మల్లు స్వరాజ్యమే స్ఫూర్తి
మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద
వీరనారి ఐలమ్మ భవన్లో స్వరాజ్యం నాలుగో వర్థంతి
ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళ అంటేనే పోరాటమనీ, ఆమె ఇంటా, బయట హక్కుల కోసం పోరాటం చేయాల్సిందేనని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద వ్యాఖ్యానించారు. ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని వీరనారి ఐలమ్మ భవన్లో మల్లు స్వరాజ్యం నాలుగో వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘ఉచిత వైద్య శిబిరాన్ని’ శారద ప్రారంభించారు. అనంతరం ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు సమాజంలో ఉన్న అసమానతలపై కూడా పోరాడాల్సి వస్తోందని చెప్పారు. ఆ పోరాటాలకు వీరనారిమణులు మల్లు స్వరాజ్యం, ఐలమ్మ స్ఫూర్తి అని తెలిపారు.
సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. యువత తమ పాత్రను బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పేదలకు వైద్యం అందుబాటులో లేదని, వైద్యం ఖరీదైన ఈ నేపథ్యంలో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించటం సమాజం పట్ల ఐద్వాకు ఉన్న బాధ్యతను తెలియజేస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలు మరిన్ని నిర్వహించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజానికి నాంది పలకాలని కోరారు. ఐద్వా సీనియర్ నాయకులు టి. జ్యోతి మాట్లాడుతూ మహిళా సమస్యలపై నిరంతరం పోరాడిన వీరవనిత మల్లు స్వరాజ్యం అని చెప్పారు. అందరికీ ఉపాధి, ఆరోగ్యం, విద్యకోసం ఆమె పోరాడారని, దోపిడీ లేని సమసమాజం కోసం చివరికంటూ ఉద్యమించారని గుర్తు చేశారు. మల్లు లక్ష్మి మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం అట్టడుగు వర్గాల వారి ఇతిబాధలను తొలగించేందుకు పోరాడారని అన్నారు. సమాజం మారాలని సాగుతున్న ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
వారి ఆశయాలను కొనసాగించే క్రమంలోనే ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించామని చెప్పారు. వీరనారి ఐలమ్మ ట్రస్టు చైర్పర్సన్ బుగ్గవీటి సరళ, కార్యదర్శి బి. హైమావతి మాట్లాడుతూ మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడాలనీ, ఆడపిల్లలను ఆత్మ స్థైర్యంతో పెంచాలని సూచించారు. అందులో భాగంగానే ఐలమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో 16జిల్లాల్లో కుటుంబ న్యాయసలహా కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. ట్రస్టు కోశాధికారి కేఎన్ ఆశాలత మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం ఆశయ సాధన కోసం పోరాడాలని కోరారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలను నిర్మించేందుకు కృషి జరుగుతున్నదని చెప్పారు. హెల్త్ క్యాంపులో డాక్టర్ రమేష్ బి. సుధ, జి. కృష్ణవేణి, సునిత, మహేష్ బాబు, జెస్సీ, సునీల్ కుమార్, గౌతమి, మేఘన తదితరులు భాగస్వాములయ్యారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.శశికళ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్. స్వరూప, ఎమ్. లక్ష్మమ్మ, రజిత, ఇందిర, జోషిలా, ప్రేమ, బ్రాహ్మణి, కవిత, ధనలక్ష్మి, సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.



