ఎక్కడి పనులు అక్కడే
కొరవడిన జెడ్సీలు, డీసీల పర్యవేక్షణ
ఆస్తి పన్ను వసూలూ అంతంతే..!
పది రోజుల కోసం ప్రత్యేక డ్రైవ్
అయినా లక్ష్యం చేరుకునేది కష్టమే
ఇంకా కొలిక్కి రాని ‘ఎంఎంసీ’ పాలన
నవతెలంగాణ-సిటీబ్యూరో
కొత్తగా ఏర్పడిన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో పాలన ఇంకా గాడిన పడలేదు. ఎక్కడి పనులు అక్కడే దర్శనమిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన మున్సిపల్ సర్కిళ్లలోనూ సమస్యలు ఉన్నాయి. అధికారులు ఇంకా పాలనపై పట్టు సాధించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జెడ్సీలు, డీసీల పర్యవేక్షణ కొరవడంతో సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. ఆస్తి పన్ను వసూలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రత్యేక డ్రైవ్ పెట్టినా.. లక్ష్యం చేరుకునేది కష్టంగానే కనిపిస్తోంది.
సమస్యల ‘ఎంఎంసీ’..!
99 రోజుల కార్యాచరణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలోనైనా సమస్యలకు పరిష్కారం లభిస్తుందేమోనని ప్రజలు భావించినా.. మున్సిపల్ సర్కిళ్లలో డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణ లోపించడం, వార్డు ఆఫీసర్ల పనితీరులో మెరుగుదల లేకుండా పోతోంది. ఆయా వార్డుల్లో పేరుకుపోయిన రోడ్లు, డ్రయినేజీ, పారిశుధ్య తదితర సమస్యలతోపాటు పలు కాలనీలు, బస్తీల్లో నెలకొన్న తాగునీటి ఇబ్బందులతో కార్పొరేషన్ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రధానంగా ఘట్కేసర్, కీసర, కాప్రా, ఉప్పల్, హయత్‌నగర్ తదితర సర్కిళ్లలోని వార్డుల్లో ప్రధాన రోడ్లపై వీధిలైట్లు వెలగకపోవడంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయా సర్కిళ్లలో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. రోడ్ల పక్కనే చెత్త పారబోయడంతో గాలికి వ్యర్థాలు కొట్టుకొచ్చి ఇండ్ల మధ్య చేరుతున్నాయి. రోడ్డు పక్కన మురుగు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తోంది. అక్రమ కట్టడాలు, అనుమతి లేకుండా బహుళ అంతస్తుల భవనాలు వెలిసినా పట్టించుకోవడం లేదు.
అన్నీ ఉన్నా జాప్యమే..
ధ్రువీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంబంధిత పత్రాలు సకాలంలో అందకపోవడంతో కార్యాలయాల్లో ఫైల్స్ కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. దీంతో అబ్దిదారులు సంబంధిత కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. బర్త్, డెత్, మ్యారేజ్ సర్టిఫికెట్లు (ధ్రువీకరణ పత్రాలు) సహా ఇంటి అనుమతులు, ఇంటి నెంబర్లు, మ్యూటేషన్లు, నల్లా అనుమతులు పొందడానికి కూడా స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని అనుమతులతో ఇండ్లు నిర్మించుకున్నా.. ఇంటి నెంబర్ల కేటాయింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇండ్లు, బహుళ అంతస్తులు నిర్మించుకుని ఇంటి నెంబర్లు పొందకుండానే ఏండ్ల తరబడి విద్యాసంస్థలు, వివిధ రకాల వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నప్పటికీ డీసీలు, వార్డు ఆఫీసర్లు, టైన్ ప్లానింగ్ విభాగం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
తక్కువ వ్యవధి.. ఎక్కువ టార్గెట్..!
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పాలనా తీరు. జీహెచ్‌ఎంసీ నుంచి విడిపోయి దాదాపు రెండు నెలలు కావొస్తున్నా.. పన్ను వసూలుపై దృష్టి సారించకుండా చివరి 15 రోజులకు గాను ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. 90శాతం వడ్డీ మాఫీతో ఈనెల 31వ తేదీ వరకు అవకాశం కల్పించారు. సెలవు దినాల్లోనూ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎక్కువ బకాయిలున్న 100 మంది ఆస్తి పన్ను బకాయిదారులను గుర్తించి వారికి ఫోన్ చేసి ఆస్తి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. అయినా లక్ష్యం చేరుకునేది కష్టంగానే ఉంది.
ఎంఎంసీ ఆస్తి వసూలు లక్ష్యంగా రూ.1,820 కోట్లు కాగా.. మొత్తం 7,91,507 మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ విడిపోయే నాటికి రూ.415 కోట్లు మాత్రమే వసూలు కాగా.. ఆ తర్వాత నుంచి మందగించింది. పాత బకాయిదారులను ప్రోత్సహించేందుకు 90శాతం వడ్డీ రూపంలో మాఫీ చేసినా.. ఈ పది రోజుల్లో లక్ష్యం చేరుకునేది కష్టంగానే ఉంది. ఓటీఎస్ పద్దతి ద్వారా ఇప్పటి వరకు కేవలం రూ.80 కోట్లు మాత్రమే వసూలైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్లు, ఇతర పన్నుల వసూళ్లకు మరో 10 రోజులు మాత్రమే గడువు మాత్రమే మిగిలి ఉండటంతో లక్ష్యం చేరుకునేది కష్టంగానే కనిపిస్తోంది.



