Wednesday, March 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘గ్యాంగ్ ఫైల్స్' నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష..

‘గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష..

- Advertisement -

–  నేరస్తులకు శిక్ష పడేలా పక్కా సాక్ష్యాధారాలు సేకరించాలి
నవతెలంగాణ –  కామారెడ్డి : కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర దొంగతనాలు, దోపిడీలు, రాబరీ నేరాలకు సంబంధించిన ‘గ్యాంగ్ ఫైల్స్’ పై సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గతంలో నేరాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాల నేర ప్రవర్తన, సాక్ష్యాధారాల సేకరణ వివరాల గురించి క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ  ప్రతి నేరస్తుడి పూర్తి ప్రొఫైల్‌ను పక్కాగా సిద్ధం చేయాలని ఆదేశించారు. వారిపై నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. నేరస్తులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చూడటమే లక్ష్యంగా, పెండింగ్ కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని ఎస్పీ  సూచించారు. కోర్టులో నిందితుల నేరాన్ని నిరూపించేలా శాస్త్రీయ, సాంకేతిక సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించి, త్వరితగతిన అభియోగపత్రాలను దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా ప్రతీ కేసులో అధికారులు వ్యక్తిగత శ్రద్ధ వహించాలని, ప్రాపర్టీ రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు.

జిల్లాలో నేరాల నియంత్రణకు గాను ‘ఆపరేషన్ కవచ్’ ను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ  నిర్ణయించారు. ఈ మేరకు సబ్ డివిజన్ అధికారులు సీఐలతో చర్చించి, రాత్రి గస్తీలను ముమ్మరం చేయడం, అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం వంటి కీలక సూచనలు చేశారు. ఆధునిక సాంకేతికతను మరియు సిసి కెమెరాల నిఘాను సమర్థవంతంగా వాడుకుంటూ, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు రాజీ లేకుండా పని చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు, బాన్సువాడ డీఎస్పీ బి. విఠల్ రెడ్డి, వివిధ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, రైటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -