నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండతో అల్లాడిన నగరవాసులకు, సాయంత్రం వేళ వరుణుడు షాక్ ఇచ్చాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లలో కుంభవృష్టి కురిసింది. మణికొండ, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీగా వడగళ్లు పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే.. SR నగర్, మియాపూర్, కూకట్‌పల్లి, చందానగర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. నగరం వెలుపలి ప్రాంతాలైన సూరారం, కొంపల్లి, దుండిగల్ పరిసరాల్లోనూ వాన దంచికొట్టింది.
స్తంభించిన ట్రాఫిక్ – నీట మునిగిన రహదారులు..
అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో రహదారులన్నీ చెరువులను తలపించాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వరద నీరు రోడ్లపైకి చేరింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ మరియు ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడటంతో ఉద్యోగులు, సామాన్య ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులతో పాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (DRF) బృందాలు రంగంలోకి దిగాయి. వరద నీటిని మళ్లించేందుకు, నిలిచిపోయిన వాహనాలను పక్కకు తొలగించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నగరంలో ఇంకా ఆకాశం మేఘావృతమై ఉండటంతో, రాత్రి కూడా మరిన్ని వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.



