సుందరీకరణతో మా బతుకులు ఆగం చేయొద్దు
జీవిత కాలపు కష్టార్జితంతో కొనుగోలు చేసిన ‘గూడు’
విశ్రాంతి సమయంలో మాకేందుకు ఈ ‘గోడు’
మూసీ ప్రక్షాళనకు మేము అడ్డుకాదు
మా ఇండ్లను ముట్టుకోవద్దు : గాంధీ సరోవర్ నిర్మాణంలో ఇండ్లు కోల్పోతున్న మధుపార్క్ రిడ్జి బాధితులు
సొంత గూడు ప్రతి జీవి కల.. పేదోడు గుడిసె వేసుకున్నా..మధ్య తరగతి ఓ ఫ్లాటు కొనుకున్నా.. ఆ ఇంట్లో బతికేందుకే.. అలా జీవితకాలం కష్టాన్ని ఇంటి కోసమే ఖర్చుచేసిన వారి బతుకుల్లోకి ‘సుందరీకరణ’ ఉప్పెనలా వచ్చింది. అభివృద్ధి ప్రజల జీవినాన్ని మెరుగుపర్చాలి కానీ రోడ్డుపాలు చేస్తే.. పాలకులే దీనికి ఆధ్యులైతే.. వారి గోడును ఎవరికి చెప్పుకోవాలి. ప్రస్తుతం గాంధీ సరోవర్ నిర్మాణంలో ఇండ్లు కోల్పోతున్న మధుపార్క్ రిడ్జి వాసుల పరిస్థితి ఇదే. తాము అభివృద్ధి నిరోధకులం కాదని, ఇంటి కోసం అత్మరక్షణ పోరాటం చేస్తున్నామని వారు చెబుతున్నారు. ఆ అపార్ట్‌మెంట్‌తో వారికున్న అనుబంధాన్ని, అక్కడి మానవ సంబంధాలను, ప్రభుత్వం నిర్ణయంతో తాము పడే అవస్థలను నవతెలంగాణ ప్రతినిధితో వెల్లబోసుకున్నారు.
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళనతోపాటు గాంధీ సరోవర్ నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మధుపార్కు రిడ్జి అపార్టుమెంట్ వాసులను ఖాళీ చేయించేందుకు నోటీసులు జారీ చేసింది. దాంతో ఆ అపార్ట్‌మెంట్ వాసులు ఆందోళన చెందుతున్నారు. మధుపార్కు అపార్టుమెంట్ నిర్మాణానికి 2003లో నాటి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. సుమారు 6.5 ఎకరాల్లో నిర్మించారు. రెండు బ్లాక్‌లుగా ఏ, బీగా నిర్మాణాలు చేపట్టారు.
ఏ-బ్లాక్‌లో 162 ఫ్లాట్లు ఉండగా, బీ-బ్లాక్‌లో 250 ఫ్లాట్లు మొత్తం 412 ఫ్లాట్లు ఉన్నాయి. సుమారు 450 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇప్పుడు ఈ ప్రాంతం బఫర్ జోన్‌లో ఉందని ప్రభుత్వమంటోంది. 2013 చట్టం ప్రకారం బఫర్ జోన్‌ను నిర్ధారించినట్టు చెబుతోంది. ఇన్నిరోజులు ఈ అపార్టుమెంట్ బఫర్ జోన్‌లో ఉందనే విషయం తమకేందుకు చెప్పలేదని నివాసితులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఉన్నట్టుండి అభివృద్ధి పేరుతో అపార్టుమెంట్‌ను కూల్చితే.. తమ పరిస్థితి ఏంటనీ ప్రశ్నిస్తున్నారు.
విశ్రాంతి సమయంలో అయోమయం
ఇక్కడ నివాసం ఉంటున్న వారిలో 60 శాతం మంది రిటైర్డ్ ఉద్యోగులే. ఆర్మీ, నేవీ, దేశ రక్షణ విభాగాలతోపాటు వివిధ ప్రభుత్వ, ప్రయివేట్ కీలక రంగాల్లో పనిచేసిన వారు కూడా ఉన్నారు. సుమారు 50 నుంచి 60 వరకు ఆర్మీ కుటుంబాలు ఉన్నాయి. ”ఉద్యోగ సమయంలో ఉరుకులు పరుగుల జీవితం గడిపాం. రిటైర్మెంట్ తరువాత విశ్రాంతి తీసుకోవడానికి జీవిత కాలపు కష్టాన్నంతా పెట్టి మధు పార్కులో ఫ్లాటు కొనుగోలు చేశాం. ఇప్పుడు ఉన్న ఫలంగా అపార్ట్‌మెంట్‌ను కూలగొడతాం అంటున్నారు. ఇక్కడి వారితో ఉన్న మానవ సంబంధాలు, ఇక్కడి వాతావరణం, ఇంటితో ఉన్న అనుబంధం మరోచోట ఉంటుందా..” అని అపార్ట్‌మెంట్‌వా సులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంక్ లోన్లు తీసుకుని ఫ్లాట్ కొనుగోలు
అపార్టుమెంట్‌లో చాలా మంది ప్రయివేటు ఉద్యోగులు బ్యాంక్ లోన్లు తీసుకుని ఫ్లాట్లు కొనుగోలు చేశారు. 2024లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ.90 లక్షలు పెట్టి ఫ్లాటు కొనుగోలు చేశారు. అదనంగా మరో రూ.పది లక్షలు ఇంటి కోసం ఖర్చు చేశాడు. మొత్తం కోటి రూపాయలు బ్యాంక్ లోన్ తీర్చేందుకు 20 ఏండ్ల కాల పరిమితి పెట్టుకున్నాడు. ఉన్న ఫలంగా ప్రభుత్వం ఇక్కడి నుంచి ఖాళీ చేయమనడంతో ఆ కుటుంబ ఆవేదన వర్ణణాతీతం. ప్రభుత్వం ఇచ్చే పరిహారం బ్యాంక్ లోన్‌కు కూడా సరిపోదని, తమ కుటుంబం ఎక్కడికి వెళ్లి, ఎలా బతకాలని ఆ ఉద్యోగి ఆవేదన చెందుతున్నాడు. మొత్తం అపార్ట్‌మెంట్‌వాసులదీ ఇదే పరిస్థితి. తమ అపార్ట్‌మెంట్ జోలికి రాకుండా.. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని మధుపార్క్ రిడ్జి అపార్ట్‌మెంట్‌వాసులు కోరుతున్నారు. తమకు న్యాయం చేయాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
అభివృద్ధి నిరోధకులం కాదు
ఆర్.వీ ప్రసాద్, రిటైర్డ్, ఆర్మీ
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను మేము అడ్డుకోం.. కానీ ఆ పేరుతో మా బతుకులను బుగ్గిపాలు చేస్తామంటే ఊరుకోం. నా చిరకాల కోరిక సొంత ఇంటి నిర్మాణం. ఉద్యోగ విరమణ తరువాత ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలని మధుపార్కు అపార్టుమెంట్‌లో 2014లో ఫ్లాట్ తీసుకున్నా. 12 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నా. ఇప్పటి వరకు ఈ అపార్టుమెంట్ బఫర్ జోన్‌లో ఉందని ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి ప్రభుత్వం బఫర్ జోన్‌లో ఉంది ఖాళీ చేయాలంటే మేం ఎక్కడికి వెళ్లేది. ఈ వయసులో ఎక్కడికి పోయి బతకాలి. దేశం కోసం సేవ చేసిన వాళ్లని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు. ప్రభుత్వం గాంధీసరోవర్ నిర్మించా లంటే.. చాలా ప్రాంతాలు ఉన్నాయి. ప్రభుత్వ భూమిలో నిర్మించుకోవాలి. 60 శాతం వృద్ధులు ఉండే ప్రాంతం కావాల్సి వచ్చిందా..? ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
విశ్రాంతి సమయంలో కష్టాలు..
జీ.రవిందర్‌నాథ్, రిటైర్డ్ నేవీ అధికారి
ఉద్యోగ సమయంలో ఉరుకుల, పరుగుల జీవితాన్ని గడిపాం.. రిటైరయ్యాక ప్రశాంత వాతావరణంలో గడుపుదామంటే.. మమ్మల్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశాంతంగా ఉండనిచ్చేట్టు లేడు. మూసీని సుందరీకరణ చేయండి.. మేం వద్దనడం లేదు. కానీ మా అపార్టుమెంట్‌ను ముట్టొదు. మధు పార్కు మా ఆత్మ.. మా ఆత్మ రక్షణ కోసం ఎక్కడిదాకనైనా పోరాటం చేస్తాం.



