– బ్లూస్టార్ నుంచి ప్రీమియం ఐకోనియా శ్రేణీ
నవతెలంగాణ – హైదరాబాద్
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధాల వల్ల ఏసీ ధరలు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సరఫరా తగ్గడం, ముడి సరుకుల ధరలు పెరగడంతో వచ్చే కొద్ది రోజుల్లోనే వినియోగదారులపై భారం పడొచ్చని భావిస్తున్నారు. ప్రముఖ ఏసీ ఉత్పత్తుల కంపెనీ బ్లూ స్టార్ నివాస, వాణిజ్య కూలింగ్ విభాగాలలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోనున్నట్లు మంగళవారం ప్రకటించింది. హైదరాబాద్‌లో బ్లూస్టార్ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ గిరీశ్ హింగోరని, ఆ గ్రూప్ ప్రెసిడెంట్ మోహిత్ సుద్ ఆ కంపెనీ ప్రీమియం శ్రేణీ ఐకోనియా ఉత్పత్తులను విడుదల చేశారు. ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఇప్పుడు 125 రకాల రూమ్ ఎయిర్ కండీషనర్ మోడళ్లు ఉన్నాయన్నారు. ఇందులో వినియోగదారుల అవసరాలకు, వివిధ రకాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన ఫ్లాగ్షిప్ ప్రీమియం శ్రేణి ఐకోనియా కూడా ఉందన్నారు. ప్రస్తుతం 1.4 కోట్ల యూనిట్లుగా ఉన్న ఏసీ మార్కెట్.. 2030 నాటికి 3 కోట్ల యూనిట్లకు విస్తరిస్తుందని అంచనా వేశారు.
ముడి సరుకుల సంక్షోభం..
ఏసీ పరిశ్రమ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధరలు 7 నుంచి 8 శాతం వరకు పెరగనున్నట్లు గిరీశ్, మోహిత్ సుద్ తెలిపారు. ప్రధానంగా రాగి అల్యూమినియం, స్టీల్ వంటి ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం దాదాపు 8.5 శాతం అధికమైందన్నారు.. దీనికి తోడు కొత్త ఇంధన సామర్థ్య నిబంధనల ప్రకారం తయారీలో మార్పులు చేయాల్సి రావడంతో మరో 4 శాతం అదనపు భారం పడిందన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల ప్లాస్టిక్ విడిభాగాలకు అవసరమైన ఆయిల్, ఎల్ఎన్జి లభ్యత తగ్గడం కూడా ఈ సంక్షోభానికి ప్రధాన కారణమన్నారు. ఈ భారాన్ని అప్పుడే వినియోగదారులపై మోపే అవకాశాలు లేవన్నారు.
ఏసీ ధరలకు యుద్ధం సెగ
- Advertisement -
- Advertisement -



