– కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలి
– కెజిబివి, యుఆర్ఎస్, సమగ్ర శిక్షా ఉద్యోగుల మహాధర్నాలో వక్తల డిమాండ్.
నవతెలంగాణ-హైదరాబాద్ : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం (26.03.2026) చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా టిఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్ లో మహా ధర్నా నిర్వహించారు.
టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ధర్నాకు అధ్యక్షత వహించారు. సిపిఐ శాసన సభా పక్ష నాయకులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు హాజరై మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కెజిబివి, యుఆర్ఎస్, సమగ్ర శిక్షా ఉద్యోగులకు నామ మాత్రపు వేతనాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనసభలో ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. టిఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
పూర్వ శాసన మండలి సభ్యులు కె నాగేశ్వర్ మాట్లాడుతూ.. కెజిబివిలలో అనాథలు, పాక్షిక అనాథ బాలికలకు నాణ్యమైన విద్యను అందిస్తూ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారని, వీధి బాలల పునరావాసానికి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు కృషి చేస్తున్నాయని, విద్యా గణాంకాల సేకరణ, ప్రాథమిక పాఠశాలలకు అకడమిక్ సహకారం అందించడానికి సమగ్ర శిక్షా ఉద్యోగులు విశేషంగా కృషి చేస్తున్నారని వీరందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని, సర్వీసులు క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. గత ఇరవై సంవత్సరాలుగా తాను ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో పోరాటాల్లో పాల్గొంటున్నానని. పాలకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడటం అలవాటుగా మారిందని విమర్శించారు.

జాతీయ మహిళా ఉపాధ్యాయ నాయకులు ఎం సంయుక్త మాట్లాడుతూ…సెలవుల విషయంలో రెగ్యులర్, కాంట్రాక్టు వివక్ష సమంజసం కాదన్నారు. కెజిబివి, యుఆర్ఎస్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరణిస్తే కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం లేదని, రూ 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చావ రవి మాట్లాడుతూ.. తెలంగాణ తొలి పిఆర్సీ సిఫారసు చేసిన విధంగా కాంట్రాక్టు ఉద్యోగులకు రూ 1000 వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కెజిబివి ఉద్యోగులకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వేతనాలు ఇస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకంలో ఈ వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దేశవ్యాప్తంగా ఒకేరకమైన వేతనాలు అమలు చేయాలని, అందుకు అవసరమైన అదనపు నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.
టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్ మాట్లాడుతూ.. కెజిబివి, యుఆర్ఎస్ ఉద్యోగుల సమస్యలపై లోగడ టిఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో పలు పోరాటాలు నిర్వహించామని, 12 నెలల వేతనాలు, వీక్లీ ఆఫ్, 180 రోజుల ప్రసూతి సెలవులు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు సాధించుకున్నామని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమైన సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందని ఆశించామన్నారు. రెండు సంవత్సరాల సమయం ఇచ్చినా సమస్యలు పరిష్కరించలేదని, అందుకే మరోసారి మూడు దశల పోరాటానికి పిలుపునిచ్చామన్నారు.
రెండు దశల పోరాటం నిర్వహించినా ప్రభుత్వం నుండి స్పందన లేదని, మూడవ దశగా ఈ రోజు (మార్చి 26న) చలో అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ వెంటనే చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుంటే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.
సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి మధు, టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గా భవాని, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, కెజిబివి, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష నాయకులు విశాలాక్షి, లక్ష్మి, మంజుల, గోపిలత, యాదగిరి, పాషా, సురేందర్, కుమార స్వామి, గంగామణి, మంజులత, సుమన చైతన్య, మంజుల, వెంకటప్ప, రాజు, రవికుమార్, సింహాచలం, విశాలి, చిన్నయ్య, వివిధ జిల్లాల టిఎస్ యుటిఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు, వేలాది మంది ఉద్యోగులు పాల్గొన్నారు.






