బడ్జెట్ చర్చలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటా అందడం లేదనీ, ఇది కూడా బడ్జెట్ లోటుకు ఒక కారణమని సీపీఐ ఎమ్మల్యే కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని విమర్శించారు. మంగళవారం స్పీకర్ గడ్డ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ చర్చలో పాల్గొంటూ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని వేయాలని కోరారు. పేదల భూములు తీసుకున్నవారిపైన కేసులు నమోదు చేసి వాటిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పీవోబీ, పీవోబీ పరిధిలోని భూ సమస్యలను పరిష్కరిస్తే ఒక వైపు పేదలకు న్యాయం జరగడంతోపాటు ప్రభుత్వానికి భూముల రూపంలో ఆస్తులు పెంచుకోవచ్చన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లిస్తే, ప్రభుత్వ పాలన ప్రశాంతంగా కొనసాగడానికి అవకాశముందని వివరించారు. రైతుల బాధలు అలాగే ఉన్నాయనీ, సాదాబైనామా పరిష్కారం కాలేదనీ , గతంలో జరిగిన తప్పులను సరిచేయలేదన్నారు. పెద్ద మార్పు రాలేదని చెప్పడానికి తాను చింతిస్తున్నానని వివరించారు. తలసరి ఆదాయం లెక్కల ప్రకారం తెలంగాణలో ప్రతి మనిషికి రూ. రూ. 4,18,931 ఆదాయం ఉందా అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రంలో ప్రతి మనిషిపైన రూ.2 లక్షల అప్పు ఉన్నదనే సంగతిని గుర్తు చేశారు. పేద వాడికి తిండి దొరికి, ఫీజులు ఇబ్బందిలేకుండా చెల్లించి, ఆస్పత్రుల్లో చికిత్స అంది, మంచి బట్టలు ధరించి, పౌష్టికాహారం తిన్నప్పుడే ధనిక రాష్ట్రంగా చెప్పాలని అభిప్రాయపడ్డారు. ఆ వైపుగా వ్యక్తి కేంద్రంగా బడ్జెట్ రూపకల్పన చేయాలని సూచించారు. ప్రతియేటా ఒక రోటీన్ పద్ధతిలోనే బడ్జెట్ అంచనాలు వేస్తున్నారని వివరించారు. ఎవ్వరూ బడ్జెట్ సూక్ష్మంగా సీరియస్ అంచనాలు వేయలేకపో తున్నారనీ, కనీసం ఆ బడ్జెట్ ఫలితాలు చివరి వ్యక్తి వరకు అందుతున్నాయా? లేదా అనేది కూడా ఆలోచించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో సగం జనాభాకు పైగా అసంఘటిత రంగంలో పని చేస్తున్న వారికి మేలు చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పిఎఫ్ అమలు చేయాలని సూచించారు. ధనిక రాష్ట్రంలో ఎందుకు వెనుకబడుతామనీ, జీఎస్టీ అనేది కేంద్ర ప్రభుత్వానికి ఒక వజ్రాయుధంలాంటిదని చెప్పారు. తద్వారా రాష్ట్రాలు కేంద్రంపైనా ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్ట్‌కైనా జాతీయ హోదా ఇచ్చారా? విభజన చట్టంలోని బకాయిల్లో ఒక్క రూపాయి ఇచ్చారా? అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్ర ప్రయోజిత పథకాలు మినహా తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఏమైనా ఇచ్చారా ? అని ప్రశ్నించారు. జీఎస్టీ ఇతరాల రూపంలో కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం రూ. 2లక్షల కొట్లకు పైగా చెల్లిస్తుండగా, కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్ని కలిపినా రూ.70 నుంచి రూ 80 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారని వివరించారు. బీజేపీ సభ్యులు చెబుతున్నట్టుగా పదేండ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు మొత్తంగా రూ.12 లక్షలు కోట్లు వచ్చాయని ఆయన వివరించారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి 2.17 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌కు 17.62 శాతం, బిహార్‌కు 11.95 శాతం నిధులను కేటాయిస్తున్నదన్నారు. కేంద్రం రాష్ట్రాలపైన పెత్తనం చేసేందుకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవహారిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులను తీర్చేందుకే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ధరణి వల్లనే భూదందాకు బీజం పడిందనీ, భూ భారతితో ఎటువంటి మార్పు రాలేదని గుర్తు చేశారు. పాల్వంచ కొత్తగూడంలో పీవోబీ పరిధిలోనికి వచ్చిందనీ, 76 జివో ప్రకారం సింగరేణి భూముల లో నివాసం ఉంటున్న సాధారణ ప్రజలకు ఆ భూమిని క్రమబద్దీకరించాలని కోరారు. సింగరేణి, ఆర్టీసీ జెన్కో మూడు సంస్థల ఉనికి ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంస్థలను నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిం చాలని సూచించారు. మూసీని శుద్ధి చేయాల్సిం దేననీ, మూసీ ప్రాజెక్ట్ వల్ల ఇండ్లు కోల్పోతున్న వారితో చర్చించి, వారిని మెప్పించి, ఒప్పించి, తద్వారా వారిని కూడా భాగస్వాములుగా చేయాల న్నారు. ఇది భవిష్యత్ తరాలకు కోసం చేపడుతు న్నారనీ, తొందర పడొద్దని, అలాగే ఆ ప్రాజెక్ట్ ఆపొద్దని సూచించారు. రైతుభరోసా సకాలంలో చెల్లించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 ప్రాజెక్ట్ చిన్న , మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నాయనీ, చిన్నవి ప్రధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సూచించారు. విద్యారంగానికి మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
రాజీవ్‌తోనే పంచాయతీలకు నిధులు : మంత్రి పొన్నం ప్రభాకర్
బడ్జెట్ చర్చలో మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ దేశంలోని పల్లెలకు రాజీవ్‌గాంధీ మూలంగా నిధులు వచ్చాయని అన్నారు. ఆయన 21వ శతాబ్ధంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేశారని చెప్పారు. 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలకు భారీగా నిధులు ఇచ్చారని చెప్పారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పరిపాలన అందేలా గట్టిగా వ్యవహరించారని వివరించారు. విదేశీ విద్యానిధి కింద పెండింగ్‌లో ఉన్న విద్యార్థులను నిధులు విడుదల చేస్తామన్నారు. వివరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని సూచించారు.మధ్యలో విద్య ఆగిపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో 300 మందికి అవకాశం ఉండేదనీ, ఇప్పుడు 700 మందికి అవకాశం కల్పించామని వివరించారు. అంతకుమందు ఎమ్మెల్యే మహ్మాద్ మాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ పాతబస్తీ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మైనార్టీలకు చెందిన పథకాల్లో బిల్లులు చెల్లించడం లో ఆలస్యం చేస్తున్నారని చెప్పారు. మైనార్టీ విద్యాసంస్థల్లో కనీస వసతులు ఉండటం లేదని వివరించారు. ఎస్సీ, ఎస్టీ పిల్లల్లాగే మైనార్టీ విద్యార్థులకు నిధులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ భారీగా నిధులు కేటాయిం చాలని చెప్పారు. పశుసంవర్థక శాఖ సమస్యలను పరిష్కరించాలని వివరించారు. ఎన్నికల్లో ముస్లింలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్ చర్చలోకి వస్తూ హైదరాబాద్ మహానగరానికి భారీగా నిధులు కేటాయించాలని కోరారు. ముఖ్య మంత్రి ప్రణాళక పక్కాగా అమలుచేయాలని సూచిం చారు. విశ్వనగరంలో మౌళక సదుపాయాలను విస్త్రృతంగా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మూసీ పరివాహాక ప్రాంత అభివృద్ది సీఎం కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు. మూసీ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌లో నైట్ లైఫ్ ప్రారంభమవుతుందన్నారు.



