Friday, March 27, 2026
E-PAPER
Homeజాతీయంఏఐ యుగానికి అనుగుణంగా చైనా తరగతులు

ఏఐ యుగానికి అనుగుణంగా చైనా తరగతులు

- Advertisement -

భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టు విద్యార్థులు సిద్ధం
కొత్త నైపుణ్యాల వైపు ఆ దేశ విద్యా వ్యవస్థ
భారత్‌లో ఇంకా మార్కులు, ర్యాంకుల ఆధిపత్యమే
అవే విద్యార్థుల ప్రతిభకు కొలమానం
ఈ విధానంలో మార్పు రావాలి : మేధావులు, నిపుణులు

న్యూఢిల్లీ : కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచంలో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ప్రతీ రంగాన్నీ ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం నడుస్తున్నది ఏఐ యుగమేనంటూ నిపుణులు చెప్తున్నారు. అయితే చైనా ఏఐ యుగానికి సరిపోయేలా తమ విద్యావ్యవస్థను తయారు చేసుకుంటోంది. సమస్యలు పరిష్కరించే నైపుణ్యాల వైపు తీసుకెళ్తోంది. విద్యార్థులను భవిష్యత్తు అవసరాలకు సిద్ధం చేస్తోంది. అయితే ఈ విషయంలో మాత్రం భారత్‌ చాలా వెనుకబడి ఉంది. ఇప్పటికీ మార్కులు, ర్యాంకుల ఆధారంగా విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పాత పద్దతి కొనసాగుతోంది. భారత్‌లోని ఈ తీరుపై మేధావులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పద్ధతి మారాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్తున్నారు. భారత్‌తో పోలిస్తే చైనా ప్రతీ రంగంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. విద్యారంగంలోనూ కొత్త మార్పులు తీసుకొస్తోంది. చైనా 2021లో ‘డబుల్‌ రిడక్షన్‌’ పాలసీని ప్రవేశపెట్టింది. విద్యార్థులపై ట్యూషన్లు, అధిక హౌంవర్క్‌ ఒత్తిళ్లను తగ్గించింది.

ఇది సాధారణ నియంత్రణ చర్యలా కనిపించినప్పటికీ.. అసలు ఉద్దే శ్యం విద్యావిధానాన్ని పూర్తిగా మార్చడమే. ఈ విధానం తర్వాత చైనా పాఠశాలల్లో అనువర్తనాధారిత (అప్లికేషన్‌ బేస్డ్‌) అధ్యయనం పెరిగింది. కేవలం పుస్తకజ్ఞానం మాత్రమే కాకుండా ప్రయోగాత్మక నైపుణ్యాలు, సమస్యల పరిష్కారం ప్రధానాంశాలుగా మారాయి. టెక్నాలజీ వినియోగం, ప్రాజెక్ట్‌ ఆధారిత విద్య, భవిష్యత్తు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధి వంటివి ప్రాధాన్యం పొందుతున్నాయి. చైనా ఇక టాపర్లు తయారు చేసే దేశం మాత్రేమే కాదు.. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉన్న విద్యా ర్థులను తయారుచేసే దిశగా అడుగులు వేస్తోందని విద్యావేత్తలు, మేధావులు అంటున్నారు. దేశంలో కంఠస్థ పద్ధతిని తగ్గించి.. వాస్తవ జీవితానికి ఉపయోగపడే నైపుణ్యాలపై ఆ దేశం దృష్టి పెడుతోంది. బీజింగ్‌, షాంఘై వంటి నగరాల్లో విద్యార్థులు కొత్త ఆలోచనలు, సృష్టించడం వంటి విషయంలో ఉత్సాహం కనబరుస్తున్నారు.

ఉద్యోగాలపై ప్రభావం
ప్రస్తుత ఏఐ యుగంలో ప్రపంచ మార్కెట్‌లో ఉద్యోగాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కులు, ర్యాంకులు ఉద్యోగానికి హామీ ఇవ్వలేవు. కానీ విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంకా మార్కుల కోసం పోటీ పడుతున్నారు. దీని ప్రభావం ఉద్యోగ మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం భారత్‌లో దాదాపు 9 లక్షల మంది ఇంజినీర్లు బయటకు వస్తున్నా… చాలా మందికి ఉద్యోగాలు రావడం లేదు. కారణం.. వారికి డిగ్రీ పట్టాలు ఉన్నా… తగిన నైపుణ్యాలు లేకపోవడమే. ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా 2026’ ప్రకారం సుమారు 40 శాతం మంది యువత ఉద్యోగాల కోసం కష్టపడుతున్నారు. ఇది విద్యావ్యవస్థ, ఉద్యోగాల మధ్య ఉన్న అంతరాన్ని చూపిస్తోందని విశ్లేషకులు వివరిస్తున్నారు.

కోచింగ్‌ కల్చర్‌ ప్రభావం
భారత్‌లో కోచింగ్‌ సెంటర్లు విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కోటా, హైదరాబాద్‌, ఢిల్లీ వంటి నగరాల్లో విద్యార్థుల జీవితాలు ర్యాంకుల చుట్టూ తిరుగుతున్నాయి. విజయం అంటే ఇంకా ర్యాంక్‌, కటాఫ్‌ అనే భావనను కోచింగ్‌ సెంటర్లు తీసుకొచ్చాయి. చైనా మాత్రం ఈ కోచింగ్‌ వ్యవస్థను నియంత్రించింది. భారత్‌లో పరీక్షల ఆధారంగా విద్యార్థి విజయాన్ని కొలిస్తే.. చైనాలో మాత్రం ఇది విద్యార్థి నైపుణ్యాల ఆధారంగా ఉంటుందని విశ్లేషకులు వివరిస్తున్నారు. చైనా విద్యను తన ఆర్థిక లక్ష్యాలకు (టెక్నాలజీ, ఉత్పత్తి, తయారీ) అనుసంధానిస్తోంది. భారత్‌లో మాత్రం ఆ మార్పు పూర్తిగా కనిపించడంలేదని నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు.

ప్రభుత్వాలు చైనాను ఆదర్శంగా తీసుకోవాలి
అసలు విద్య అనేది ఉద్యోగం పొందడానికి మాత్రమేనన్న తీరు భారత్‌లో కనిపిస్తోంది. సమాజానికి బాధ్యత గల ఆలోచించే వ్యక్తులను తయారు చేయాలనే భావన ఎప్పుడో అంతరించిపోయిందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో చైనా ఒక స్పష్టమైన విజన్‌ను కలిగి ఉందని చెప్తున్నారు. మార్కుల ఆధారంగా ఒక విద్యార్థి ప్రతిభను కొలవటం భారత్‌లోని పేరెంట్స్‌ మైండ్‌సెట్‌గా మారిపోయింది. రిస్క్‌ తీసుకునే, కొత్తగా ఆలోచించే విద్యార్థులను ప్రోత్సహించడం ఇక్కడ చాలా తక్కువ. కానీ చైనాలో మాత్రం అలా కాదు. విద్యార్థి చదువు దేశ వృద్ధికి దోహదపడేలా ఉంటోంది. ఆర్థిక వృద్ధికి నేరుగా అనుసంధానమై ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చైనా విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే రాబోయే పరిణామాలు విద్యార్థి, దేశ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

భారత్‌లో విరుద్ధ పరిస్థితులు
భారత్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. రిపోర్ట్‌ కార్డులు ఇంకా విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి. పరీక్షలు, మార్కులు, ర్యాంకులు విద్యార్థిని అంచనా వేసే కొలమానాలుగా కొనసాగుతున్నాయి. భారత్‌లో కోచింగ్‌ సెంటర్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కోచింగ్‌ సెంటర్లు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. విద్యార్థులపై మానసికంగా తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. విద్యార్థులు కేవలం మెమొరైజేషన్‌ (గుర్తుపెట్టుకోవడం) మీదే ఎక్కువగా శిక్షణ పొందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -