Monday, March 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅడవుల సంరక్షణతోనే సుస్థిర భవిష్యత్‌

అడవుల సంరక్షణతోనే సుస్థిర భవిష్యత్‌

- Advertisement -

మంత్రి దనసరి సీతక్క
పస్రాలో ‘అడవుల సంరక్షణ- ఆవశ్యకత అవగాహన ర్యాలీ’

నవతెలంగాణ-గోవిందరావుపేట
అడవుల సంరక్షణతోనే సుస్థిర భవిష్యత్‌కు బలమైన పునాది లభిస్తుందని, స్వచ్ఛమైన ప్రాణవాయువుకు అడవులే మూలాధారంగా ఉంటాయని పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలను నాటాలని, అడవుల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని చెప్పారు. ప్రపంచ అటవీ దినోత్సవ సందర్భంగా ఆదివారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పస్రా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అడవుల సంరక్షణ – ఆవశ్యకత అవగాహన ర్యాలీ’ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాగా ములుగు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు.

పంటలు సమృద్ధిగా పండాలన్నా.. రైతులకు సరిపడా వర్షపాతం నమోదు కావాలన్నా అడవులే కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అడవులు అంతరించిపోతే మానవ మనుగడ సైతం అంతరించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో ఇప్ప చెట్లను దైవంగా భావిస్తూ వాటిని అక్కడి ప్రజలు సంరక్షించుకుంటారని తెలిపారు. అడవుల ద్వారా గిరిజనులకు గిరిజనేతరులకు అనేక లాభాలు ఉంటాయని, స్థానిక గిరిజనులు ఉపాధి పొందుతున్నారని అన్నారు. అటవీ శాఖ అధికారులకు స్థానిక ప్రజలు, యువకులు సహాయ సహకారాలు అందించినప్పుడు పూర్తిస్థాయిలో అడవుల రక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. కొంతమంది స్వలాభం కోసం వేసవిలో అడవులకు నిప్పు పెట్టడం వల్ల మొక్కలు, ఔషధ గుణాలున్న చెట్లు కాలిపోతున్నాయని, వన్యప్రాణులను వేటాడటం, చెట్లను నరకడం వంటి కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ములుగు జిల్లా ప్రకృతి రమణీయమైన జిల్లాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందన్నారు. ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలు, దట్టమైన అటవీ ప్రాంతాలు ఉండటంతో అనేకమంది పర్యాటకులు ములుగు జిల్లా అందాలను తిలకించడానికి వస్తున్నారని తెలిపారు. అటవీ దినోత్సవం వేడుకలకే పరిమితం కాకూడదని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు, రోడ్డు పక్కన, చెరువు గట్ల వెంట మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి కోరారు. ములుగు జిల్లాను అటవీ సంరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్‌ టీఎస్‌ దివాకర, ఎస్పీ సుధీర్‌ రామ్నాథ్‌ కేకన్‌, డీఎఫ్‌ఓ రాహుల్‌ కిషన్‌ జాదవ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -