– మాది అభివద్ధి, ప్రజా సంక్షేమం
– కేరళను పతనం నుంచి ప్రగతి పథంలోకి తీసుకొచ్చాం
– రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో ప్రజా తీర్పును కోరుతాం
– రాష్ట్ర భవిష్యత్ అవసరాలు-యువత ఆకాంక్షలకు కట్టుబడి ఉన్నాం
– కాంగ్రెస్, బీజేపీలతో కేరళకు నష్టం: కేరళ సీఎం పినరయి విజయన్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్రంలో నిరంతర.అభివృద్ధి, సంక్షేమం కొనసాగింపు అత్యవసరమని ప్రజలు భావిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఎల్డీఎఫ్ నిర్ణయాత్మక విజయం సాధిస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ మరోసారి ప్రజా తీర్పును కోరుతోందని అన్నారు. సోమవారం కేరళలోని తిరువల్లలో ఆయన మాట్లాడుతూ లౌకికవాదం, ప్రజాస్వామ్య విలువలను నిలబెడుతూనే, ప్రగతి, ప్రజా సంక్షేమం కొనసాగేలా చూసేందుకు ప్రజలు ఏకం కావడానికి ఈ ఎన్నికలు ఒక చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనేవి మేము ప్రజల ముందు ఉంచుతున్న ప్రధాన అంశాలు” అని అన్నారు. మితవాద శక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తూ మతతత్వాన్ని ఉపయోగించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల పట్ల కేరళకు నష్టం జరుగుతోందని, ఆ రెండు పార్టీలు కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు.
”ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిన మానవతావాద ప్రత్యామ్నాయ నమూనా ఆచరణయోగ్యమైనదని గత పదేండ్లు నిరూపించాయి. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టో హమీలను పక్కన పెట్టే రాజకీయ.సంస్కతి కేరళకు విరుద్ధం” అని అన్నారు. గత కాంగ్రెస్ నేతత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం పూర్తిగా కుప్పకూలిపోయిందని పేర్కొన్నారు. ”నియామకాలు లేవు. ప్రభుత్వ రంగం కుప్పకూలిపోయింది. ప్రభుత్వ విద్యా సంస్థలు మూసివేశారు. అవినీతిమయ పాలన. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో స్తబ్దత. పారిశ్రామిక పెట్టుబడుల పట్ల విముఖత. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో రాష్ట్రం అతలాకుతలం అయింది” అని విజయన్ విమర్శించారు. యూడీఎఫ్ పాలనలో ”సంక్షేమ పింఛన్ బకాయిలు 18 నెలల వరకు పేరుకుపోయాయి. వైద్యులు, మందులు కొరతతో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అధ్వాన్న స్థితిలో ఉంది” అని విమర్శించారు.
”ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు డ్రాపౌట్స్ భారీగా ఉండేది. పాఠ్యపుస్తకాలను సకాలంలో పంపిణీ చేయకపోవడంతో విద్యార్థులు జీరాక్స్ కాపీలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చేది. లాభదాయకత లేదనే కారణంతో పాఠశాలలను మూసివేశారు” అని పేర్కొన్నారు. అలాగే యూడీఎఫ్ హయాంలో ఉన్నత విద్యా రంగంలో ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టలేదని, విద్యా ప్రమాణాలను నీరుగార్చే ప్రయత్నాలు జరిగాయని పినరయి విజయన్ విమర్శించారు. ప్రజా పంపిణీ, రవాణా వ్యవస్థలను పూర్తిగా బలహీన పరిచారని దుయ్యబట్టారు.
అటువంటి చీకటి దశ నుంచి ఎల్డీఎఫ్ ప్రభుత్వం కేరళ పునర్నిర్మాణ చారిత్రక బాధ్యతను చేపట్టి, ప్రతి రంగాన్ని పునరుజ్జీవింపజేసిందని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో సాధించిన విజయాలను దేశానికే వన్నెతెచ్చాయని అన్నారు. సామాన్య ప్రజల పట్ల ప్రభుత్వ నిబద్ధత స్పష్టంగా నిలుస్తోందని విజయన్ పేర్కొన్నారు. ”2016లో యూడీఎఫ్ ప్రభుత్వం ఓటమి చెందినప్పుడు ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపు రూ.665 కోట్లుగా ఉండేది. ఎల్డీఎఫ్ ప్రభుత్వం హయాంలో దీనికి రూ.3,000 కోట్లకు పైగా పెంచాం” అని అన్నారు. కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడి నిధి బోర్డు (కెఐఐఎఫ్బి)తో రూ.10 వేల కోట్లకు పైగా, నాబార్డ్ తో రూ.1,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ఒక్క ఆరోగ్య రంగంలోనే అమలు చేశామని తెలిపారు.
రాష్ట్ర భవిష్యత్ అవసరాలను, యువతరం ఆకాంక్షలను నెరవేర్చడానికి ఎల్డీఎఫ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ”కేరళను వెనక్కి తీసుకెళ్లాలని చూసే రాజకీయాలకు గత దశాబ్దపు అనుభవమే సమాధానం. ఎల్డీఎఫ్ రాష్ట్రాన్ని పతనం నుంచి ప్రగతి పథంలోకి నడిపించగలిగిందని ప్రజలు నమ్ముతున్నారు” అన్నారు.
ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం
- Advertisement -
- Advertisement -



