- పట్టణంలో ప్రజల ఇబ్బందులు
నవతెలంగాణ -అచ్చంపేట: పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన రహదారి పక్కన భవనాలలోని సెల్లార్లలో వ్యాపార దుకాణాలు నిర్వహిస్తున్నారు. వినియోగదారులు రోడ్డుపై వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ఇప్పటికే రోడ్డు ఇరుకుగా ఉంది. పట్టణంలో రోజురోజుకు వాహనాల రాకపోకలు పెరుగుతున్నాయి దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఇంటి నిర్మాణం కోసం అనుమతులు తీసుకొని మునిసిపాలిటీ చట్టానికి వ్యతిరేకంగా వ్యాపార సముదాయాలు నిర్మాణం చేస్తున్నారు. అక్రమంగా అనుమతులు లేకుండా రోడ్డు పక్కన సెల్లార్లు నిర్మాణం చేస్తున్నప్పటికీ మునిసిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కొందరు కౌన్సిలర్లు అక్రమ నిర్మాణదారులకు సపోర్టుగా ఉంటున్నారని పట్టణంలో జోరుగా చర్చ జరుగుతుంది.
డబ్బులు ఆశ కోసం సెల్లార్లు దుకాణాల నిర్వహణకు అద్దెకిస్తున్నారు. పట్టణం లోని ప్రధాన రహదారి లో ని హైదరాబాద్ ఫర్నిచర్, బస్టాండ్ ఎదురుగా రాజుగారి హోటల్, లింగాల్ రోడ్డులో ఉజ్వల వైన్ షాప్ పర్మిట్ రూమ్, ఆనంద్ బార్ అండ్ రెస్టారెంట్, ఎస్బిఐ బ్యాంక్ కింద ఇలా ప్రధాన రహదారికి ఇరువైపులా చాలా దుకాణాలు అండర్ గ్రౌండ్లలో ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పోలీసులు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను మాత్రమే చలానాలు వేస్తున్నారు. పట్టణంలో పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అండర్ గ్రౌండ్ ల వ్యాపారాలు చేస్తున్న దుకాణాల ముందు పార్కింగ్ చేసిన వాహనాలపై విధానం పై చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.



