Monday, March 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅత్యున్నత సేవలందిస్తున్న నిమ్స్‌

అత్యున్నత సేవలందిస్తున్న నిమ్స్‌

- Advertisement -

రోగ నిర్ధారణ, వైద్య చికిత్సలో అధునాతన పరికరాలు
త్వరలో హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో అందుబాటులోకి 9వేల బెడ్స్‌ : నిమ్స్‌ డైరెక్టర్‌ నగరి బీరప్ప
నిమ్స్‌లో ప్రొఫెసర్‌ కాకర్ల జాతీయ సదస్సు

నవతెలంగాణ-సిటీబ్యూరో
స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ యంత్ర పరికరాలతో నిమ్స్‌ ఆస్పత్రి అత్యున్నత సేవలందిస్తోందని డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నగరి బీరప్ప తెలిపారు. ఆదివారం పద్మశ్రీ ప్రొఫెసర్‌ కాకర్ల సుబ్బారావు జాతీయ సదస్సును నిమ్స్‌ ట్రామా ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీరప్ప హాజరై.. వైద్య ఆరోగ్య రంగంలో రేడియాలజీ సేవల ప్రాముఖ్యతను వివరించారు. రోగ నిర్ధారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఎన్నో అధునాతన యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. రోగ నిర్ధారణ ఖచ్చితత్వం, వేగం పెరగడం వల్ల అతి త్వరలో వైద్య చికిత్స అందుతుందని చెప్పారు. నిమ్స్‌ రేడియాలజీలో డిజిటల్‌ ఎక్స్‌ రే మెషీన్లు, మల్టీ డిటెక్టర్‌ సిటీ, ఎంఆర్‌ఐ, మామోగ్రఫీ, డెక్సా స్కాన్‌, సి ఆర్మ్‌ లు, ఆల్ట్రాసౌండ్‌ మెషీన్లు, అధునాతన డి ఎస్‌ ఏ ల్యాబ్‌ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మున్ముందు హైదరాబాద్‌లో నాలుగు తెలంగాణ ప్రభుత్వ వైద్య విద్యా సంస్థల(టిమ్స్‌) ఏర్పాటుతో 4వేల బెడ్స్‌ అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు.

నిమ్స్‌లో అదనంగా 2వేల బెడ్స్‌, ఉస్మానియా, కాకతీయ ఆస్పత్రుల్లో మరో 3వేల బెడ్స్‌తో వైద్య అనుబంధ ప్రొఫెషనల్స్‌కి ఎన్నో ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఆధునిక వైద్య విధానాన్ని, ప్రభుత్వ రంగంలో కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలను విస్తరించడానికి ప్రొఫెసర్‌ కాకర్ల సుబ్బారావు చేసిన కృషి అమోఘం అని, ఆయన సేవలు, కృషిని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ రేడియోగ్రాఫర్స్‌ తెలంగాణ చాప్టర్‌ ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. ఆయన పేరుపై 15 ఏండ్లుగా ప్రతి ఏటా జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దేశంలో రేడియాలజీ, ఇమేజింగ్‌ సాంకేతిక నిపుణుల సమైక్యతకు, సహకారానికి సేవలందిస్తున్న విశిష్ట వ్యక్తులను గుర్తిస్తూ క్రెస్ట్‌ సహకారంతో ప్రొఫెసర్‌ కాకర్ల జీవిత సాఫల్య అవార్డులను అందించడం ప్రశంసనీయమని కొనియాడారు. 2025, కాకర్ల శత జయంతి సందర్భంగా జీవిత సాఫల్య అవార్డును నిమ్స్‌ వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల ప్రిన్సిపాల్‌, ఇటీవల రేడియాలజీ ఇమేజింగ్‌, థెరప్యూటిక్‌ ప్రొఫెషనల్స్‌ జాతీయ మండలి అధ్యక్షులు బడ్డ శిరందాస్‌ శ్రీనివాస్‌కి ప్రకటించడం గర్వకారణం అని తెలిపారు.

ఈ అవార్డు శ్రీనివాస్‌ కృషికి గుర్తింపు : కవితారెడ్డి
కాకర్ల జీవిత సాఫల్య అవార్డుకు శ్రీనివాస్‌ అన్ని విధాల అర్హుడు అని కాకర్ల సుబ్బారావు రేడియాలజీ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ప్రతినిధి డాక్టర్‌ ఎన్‌.కవితారెడ్డి అన్నారు. 30 ఏండ్లుగా ఆయన చేసిన కృషికి గుర్తింపు అన్నారు. కాకర్ల పరంపరను కొనసాగిస్తూ సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ రేడియోగ్రాఫర్స్‌, తెలంగాణ చాప్టర్‌ జాతీయ స్థాయిలో సదస్సులు నిర్వహిస్తూ రేడియో గ్రాఫర్స్‌ కమ్యూనిటీకి సేవలు చేయడాన్ని అభినందించారు. ఈ సదస్సులు విద్యార్థులకు, సాంకేతిక నిపుణులకు, తమను తాము మరింత మెరుగు పరుచుకోవడానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ రేడియోగ్రాఫర్స్‌ జాతీయ అధ్యక్షులు, మహారాష్ట్ర స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యులు శంకర్‌ కెభగత్‌, ఎస్‌ఐఆర్‌ చైర్మెన్‌ కె.మునిరత్నం, అకాడమిక్‌ డైరెక్టర్‌, కెఎస్‌ఆర్‌ జాతీయ సదస్సు ఆర్గనైజింగ్‌ చైర్మెన్‌ కె.దామోదర నాయుడు, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ ఎం.ఏ.వారిస్‌, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ మహేష్‌ బసవేని పాల్గొన్నారు.

ఇలాంటి సదస్సులతో అప్‌డేట్‌
ప్రస్తుతం రేడియాలజీ విభాగం ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని రోగ నిర్ధారణలో కీలక భూమిక పోషిస్తోందని సీనియర్‌ ప్రొఫెసర్‌, రేడియాలజీ విభాగం అధిపతి, పూర్వ డీన్‌ డాక్టర్‌ ఎస్‌.రామ్మూర్తి అన్నారు. వివిధ రకాల యంత్ర పరికరాలు.. వాటిని రోగ నిర్ధారణకు ఉపయోగించడానికి సాంకేతిక నిపుణులు ఎప్పటికప్పుడూ అప్‌డేట్‌ అవ్వడానికి ఇలాంటి సదస్సులు ఉపయోగపడతాయని తెలిపారు. కాకర్ల సుబ్బారావు ఈ నిరంతర అధ్యయనానికి ఆద్యులు అని, ఆయన చూపిన మార్గంలో డిపార్టుమెంటు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిందని, ఇది కూడా భాగమే అని తెలిపారు. ఆయన పేరుతో ఈ అవార్డులు మనకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని తెలిపారు.
-డాక్టర్‌ ఎస్‌.రామ్మూర్తి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -