వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు
రాపోలు గ్రామంలో రైతులతో కలిసి నిరసన
నవతెలంగాణ-పరిగి
వికారాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో ఇండిస్టియల్ కారిడార్ పేరుతో 1,197 ఎకరాల భూమిని ప్రభుత్వం బలవంతంగా తీసుకోవడం ప్రజాస్వామ్యవిరుద్ధమని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు అన్నారు. ఆదివారం పరిగి మండలం కాళపూర్, రాపోలు గ్రామాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు కోల్పోతున్న రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ముందుగా ప్రజాసంఘాల నాయకులు, రైతులు కలిసి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో రైతుల సంక్షేమం, భూమి రక్షణ, న్యాయమైన పరిహారం, పారదర్శక విధానాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రభుత్వం పేదల భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలు అమలు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. భూ సేకరణలో చట్టబద్ధమైన ప్రక్రియలను పక్కనపెట్టి సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఏస్‌ఐఏ) నిర్వహించకపోవడం, గ్రామ సభ అనుమతి తీసుకోకపోవడం సరికాదన్నారు. సరైన పరిహారం, పునరావాసం ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. రాపోల్, కాళపూర్ గ్రామాల్లో భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని, రైతులు, కూలీల అనుమతి లేకుండా ఎకరం కూడా తీసుకోవద్దని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేసి, పేదల భూములను రక్షించాలన్నారు. ఎస్‌ఐఏ నిర్వహించి గ్రామ సభల ద్వారా నిర్ణయం తీసుకోవాలన్నారు.
పునరావాసం, ఉపాధి హామీ, పూర్తి పరిహారం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం వెంటనే తన విధానాలను మార్చుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కార్మికులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వెంకటయ్య, బుస చంద్రయ్య, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు రవి, రైతు స్వరాజ వేదిక నాయకురాలు లక్ష్మి, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక సభ్యులు మీరా, బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కిన మానస, బీసీ, ఎస్టీ, ఎస్టీ జాక్ వికారాబాద్ రవీందర్, ఎల్లయ్య, వెంకటేష్, రైతులు పాల్గొన్నారు.



