Monday, March 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10శాతం తల్లిదండ్రులకు..

ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10శాతం తల్లిదండ్రులకు..

- Advertisement -

18 ఏండ్లలోపు పిల్లల డిజిటల్‌ మీడియాపై నియంత్రణ
విద్వేష ప్రసంగాల నిరోధానికి చట్టం
సాధ్యాసాధ్యాలపై చర్చించనున్న మంత్రివర్గం
సీఎం రేవంత్‌ అధ్యక్షతన నేడు క్యాబినెట్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘దేశంలోను, రాష్ట్రంలోనూ కన్నతల్లిదండ్రులను పట్టించుకోని ఉదంతాలను చూస్తున్నాం.. అలా కన్నవారిని గాలికొదిలేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మా ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించనుంది. వారి జీతాల్లోంచి ఎంతో కొంత తల్లిదండ్రుల ఖాతాల్లోకి జమయ్యే విధంగా విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం…’ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పిన మాటలివి. ఆయన చెప్పిన ఈ అంశాన్ని సోమవారం నిర్వహించబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో సాయంత్రం 5 గంటలకు క్యాబినెట్‌ భేటీ కానుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లోంచి కనీసం 10 నుంచి 15 శాతం వరకు తల్లిదండ్రుల ఖాతాల్లో జమయ్యేలా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందనే అంశంపై చర్చించనున్నారు.

దీనికి మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తే… ఆ వెంటనే అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నారని సమాచారం. దీంతోపాటు 18 ఏండ్లలోపు పిల్లలను డిజిటల్‌ మీడియా నుంచి రక్షించేందుకు వీలుగా ‘డిజిటల్‌ మీడియా నిరోధక, నియంత్రణ చట్టాన్ని’ తీసుకురావాలనే అంశంపై క్యాబినెట్‌ చర్చించనుంది. ఇందుకు సంబంధించి వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతులు, సాంకేతికాంశాలను పరిశీలించి విధి విధానాలు ఖరారు చేయటంపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో ‘మత విద్వేష ప్రసంగాల నియంత్రణ’కు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా క్యాబినెట్‌ సమాలోచనలు చేయనుంది.

దీనిపై కర్నాటక ప్రభుత్వం ఇప్పటికే కొంత కసరత్తులు చేసింది. వాటిపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితోపాటు గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గిగ్‌ వర్కర్ల బిల్లు, క్యూర్‌.. ప్యూర్‌..రేర్‌లకు సంబంధించిన బిల్లుల సవరణపై క్యాబినెట్‌లో చర్చించి, ఆమోదముద్ర వేయనున్నారు. వీటన్నింటిలో ఏయే అంశాలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపితే.. ఆయా అంశాలపై అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెడతారని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో సమయాన్నిబట్టి వాటికి ఆమోదముద్ర వేస్తారు. టైం సరిపోకపోతే వచ్చే వర్షాకాల సమావేశాల్లో వాటిని ఓకే చేస్తారని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -