– ఆటో యూనియన్ నాయకుల ఆగ్రహం
– ఫ్రీ బస్సు ప్రభావంతో ఆదాయం తగ్గిందని ఆవేదన
– హామీలు అమలు చేయకపోతే ఉద్యమం తీవ్రం
నవతెలంగాణ -కామారెడ్డి : ఫ్రీ బస్సు సేవల అమలుతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ, తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆటో కార్మికుడు ఇమ్రాన్ కాలినడకన హైదరాబాద్కు బయలుదేరగా అక్కడక్కడ పోలీసులు బెదిరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ ( నాన్ పొలిటికల్ ) రాష్ట్ర కార్యదర్శి సాయిలు అన్నారు. మేము చాలామందిని గుమ్మిగుడి వెళ్లడం లేదని కేవలం ఒక్కరే ఆటో కార్మికుడు తమ సమస్యలను ప్రభుత్వానికి నివేదించడానికి నిజాంబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ ఇమ్రాన్ హైదరాబాద్ కు వెళ్తున్నాడని, ఆటో కార్మికుల జీవనోపాధి కష్టాల నేపథ్యంలో తన బాధను తెలియజేయడానికి ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేపట్టాడన్నారు. అతన్ని పోలీసులు అడ్డుకోవడం కార్మికుల్లో ఆవేదన రేకెత్తించిందనీ, ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ, ఫ్రీ బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గిందని తెలిపారు. రోజువారీ ఖర్చులు, వాహన రుణాలు, కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. చాలా మంది డ్రైవర్లు అప్పుల్లో కూరుకుపోయి తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని వారు విమర్శించారు. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు, సామాజిక భద్రత కల్పన, సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ఆటో కార్మికులకు జీవన భృతి (లివింగ్ అలవెన్స్) అందించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఇటీవల ఆటో కార్మికుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నదని, కుటుంబాలను పోషించలేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ఆటో కార్మికులకు ఉపశమనం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించాలి… తెలంగాణ ఆటో యూనియన్ రాష్ట్ర జేఏసీ నాన్ పొలిటికల్ రాష్ట్ర కార్యదర్శి సాయిలు.. ఆటో కార్మికుల భక్తుడు బతుకులు అంతంతమాత్రంగానే ఉన్నాయని, అందులో ఫ్రీ బస్సులు రావడంతో మా బతుకులు మరింత భారమయ్యాయని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఆటో కార్మికులు తెచ్చిన హామీలను అమలు చేయాలి.



