మూడు ఎకానమిక్ జోన్లుగా రాష్ట్ర అభివృద్ధి
ఇందిరమ్మ జీవిత బీమాతో 1.15 కోట్ల కుటుంబాలకు భరోసా
ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచేలా బడ్జెట్
రాష్ట్ర జీడీపీని పెంపొదించేలా బడ్జెట్ ప్రవేశపెట్టాం : ఉపముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి మల్లు భట్టివిక్రమార్క
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఇందిరమ్మ ప్రభుత్వమంటే ఓ భరోసా అని.. బడ్జెట్ సంఖ్యల చుట్టూ తిరిగే సంఖ్యలు కాదు.. ప్రజల చుట్టూ తిరిగే అంకెలు మాత్రమేనని, ప్రజల జీవనస్థితిగతులు మెరుగు పడటానికి ఉపయోగపడేది బడ్జెట్ అని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. దేశంలోనే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అనేది అతిపెద్ద భరోసా అన్నారు. రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఈ జీవిత బీమా వర్తింపజేస్తున్నట్టు తెలిపారు. ఇటువంటి స్కీం దేశంలోనే ఎక్కడా లేదన్నారు. విద్యా, వైద్య, గృహనిర్మాణం, వ్యవసాయం, పౌష్టికాహారం, పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్, ఉద్యోగాల కల్పన.. ఇలా అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర జీడీపీని పెంపొందించే దిశగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బడ్జెట్ ఆవశ్యకతను వివరిస్తూ భట్టి మాట్లాడారు.
కొత్తగా మూడు స్కీంలు..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలందరికీ పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో అల్పాహారంతోపాటు వారంలో మూడ్రోజులు పాలు, మరో మూడ్రోజులు రాగి జావ ఇవ్వాలని నిర్ణయించామని భట్టి తెలిపారు. ఇంటర్మీడియెట్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించామన్నారు. మానవ వనరులను వృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో ఈ మూడు పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఏడాది కూడా నియోజకవర్గానికి వెయ్యి ఇండ్ల చొప్పున ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రతి నియోజకవర్గానికీ ఓ మోడల్ స్కూల్ చొప్పున మంజూరు చేశామన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్ లెస్ హెల్త్‌కార్డును ప్రవేశపెట్టిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదే అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1.2 కోట్ల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామన్నారు. జీడీపీని పెంపొందించే అనేక రంగాలకూ బడ్జెట్‌లో రాయితీలు ఇచ్చామన్నారు. 68.89 లక్షల పట్టాదారులకు ఎకరానికి రూ.6వేల చొప్పున 3,460.94 కోట్లు రైతుభరోసా కింద రైతుల అకౌంట్లో జమ చేస్తామన్నారు. 45 రోజుల్లో మూడు విడతలుగా రైతుభరోసా రైతులందరి అకౌంట్లలో జమ అవుతాయని తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో స్కిల్డ్ యూనివర్శిటీలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికీ ఓ అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్ చొప్పున మంజూరు చేశామన్నారు.
ఈ సెంటర్స్‌లో చేరే ప్రతి విద్యార్థికీ రూ.2వేల చొప్పున స్టడీఫండ్ ఇచ్చేలా ఏర్పాటు చేశామన్నారు. దీంతోపాటు సీఎం ఓవర్సిస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం అని మరొక స్కీం తీసుకొచ్చామని, దీనిలో భాగంగా ప్రపంచ దేశాల్లో ఉద్యోగాలు పొందడానికి కావాల్సిన ఓ వ్యవస్థను సైతం ఏర్పాటు చేశామని వివరించారు. విద్యార్థులకు చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా చూపించే బాధ్యతను సైతం ప్రభుత్వం తీసుకుందన్నారు. ఈ ఏడాది చివరికల్లా మల్టీసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ బెడ్స్ సంఖ్యను 30వేల నుంచి 44,029కి పెంచనున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. మరో 12,720 సెకండరీ కేర్ ఆస్పత్రులను సైతం అందుబాటులోకి తెచ్చామన్నారు. వీటితోపాటు 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టామన్నారు. రాష్ట్రంలో వైద్యానికి కొదవలేదు అనే రీతిలో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
రోడ్డు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకూ..
విద్యా, వైద్యం, గృహనిర్మాణం, గ్రామీణ రోడ్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లను మెరుగుపరిచేందుకు రూ.13,600 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రాన్ని మూడురకాల ఆర్థికజోన్‌లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోపుల, రీజినల్ రింగ్ రోడ్డు లోపల (పెరీ అర్బన్ రీజినల్ రింగ్ రోడ్ ఎకానమీ) ఫార్మా, ఎడ్యుకేషన్ హబ్ వంటివి ఏర్పాటు చేస్తామన్నారు. తర్వాత రూరల్ రీజినల్ ఎకానమి (రేర్) జోన్‌ను ఏర్పాటు చేసి వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పుతా మన్నారు. వాల్యుయాడెట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మూడు రకాలైన ఎకానమి జోన్‌లతో రాష్ట్ర జీడీపీ దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే మెరుగుపడేలా చర్యలు చేపట్టామని వివరించారు. పట్టాలున్న అటవీభూములకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఇందిరా సౌర గిరి జలవికాస్ పథకం కింద ప్రభుత్వమే బోరు వేయించటంతోపాటు ఎలక్ట్రిక్ మోటారు, డ్రిప్ ఇరిగేషన్ ప్లాంటేషన్ నిమిత్తం 100 శాతం సబ్సిడీతో రుణ సదుపాయం కల్పిస్తుందన్నారు.
దీని ద్వారా 6.7 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతాయన్నారు. సన్నవడ్లకు ఎకరానికి రూ.25వేల దాకా బోనస్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. వీరనారి ఐలమ్మ పేరుతో పెట్టిన యూనివర్శిటీకి రూ.500 కోట్లు, మిగతా విశ్వవిద్యాలయాలకు కూడా అదే స్థాయిలో నిధులు ఇస్తున్నామన్నారు. రాజీవ్ యువ వికాసం కోసం రూ.6వేల కోట్లు, సాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయించామన్నారు. గోదావరి పుష్కరాల కోసం రూ.440 కోట్లు కేటాయించామని తెలిపారు. విలేకరుల సమావేశం లో డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, మాజీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పీసీసీ నాయకులు జావీద్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



