– ప్రతిపక్షాలు డిమాండ్
న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ చట్టానికి రాజ్యాంగ సవరణ తీసుకురావడానికి ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సవరణలు చేయాలనుకుంటుందో వివరిస్తూ, వెంటనే ఒక సవివరమైన నోట్‌ను సమర్పించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకు రాసిన లేఖలో రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, ‘నారీ శక్తి వందన అధానియం’ (106వ రాజ్యాంగ సవరణ)ను ఎలా అమలు చేయాలనుకుంటున్నారనే దానిపై ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని, దానిపై వివరంగా చర్చించాలని డిమాండ్ చేశారు. ”జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి ప్రక్రియలను పూర్తి చేయకుండానే వచ్చే ఏడాది మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలన్నది ప్రభుత్వ చర్య. ఈ రాజ్యాంగ సవరణను ఆమోదింపజేయడంలో ప్రతిపక్షం సహాయపడాలని ఖర్గేను కిరణ్ రిజిజు కోరారు. దీనికి ప్రతిస్పందనగా, ప్రతిపక్ష వైఖరిని స్పష్టం చేస్తూ ఖర్గే మంత్రికి లేఖ రాశారు. రిజిజుతో పాటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ విషయంలో కొన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతు కోరారు. అమిత్ షా, ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసి, ఎన్‌సిపి శరద్ పవార్ వర్గం నాయకుడు సుప్రియా సులే తదితరుల సహాయం కోరారు.ప్రతిపక్షాలతో ఎలాంటి ముఖ్యమైన చర్చలు జరపకుండా, వీలైనంత త్వరగా సవరణకు సంబంధించిన రెండు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర మంత్రివర్గం త్వరలో ఈ బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. శుక్రవారం నాటికి ఈ బిల్లులను ప్రవేశపెట్టాలని ఉద్దేశించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా తెలిపాయి. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి బదులుగా, ప్రతిపక్ష పార్టీ నాయకులతో ఒకరితో ఒకరు చర్చలు జరిపి మద్దతు కూడగట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) సవరణ బిల్లు ఆమోదం
దేశంలోని ట్రాన్స్‌జెండర్ వర్గం హక్కులను ఉల్లంఘించే వివాదాస్పద నిబంధనలున్న ‘ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) సవరణ బిల్లు’ లోక్‌సభలో ఆమోదం పొందింది. ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఈ వివాదాస్పద బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ట్రాన్స్‌జెండర్ నిర్వచనాన్ని మార్చే, ఇప్పటికే ఉన్న అన్ని హక్కులను ఉల్లంఘించే నిబంధనలున్న ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఒక వ్యక్తి ట్రాన్స్‌జెండర్ అని వైద్య మండలి, జిల్లా మేజిస్ట్రేట్ ధవీకరించాలనే నిబంధనతో సహా, ఈ బిల్లులోని నిబంధనలు సామాజిక న్యాయాన్ని బహిరంగంగా ఉల్లంఘించడమేనని ప్రతిపక్ష సభ్యులు స్పష్టం చేశారు. ట్రాన్స్‌జెండర్ వర్గాన్ని సంప్రదించకుండా కొత్త చట్టాన్ని తీసుకురావడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అదే సమయంలో, ఈ కొత్త బిల్లు కొత్త చరిత్రను లిఖిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన రెండు సవరణలు మూజువాణి ఓటుతో తిరస్కరించబడ్డాయి.
మహిళా రిజర్వేషన్ పై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -



