ప్రతిబంధకాలకు ఎదురొడ్డి నిలబడిన వైనం
విధానకర్తలు, కార్పొరేట్ కంపెనీల అధినేతల ప్రశంసలు
ఘనంగా చైనా అభివృద్ధి ఫోరం సమ్మిట్
బీజింగ్ : అన్ని రంగాల్లో అత్యాధునిక సాంకేతికతలను మేళవించి ప్రజల సమిష్టి కృషితో వేగవంతమైన సర్వతోముఖాభివృద్ధితో చైనా ప్రగతి పథాన దూసుకెళ్తోందని పలురు విధానరూపకర్తలు, ఆర్థిక నిపుణులు, కార్పొరేట్ సంస్థల అధినేతలు ప్రశంసలు కురిపించారు. అత్యాధునిక నాణ్యతతో కూడిన అభివృద్ధి లక్ష్యంగా విధానాల రూపకల్పన కోసం చైనా డెవలప్‌మెంట్ ఫోరం (సీడీఎఫ్) సమ్మిట్ బీజింగ్‌లో ఆదివారం నాడు ఘనంగా ప్రారంభమైంది. ఈ ఏడాది సమ్మిట్ ”చైనా తన 15వ పంచవర్ష ప్రణాళిక కాలం : అత్యంత నాణ్యమైన అభివృద్ధి – సమిష్టి నూతన అవకాశాల సృష్టి” నేపథ్యంగా నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్ పాన్ గాంగ్‌షెంగ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాన్ కట్జ్, ఆపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్, డెవలప్‌మెంట్ రీసెర్చ్ సెంటర్ స్టేట్ కౌన్సిల్ డైరెక్టర్‌లు హావో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాన్ గాంగ్ షెంగ్ మాట్లాడుతూ… స్థిరమైన, హేతుబద్ధమైన, ఊహించగలిగే సహకార ప్రాధాన్యత ఇదివరకు కంటే ఇప్పుడు చాలా విలువైనదని తెలిపారు. వాణిజ్య ప్రతిబంధకాలు, ఆంక్షలు స్వేచ్ఛా వాణిజ్య పునుదాలను కృంగదీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణవాదాన్ని నిర్ధిష్టంగా వ్యతిరేకించితీరాలని, మరింత సమగ్రత, ప్రయోజనాల విస్తృతితో కూడిన ప్రపంచీకరణ అవసరమని ఆయన తెలిపారు.
ప్రతిబంధకాలకు ఎదురొడ్డి నిలబడిన చైనా
ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి దిగ్భ్రాంతికర పరిస్థితులు, ఆంక్షలు, ఆటంకాలు, ప్రతిబంధకాలు ఏ రూపంలో ఎదురైనా వాటిని ఎదుర్కొని నిలబడగలమని చైనా నిరూపించిందని ఐఎంఎఫ్ తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాన్ కట్జ్ అన్నారు. ఈ సుస్థిరతను సాధించడంలో మార్కెట్ శక్తులకు ఇదివరకటికంటే గొప్ప ప్రాధాన్యత పాత్రను కల్పించారని తెలిపారు.
చైనా పట్ల మాది ఆశావహదృక్పథం : టిమ్ కుక్
చైనా దేశమంతా ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని, అనేక రంగాల్లో అత్యాధునిక అవకాశాలు పురుడు పోసుకుంటున్నాయని, తమ సంస్థ చైనా పట్ల ఎంతో ఆశావహ దృక్పథంలో ఉందని ఆపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ అన్నారు. చైనా శక్తియుక్తులను, సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకొని వాస్తవికరూపు దాల్చేందుకు కలిసికట్టుగా పనిచేసేందుకు తాము అంకితమైవున్నామని తెలిపారు.



