నవతెలంగాణ (వేల్పూర్) ఆర్మూర్ : మండలంలోని మోతె గ్రామానికి చెందిన డాక్టర్ రాకేష్ సతీమణి డా. బోడా మంజు భార్గవి,వ్యవసాయ రంగంలో విశిష్ట ఘనతను సాధించినట్టు వారి కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. . దేశంలో ప్రఖ్యాత చెందిన తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం (TNAU)లో అగ్రానమీ విభాగంలో పీహెచ్.డి పట్టాను విజయవంతంగా పొందినారని అగ్రానమీ విభాగంలో పీహెచ్.డి పూర్తి చేసిన తొలి గిరిజన మహిళగా నిలవడం విశేషం అని అన్నారు.
డా. మంజు భార్గవి భర్త కూడా శాస్త్రవేత్తగా సేవలందిస్తున్నారు.ఆమెకు ఇద్దరు సంతానం ఉన్నారు. కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ ఉన్నత విద్యలో ఈ స్థాయి విజయాన్ని సాధించడం ప్రత్యేకంగా నిలిచింది.
ఆమె తన విద్యా ప్రయాణంలో భాగంగా ప్రభుత్వ సేవల్లో కూడా ప్రతిభ కనబరిచారు. జిల్లా సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ మరియు మండల వ్యవసాయ అధికారి (MAO) గా విధులు నిర్వహించి, ప్రస్తుతం చెరకు మరియు వరి పరిశోధన స్థానం రుద్రూర్ లో శాస్త్రవేత్తగా సమగ్ర వ్యవసాయంపై అధ్యయనం చేస్తున్నారు. మొత్తం మూడు ప్రభుత్వ ఉద్యోగాల్లో సేవలందించడం విశేషం.
ఆమె తన పరిశోధనలో భాగంగా రబీ సీజన్‌లో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా వరి పంటలో వివిధ ఆధునిక నిర్వహణ నమూనాలను అభివృద్ధి పై డిజిటల్ అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ బి బాలాజీ నాయక్ గారి ఆధ్వర్యంలో అధ్యయనం చేశారు. తన పరిశోధన ఫలితాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శిస్తూ రెండు అంతర్జాతీయ పరిశోధనా పత్రాలను ప్రచురించి శాస్త్రీయ వర్గాల ప్రశంసలు అందుకున్నారు.
ఆమె సాధించిన ఈ విజయంపై గ్రామస్తులు , రైతులు హర్షం వ్యక్తం చేస్తూ యువతకు ఇది ప్రేరణగా నిలుస్తుందని జిల్లా కు గర్వకారణం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో రైతుల అభివృద్ధి కోసం మరిన్ని వినూత్న పరిశోధనలు చేయాలని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.



