Wednesday, March 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంటైం స్కేల్‌ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి

టైం స్కేల్‌ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి

- Advertisement -

– కనీస వేతనం రూ.26,000 చెల్లించాలి
– యూనివర్సిటీలకు బడ్జెట్‌ పెంచాలి : తెలంగాణ యూనివర్సిటీస్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ డిమాండ్‌
– ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ధర్నా
నవతెలంగాణ – ముషీరాబాద్‌

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న టైం స్కేల్‌ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని తెలంగాణ యూనివర్సిటీస్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) డిమాండ్‌ చేసింది. టైం స్కేల్‌, డైలీ వేజెస్‌, ఎమ్మెన్నార్‌, కంటీంజెంట్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరింది. యూనియన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద మంగళవారం కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, టైం స్కేల్‌ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ గౌరవ అధ్యక్షులు జె.వెంకటేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 18 యూనివర్సిటీల్లో సుమారు 10 వేల మంది నాన్‌ టీచింగ్‌ సిబ్బంది టైం స్కేల్‌, డైలీ వేజెస్‌, ఎన్‌ఎంఆర్‌, కంటింజెంట్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానాల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్నారని తెలిపారు. కనీస వేతనాలు, చట్టబద్ధ సౌకర్యాలు లేకపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. 20, 30 సంవత్సరాలు యూనివర్సిటీకి సేవలందించిన ఉద్యోగులు రిటైర్‌ అయిన తర్వాత ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లాల్సి రావడం అత్యంత బాధాకరమన్నారు. సర్వీస్‌లో ఉన్నప్పుడు అనారోగ్యానికి గురైతే ఆదుకునే దిక్కే లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, 10 సంవత్సరాలకుపైగా సేవలందించిన వారిని రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించడంతోపాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే రూ.10 లక్షల ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. యూనియన్‌ అధ్యక్షులు మెట్టు రవి మాట్లాడుతూ.. ఉద్యోగుల వయోపరిమితిని 61 సంవత్సరాలకు పెంచాలని, ఉద్యోగ విరమణ సమయంలో రూ.20 లక్షల గ్రాట్యూటీ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సర్వీసులో ఉన్న టైం స్కేల్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఏ కారణం చేతనైనా మరణిస్తే ఆ కుటుంబ వారసులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మహిళా ఉద్యోగులకు ఆరు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగానైనా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పద్మశ్రీ, కార్యదర్శి దశరథ్‌, నాయకులు దేవేందర్‌, అంజయ్య, రవికుమార్‌, శ్రీనివాస్‌, మహేందర్‌, చిరంజీవి, టైం స్కేల్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -