పర్షియన్ గల్ఫ్ అంతటా మైన్స్ పెడతాం
ప్రతీకార దాడులు తీవ్రతరం చేస్తాం
హెచ్చరించిన ఇరాన్
టెహ్రాన్ లక్ష్యంగా వైమానిక దాడులు
(నవ తెలంగాణ – సెంట్రల్ డెస్క్)
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ ప్రారంభించిన యుద్ధం సోమవారం 24వ రోజుకు చేరుకుంది. దాడులు-ప్రతి దాడులు, హెచ్చరికలు-బెదిరింపుల మధ్య మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పెరిగిపోతోంది. హర్మూజ్ జలసంధిని 48 గంటలలో తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ వ్యవస్థలను నేలమట్టం చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన బెదిరింపులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ తీర ప్రాంతాలు, దీవుల జోలికి వస్తే హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని, పర్షియలన్ గల్ఫ్ అంతటా సముద్ర మందుపాతరలు అమరుస్తామని, మధ్యప్రాచ్యంలోని ఇంధన, జల మౌలిక సదుపాయాలపై ప్రతీకార దాడులు చేస్తానని ఇరాన్ రక్షణ మండలి హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయిల్‌లోని విద్యుత్ ప్లాంట్లను పేల్చివేస్తామని, మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలకు విద్యుత్ సరఫరా చేస్తున్న వ్యవస్థలను నాశనం చేస్తామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తెలిపింది.
టెహ్రాన్ మౌలిక సదుపాయాలపై ఇజ్రాయిల్ దాడులు
టెహ్రాన్‌లోని మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు జరిపింది. టెహ్రాన్ మధ్య, దక్షిణ, తూర్పు ప్రాంతాలలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. రాజధానిలోని సయ్యద్ షిరాజీ హైవేపై ఉన్న ఎలక్ట్రానిక్స్ కేంద్రంపై ఇజ్రాయిల్ సేనలు దాడి చేశాయి. టెహ్రాన్‌కు పశ్చిమాన ఉన్న కరజ్ నగరంపై జరిగిన వైమానిక దాడి కారణంగా ఆకాశంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. బందర్ అబ్బాస్ నగరంలోని ఇరాన్ రేడియో స్టేషన్‌కు చెందిన వంద కిలోవాట్ల ఏఎం ట్రాన్స్‌మిటర్‌పై అమెరికా-ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఓ వ్యక్తి మరణించాడు. వాయవ్య ప్రాంతంలోని ఉర్మియా నగరంపై జరిగిన వైమానిక దాడులలో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి.
శిథిలాల కింద చిక్కుబడిన వారిని కాపాడేందుకు సహాయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. క్వామ్ రాష్ట్రంలో ఉన్న టర్బైన్ ఇంజిన్ ఉత్పత్తి కేంద్రంపై దాడి చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఐఆర్‌జీసీకి కావాల్సిన డ్రోన్లు, విమానాల విడిభాగాలను ఇక్కడ తయారు చేస్తారు. ఇదిలా వుండగా లెబనాన్‌లోని హెజ్బొల్లాను లక్ష్యంగా చేసు కుంటున్న ఇజ్రాయిల్ తాజాగా దక్షిణ ప్రాంతంలోని ఖాసిమియాహ్ బ్రిడ్జిని పేల్చివేసింది. ఇక భూతల దాడులు ప్రారంభం కాబోతున్నాయని లెబనాన్ అధ్యక్షుడు జోసఫ్ ఔన్ తెలిపారు. ఈ నెల 2వ తేదీ నుంచి లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరిపిన దాడులలో 1,029 మంది చనిపోయారని అధి కారులు చెప్పారు. ఇరాక్‌లో ఇప్పటి వరకూ 60 మంది మరణించగా వారిలో చాలా మంది ఇరాన్ అనుకూల పాప్యులర్ మొబిలైజేషన్ దళాలకు చెందిన వారే.
క్షిపణుల ద్వారా ఇజ్రాయిల్‌కు యుద్ధ వ్యతిరేక సందేశం
యుద్ధానికి తాను వ్యతిరేకినంటూ స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంఛెజ్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ స్పందించింది. ‘అవును. ఈ యుద్ధం అక్రమమే కాదు…అమానవీయం కూడా…ప్రధానికి కృతజ్ఞతలు’ అంటూ రాసిన సందేశంతో కూడిన స్టిక్కర్‌ను ఐఆర్‌జీసీ దళాలు ఓ బాలిస్టిక్ క్షిపణిపై అంటించి ఇజ్రాయిల్‌పై ప్రయోగించాయి. ఆ సమయంలో ఐఆర్‌జీసీ సభ్యుడొకరు అల్లాహో అక్బర్ (దేవుడు గొప్పవాడు) అని అనడం వినిపించింది. ఈ సందేశం ఆంగ్లం, పర్షియా భాషలలో రాసి ఉంది. ఇరాన్‌పై యుద్ధం సమర్ధనీయం కాదని, అది అక్రమమని, ప్రమాదకరమని సాంఛెజ్ అంతకుముందు టెలివిజన్ ప్రసంగంలో వ్యాఖ్యానించారు. కాగా ఆయుధాలపై రాయడం, వాటికి సందేశాలను జతకలపడం కొత్తేమీ కాదు. ఈ నెల ప్రారంభంలో ఇరాన్ సైనికులు క్షిపణులపై నినాదాలు రాశారు. మధ్యప్రాచ్యం నుంచి చివరి అమెరికా సైనికుడు వెళ్లిపోయే వరకూ దాడులు ఆపబోమని వాటి సారాంశం.
హర్మూజ్‌ను దాటిన రెండు భారతీయ ఎల్పీజీ నౌకలు
ఇంధన కొరత ఆందోళన కలిగిస్తున్న తరుణంలో భారత్‌కు ఊరట కలిగించేలా రెండు ఎల్పీజీ నౌకలు సోమవారం హర్మూజ్ జలసంధిని దాటి అంతర్జాతీయ జలాలలో ప్రవేశించాయి. ఐఆర్‌జీసీ అను మతితో జగ్ వసంత్, పైన్ గ్యాస్ అనే నౌకలు ఇరాన్ లోని లరక్, ఖ్వెష్మ్ దీవుల మధ్యకు చేరుకున్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇవి త్వరలోనే మన దేశానికి చేరుకుంటాయని వారు చెప్పారు. జలసంధిని దాటేందుకు భారత నౌకలను ఇరాన్ అనుమతిస్తున్పటికీ ఆ దేశానికి చెందిన చమురు క్షేత్రాలపై అమెరికా దాడులు జరుపుతుండడంతో వాటి ప్రయాణం ఆలస్యమవుతోంది. జలసంధికి పశ్చిమాన ఉన్న 22 భారత నౌకలలో ఆరు ఎల్పీజీని సరఫరా చేసేవే.
పాక్‌లో 200 శాతం పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధర
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధిలో చమురు నౌకల రవాణాకు ఎదురవుతున్న ఆటంకాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలకు తీవ్ర అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీమియం పెట్రోల్ ధరను పాకిస్తాన్ 200 శాతం పెంచేసింది. నిన్నటి వరకూ లీటరు ప్రీమియం పెట్రోల్ ధర వంద పాకిస్తాన్ రూపాయలుగా ఉండగా ఇప్పుడది 300కు చేరింది. ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రీమియం పెట్రోల్ ధర పెంపునకు పాక్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ ఆమోదం తెలిపారు. విలాస వంతమైన వాహనాలలో ప్రీమియం పెట్రోలును ఎక్కువగా వినియోగిస్తారు. ఈ నిర్ణయం కారణంగా ప్రభుత్వానికి నెలకు తొమ్మిది బిలియన్ రూపాయలు ఆదా అవుతాయని, ఈ మొత్తంతో సామాన్య ప్రజలకు ఊరట కలిగించవచ్చునని, ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గిపోతుందని షరీఫ్ ఓ ప్రకటనలో తెలిపారు.
గల్ఫ్ దేశాలే లక్ష్యంగా…
ఇజ్రాయిల్ పైన, గల్ఫ్ దేశాల పైన ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఐఆర్‌జీసీ దళాలు దాడి చేశాయి. రియాద్ దిశగా ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. యూఏఈ రాజదాని అబూధాబీని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకునే క్రమంలో అల్-షమేఖ్ ప్రాంతంలో శకలాలు పడ్డాయి. ఈ ఘటనలో ఓ భారత జాతీయుడు గాయపడ్డారు. బహ్‌రైన్‌లోని అమెరికా ఐదో ఫ్లీట్‌పై ఐఆర్‌జీసీ దళాలు క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశాయి. ఇజ్రాయిల్‌లోని పలు ప్రాంతాలపై ఇరాన్ దాడులు జరపడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. సెంట్రల్ ఇజ్రాయిల్‌లో సైరన్లు మోగించారు. దిమోనా, అరద్ నగరాలపై శనివారం ఇరాన్ జరిపిన దాడులలో గాయపడిన వారి సంఖ్య 18కి చేరింది.
సముద్రయాన భద్రతకు కట్టుబడి ఉన్నాం
సముద్రయాన భద్రతకు, హర్మూజ్, పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలో చమురు నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించేలా చూసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇరాన్ విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది. ప్రస్తుత అమెరికా సైనిక చర్యలు ప్రాంతీయ సుస్థిరతకు ముప్పు కలిగిస్తున్నాయని హెచ్చరించింది. కాగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి భద్రతపై ఇరాన్, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రులు టెలిఫోన్ చర్చలు జరిపారు. హర్మూజ్‌లో ప్రయాణించే నౌకల భద్రతపై దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి ఛో తే-యుల్ ఆందోళన వ్యక్తం చేశారు. జలసంధిలో చమురు నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించేలా చూడాలని కోరారు.
అడిగితే చాలు… గ్రీన్‌లాండ్ రక్షణకు వస్తాం : ఈయూకు ఇరాన్ పోలీస్ చీఫ్ ఆఫర్
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటానంటూ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు డెన్మార్క్‌ను కలవరపెడుతున్నాయి. దీనిపై ఇరాన్ పోలీసు దళాల అధిపతి బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ రెజా రదన్ ఓ కార్యక్రమంలో స్పందించారు. ‘ట్రంప్ తొలుత యూరోపియన్ యూనియన్‌ను బెదిరించారు. ఆ తర్వాత ప్రాధేయపడ్డారు. మీరు రాకపోతే గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటానని ఇప్పుడు చెబుతున్నారు. నేను యూరోపియన్ యూనియన్‌కు ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మీరు గ్రీన్‌లాండ్‌ను కాపాడుకోలేని పక్షంలో మమ్మల్ని అడగండి చాలు…మేము దాని రక్షణకు వస్తాం’ అని ఆయన తెలిపారు.
సైనిక చర్యలను తక్షణమే ఆపాలి : చైనా
హర్మూజ్ జలసంధి పరిసరాలలో సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయాలని చైనా సూచించింది. విద్వేషాలు పెరిగితే మధ్యప్రాచ్యంలో గందరగోళం నెలకొంటుందని హెచ్చరించింది. జలసంధిని తెరవాలంటూ ఇరాన్‌పై ట్రంప్ తెస్తున్న ఒత్తిడిని పాత్రికేయులు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాంగ్ దృష్టికి తేగా ‘బల ప్రయోగం ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది’ అని అన్నారు. పశ్చి మాసియాలో సుస్థిరతను సాధించేందుకు దుందుడుకు చర్యలకు స్వస్తి చెప్పి సంప్రదింపులకు సిద్ధం కావాలని ఆయన అన్ని పక్షాలనూ కోరారు.
టోల్ వసూలు వార్తలు నిరాధారం
హార్మ్ముజ్ జలసంధిలో ప్రయాణించే చమురు నౌకల వద్ద రూ.18.8 కోట్ల టోల్ వసూలు చేయబోతున్నట్లు వచ్చిన వార్తలను ఇరాన్ తోసిపుచ్చింది. ఈ మేరకు భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. టోల్ వసూలు ఇప్పటికే ప్రారంభమైందని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడొకరు అంతకుముందు తెలిపారు. అయితే ఇది నిరాధారమైన వార్త అని ఇరాన్ ఎంబసీ తెలియజేసింది. ఆ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమైనవని, ఇరాన్ ప్రభుత్వ అధికారిక వైఖరికి విరుద్ధంగా ఉన్నాయని వివరించింది.



