సోమవారం సాయంత్రం నాటికి ఢిల్లీలోని రామ్ లీలా మైదానానికి చేరుకుంటారు. ఆదివారం సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ రామ్‌లీలా మైదాన్‌ను సందర్శించి, ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి పెద్దగా భాగస్వామ్యం ఉండదని అన్నారు. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వస్తారని తెలిపారు. సుమారు 50,000 మంది వస్తారని అంచనా ఉందని అన్నారు. ఉత్తర భారత రాష్ట్రాల్లో మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను బహిర్గతం చేయడంలో సీపీఐ(ఎం) చురుకైన పాత్ర పోషించడంలో జన్ ఆక్రోష్ ర్యాలీ ఒక ప్రతిబింబంగా నిలుస్తుందని అన్నారు.
మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు
- Advertisement -
- Advertisement -



