నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐఏడీఎంకే(All India Anna Dravida Munnetra Kazhagam), బీజేపీలుకలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో పొత్తులో భాగంగా ఏఐఏడీఎంకే 169 స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ 65 స్థానాల్లో బరిలోకి దిగుతుంది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఆయా పార్టీల నేతలు ప్రకటన విడుదల చేశారు. 234 అసెంబ్లీ స్థానాలకు ఇరు పార్టీలు చర్చల మీద చర్చలు సాగించి ఎట్టకేలకు ఏకతాటిపైకి వచ్చాయి.
తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది, మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్పీఏ) మరియు ఏఐఏడీఎంకే నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) మధ్య ఉంటుందని అంచనా. డీఎంకేలో కాంగ్రెస్, డీఎండీకే, వీసీకే కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఎన్డీఏలో బీజేపీ, పట్టాలి మక్కల్ కచ్చి (పీఎంకే) మిత్రపక్షాలుగా ఉన్నాయి. నటుడు, రాజకీయ నాయకుడు అయిన విజయ్, టీవీకే పార్టీతో ఎన్నికల బరిలోకి దిగనున్నారు. దీంతో తమిళనాడు అసెంబ్లీ ఈసారి రసవత్తరంగా సాగనున్నాయి. ఆయా పార్టీల ఎన్నికల పోరు త్రిముఖ పోటీ తలపిస్తోంది.



