Tuesday, March 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమీరు చెప్పినవే అమలు చేస్తున్నా.. అడ్డుకుంటారెందుకు?

మీరు చెప్పినవే అమలు చేస్తున్నా.. అడ్డుకుంటారెందుకు?

- Advertisement -

ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి సూటి ప్రశ్న
నాశనమైపోతున్న నల్లగొండను చూడాలంటూ హితవు
ఏ ఒక్కరినీ రోడ్డున పడేయబోమంటూ హామీ
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడి
రెచ్చగొట్టే వారి ఉచ్చులో పడొద్దని ప్రజలకు విజ్ఞప్తి
శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో మూసీపై సీఎం సుదీర్ఘ సమాధానం
రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలంటూ ప్రతిపక్షాలకు పిలుపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘అవి మీరు చెప్పినవే… ఆ చట్టాలు, ఉత్తర్వులు, నిబంధనలు మీరు తెచ్చినవే. వాటితో ప్రజలకు మేలు కలుగుతుందని భావించి, అమలు చేస్తుంటే అడ్డుకుంటారెందుకు?, నాశనమైపోతున్న నల్లగొండ ప్రజలను చూస్తే మూసీ పునర్జీవనం వద్దనగలమా?.. ‘ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ను సూటిగా ప్రశ్నించారు. మూసీ నది అభివృద్ధిలో భాగంగా ఎవ్వర్నీ నిరాశ్రయులను చేయబోమని ఆయన హామీ ఇచ్చారు. మూసీ పరిధిలో ఉన్న బాధితులందరికీ పునరావాసం కల్పిస్తామని భరోసానిచ్చారు. మెరుగైన జీవన ప్రమాణాలు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మూసీ పరీవాహకంలో ఉన్న వారందరికీ తగిన న్యాయం చేస్తామని సోమవారం శాసనమండలిలో ప్రకటించారు.

రెచ్చగొట్టే వారి ఉచ్చులో పడొద్దని ఆయన ప్రజలను కోరారు. అనేక సరస్సులు, చెరువులు, గొప్ప కట్టడాలున్నా…..మానవ తప్పిదాల వల్లే సమస్యలు వస్తున్నాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయ మార్గాలు పెరిగి ప్రతి కుటుంబంలో కార్లు పెరిగాయని, ట్రాఫిక్‌ రద్దీ పెరగడం వల్లే మెట్రో, ఎంఎంటీఎస్‌లను విస్తరించుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ బాగా పెరిగిందనీ, అందువల్ల రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. క్యూర్‌, ప్యూర్‌, రేర్‌గా విభజించి ట్రాఫిక్‌ రద్దీని తగ్గేలా చూస్తున్నామన్న ఆయన, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ బయటకు తరలిస్తామని స్పష్టం చేశారు. రోడ్లను అండర్‌ పాస్‌లు, సర్ఫేస్‌, ఎలివేటెడ్‌ కారిడార్లుగా విభజించామని, ఎక్కడా ట్రాఫిక్‌ ఆగకూడదనేదే తమ ప్రధాన లక్ష్యమని వివరించారు.

మూసీ ప్రాజెక్టుపై సలహాలు, సూచనలు స్వీకరించడానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌తో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తామని సీఎం ప్రకటించారు. సోమవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, అద్దంకి దయాకర్‌ లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందనీ, ప్రస్తుతం ఉన్న వసతుల కంటే మెరుగైన సౌకర్యాలతో పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ ప్రాజెక్ట్‌ను తమ ప్రభుత్వం కొత్తగా తీసుకురాలేదనీ, కేసీఆర్‌ హయాంలో ప్రారంభమైన విధానాన్నే కొనసాగిస్తున్నామని చెప్పారు. మూసీ నది ప్రక్షాళన అత్యవసరమనీ, కాలుష్య ప్రభావంతో నల్లగొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటలను కూడా వినియోగించుకోలేక పోతున్నామని చెప్పారు. నల్లగొండ ప్రజల ఫ్లోరోసిస్‌ కష్టాలను, వారి ఆవేదనను చూసిన వారెవరూ మూసీ ప్రక్షాళనను అడ్డుకోబోరని వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు, తెలంగాణ భవిష్యత్తుకు నిర్మించుకుంటున్న రోడ్‌మ్యాప్‌ అని సీఎం అభివర్ణించారు.

మూసీ ప్రాజెక్టుపై నిర్మాణాత్మక సలహాలిస్తే స్వీకరిస్తాం
మూసీ ప్రాజెక్టుపై రాజకీయం చేయకుండా, ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాత్మక సలహాలిస్తే ప్రభుత్వం తప్పకుండా స్వీకరిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి నీటిని తరలిస్తున్నామనీ, అందులో 17 టీఎంసీలు తాగునీటి కోసం కాగా, మిగిలిన నీటిని మూసీలో నిరంతరం ప్రవహించేలా వినియోగిస్తామని వెల్లడించారు. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సబర్మతి నది ప్రక్షాళనకు అక్కడి కాంగ్రెస్‌ మేయర్‌ సహకరించారని గుర్తుచేశారు. ‘తెలంగాణ రైజింగ్‌ – 2047’ ప్రణాళిక ద్వారా హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తెలంగాణ రూపురేఖలు మార్చేందుకే క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ మోడల్‌ తీసుకొస్తున్నామని చెప్పారు. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న 1.34 కోట్ల జనాభా ప్రాంతాన్ని కాలుష్య రహితంగా మారుస్తామన్నారు.

రెడ్‌, ఆరెంజ్‌ జోన్‌ ఉన్న పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ అవతలికి తరలించి, ఆ భూములను మల్టీయూజ్‌ జోన్‌ గా మార్చి మధ్యతరగతి నివాస ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. హిల్ట్‌ పాలసీతో పరిశ్రమల తరలింపు వల్ల యాజమాన్య హక్కులు మారవనీ, కేవలం భూ వినియోగం మాత్రమే మారుతుందని సీఎం స్పష్టం చేశారు. ఆ భూములను మల్టీజోన్‌గా అభివృద్ధి చేసి సేవా రంగానికి వినియోగిస్తామని తెలిపారు. ఢిల్లీలో కాలుష్యం, ముంబైలో వర్షాల ఇబ్బందులు, బెంగళూరులో ట్రాఫిక్‌ జామ్‌ వంటి పరిస్థితులు హైదరాబాద్‌కు రాకూడదనే ఉద్దేశంతోనే ‘హిల్ట్‌ పాలసీ’ అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఒకప్పుడు ‘లేక్‌ అండ్‌ రాక్‌ సిటీ’గా ఉన్న నగరానికి పూర్వవైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. రూ.24 వేల కోట్లతో 74 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ చేపడుతున్నామని తెలిపారు. మెట్రో ప్రాజెక్ట్‌ విషయంలో ఎల్‌ అండ్‌ టి సహకరించలేదన్నారు. కేంద్ర సూచనల మేరకు రూ.15 వేల కోట్లతో మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఎయిర్‌ పోర్టుకు మెట్రో కనెక్టివిటీ కల్పిస్తామన్నారు.

ఎంతో చరిత్ర కలిగిన అద్భుతమైన నగరం హైదరాబాద్‌ ఇప్పుడు కాలుష్యం, ట్రాఫిక్‌ ఇబ్బందుల వంటి ఎన్నో సమస్యలతో సతమతమవుతోందని సీఎం వివరించారు. మూసీ ప్రాజెక్టుతో పాటు ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఎలివేటెడ్‌ కారిడార్లకు ఎక్కువ భూమి కూడా అవసరం లేదని వివరించారు. గతంలో మాదిరిగా నచ్చితే నజరానా.. లేకపోతే జరిమానా విధించే విధానం ఉండదు, గుడ్‌ గవర్నెన్స్‌ కాదు, మాది స్మార్ట్‌ గవర్నెన్స్‌ అని సీఎం చెప్పారు. పంజాగుట్ట, హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మాణం లో ఉన్నాయని, జూన్‌-జూలై నాటికి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నగరం నుంచి బయటకు వెళ్లేందుకే ఎలివేటెడ్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించేందుకు వీలుగా హైదరాబాద్‌ సిగల్స్‌ వద్ద వాహనాలు ఆగకుండా ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఫుట్‌ పాత్‌ ఆక్రమణలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, చిన్న వ్యాపారులకు ఇబ్బంది ఉన్నా ఆక్రమణలు తొలగిస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -