బస్తాకు ప్రభుత్వం రూ.2వేల సహాయం చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు
మిర్చి కోల్డ్ స్టోరేజీ సందర్శన
నవతెలంగాణ-మధిర
ఖమ్మ జిల్లా మధిర మండలం ఆత్కూరు క్రాస్‌రోడ్డు సమీపంలో గల సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్‌లో శనివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక్కో మిర్చి బస్తాకు తక్షణ సహాయం కింద రూ.2వేలు అందించాలని డిమాండ్ చేశారు. ఆదివారం సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్‌ను పోతినేని సుదర్శన్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిర్చి రైతులు ఆరుకాలం శ్రమించి పంటను కాపాడుకున్నారని, ధర గిట్టుబాటు కాక కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకుంటే.. అగ్ని ప్రమాదం వారి శ్రమనంతా బుగ్గి చేసిందని తెలిపారు.
సుమారు 300 మందికి సంబంధించిన 28వేల మిర్చి బస్తాలు దగ్ధమైనట్టు తెలుస్తోందన్నారు. రైతులను తక్షణం ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదన్నారు. మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించి తక్షణ సహాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు సీపీఐ(ఎం), తెలంగాణ రైతు సంఘం అండగా ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలోని అత్యధిక కోల్డ్ స్టోరేజీలున్న మధిర ప్రాంతంలో అధునాతన టెక్నాలజీ కలిగిన జంబో ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ పర్యటనలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మందా సైదులు, పట్టణ కార్యదర్శి పడకంటి మురళి, పార్టీ సీనియర్ నాయకులు మందడపు ఉపేంద్రరావు, షేక్ ఉద్దండు సాహెబ్, చావా నరేష్, రెండు రాష్ట్రాల బాధిత రైతులు పాల్గొన్నారు.



