Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆ సిమెంట్‌ ఫ్యాక్టరీని పున:ప్రారంభిస్తాం

ఆ సిమెంట్‌ ఫ్యాక్టరీని పున:ప్రారంభిస్తాం

- Advertisement -

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా టీ-ఫైబర్‌: అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఆదిలాబాద్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీని పున:ప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హామీనిచ్చారు. అందుకోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా బీజేపీ సభ్యులు కాటేపల్లి వెంకటరమణ, పాయల్‌ శంకర్‌, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, బీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉప నేత తన్నీరు హరీశ్‌రావు తదితరులు దావోస్‌ పర్యటనల సందర్భంగా ప్రభుత్వం చేసుకున్న అవగాహన ఒప్పందాల గురించి అడిగారు. ఆ పెట్టుబడుల ద్వారా ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలను ఏర్పాటు చేశారంటూ ప్రశ్నించారు. వారు లేవనెత్తిన అంశాలకు శ్రీధర్‌బాబు సమాధానమిస్తూ దావోస్‌ పర్యటనల ద్వారా తెలంగాణకు రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు.

పెట్టుబడిదారులతో మొత్తం 44 ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. వాటిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని స్పాంజి ఐరన్‌ కర్మాగారాన్ని కూడా రీ-ఓపెన్‌ చేస్తామని వెల్లడించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా హామీనిచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న టీ-ఫైబర్‌ కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వ్యక్తిగత ఖర్చులతోనే దావోస్‌ పర్యటనకు వెళ్లారని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఖాళీల మేరకే పదోన్నతులు : మంత్రి పొన్నం
హోంశాఖలోని ఖాళీల మేరకే పదోన్నతులు కల్పిస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఒకవేళ ఖాళీలు లేకపోతే ఉద్యోగుల సీనియార్టీ మేరకు జీతభత్యాల పెంపు, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నామని వెల్లడించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కాంగ్రెస్‌ సభ్యుడు మందుల సామేలు, నాగరాజు, బీఆర్‌ఎస్‌ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, బీజేపీ సభ్యుడు పాయల్‌ శంకర్‌, సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

తెలంగాణ, ఏపీకి సంబంధించిన హోంగార్డుల పరస్పర బదిలీల విషయాన్ని అధికారుల కమిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీనిచ్చారు. అంతకుముందు సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… మల్టీజోన్‌ 1, 2లో పని చేస్తున్న 2009 బ్యాచ్‌ ఎస్‌ఐలకు ఇప్పటి వరకూ ప్రమోషన్లు రాలేదని తెలిపారు. సూపర్‌ న్యూమరీ పోస్టులు సృష్టించైనా వారికి పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సహజ మరణం పొందిన హోంగార్డులకు కూడా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియోతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కూనంనేని మాట్లాడుతూ పోలీసులకు టీఏ, డీఏలను సకాలంలో చెల్లించాలని కోరారు. హోంశాఖలో అడ్డదారి ప్రమోషన్లను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు తరహాలో ట్రాఫిక్‌ పోలీసులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -