Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనష్టపరిహారం వద్దు..

నష్టపరిహారం వద్దు..

- Advertisement -

భూమికి భూమి ఇవ్వాలి
రేడియల్‌ రోడ్డు ఫేజ్‌ -2 భూ నిర్వాసితుల డిమాండ్‌
అడిషనల్‌ కలెక్టర్‌ కారుకు అడ్డంగా కూర్చుని ధర్నా
భూమికి భూమి ఇవ్వాలని 2013 చట్టంలో లేదన్న అడిషనల్‌ కలెక్టర్‌ కె. చంద్రారెడ్డి
మెరుగైన నష్టపరిహారం ఇస్తామని హామీ

నవతెలంగాణ-శంషాబాద్‌
మెరుగైన నష్టపరిహారం కాదు.. భూమికి బదులు భూమి ఇస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే రేడియల్‌ రోడ్డు ఫేజ్‌ -2 నిర్మాణానికి తమ భూములు ఇస్తామని, లేదంటే అడ్డుకుంటామని భూ నిర్వాసితులు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌ నుంచి నాచారం వరకు 85 కిలోమీటర్ల దూరం 250 ఫీట్ల వెడల్పుతో శంషాబాద్‌ మండలం మీదుగా నిర్మిస్తున్న రేడియల్‌ రోడ్డు ఫేజ్‌-2 భూ సేకరణలో భాగంగా శంషాబాద్‌ మండలంలోని నర్కూడ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గురువారం భూ నిర్వాసితులతో గ్రామసభ నిర్వహించారు. రేడియల్‌ రోడ్డులో వందశాతం భూములు, ఇతర ఆస్తులు కోల్పోతున్న వారి వివరాలు సేకరించారు.

ఈ సమావేశానికి రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ కె.చంద్రారెడ్డి, రాజేంద్రనగర్‌ ఆర్డీవో కె.వెంకటరెడ్డి హాజరయ్యారు. బాధితులు తమ భూములు, ప్లాట్లు, ఇండ్లు కోల్పోతున్న అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. జల వనరులకు నష్టం జరుగుతుందని ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. నష్టపరిహారం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద భూమికి బదులు భూమి, ప్లాటుకు బదులు ప్లాట్‌ ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది నీరటికుమార్‌ మాట్లాడుతూ.. నర్కూడ గ్రామంలో 59 ఎకరాల భూమి రేడియల్‌ రోడ్డులో వెళ్తుందని, ఈ రోడ్డులో మూడు ప్రధానమైన కుంటలు కనుమరుగు కానున్నాయని అన్నారు. జల వనరులను ధ్వంసం చేసే అధికారం అధికారులకు ఎక్కడిదని ప్రశ్నించారు.

గ్రామ పొలిమేర నుంచి రేడియల్‌ రోడ్డు వెళ్లడంతో భవిష్యత్తులో గ్రామ విస్తరణ ఆగిపోతుందని, శబ్ద కాలుష్యంతో సమస్యలు వస్తాయని, రోడ్డును గ్రామానికి కిలోమీటర్‌ దూరంలో తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. నిర్వాసితుడు నీరటి మల్లేష్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని విజ్ఞప్తి చేశారు. భూమికి బదులు భూమి ఇవ్వాలని, లేదంటే రేడియల్‌ రోడ్డు పనులను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గ్రామ సర్పంచ్‌ గడ్డం శేఖర్‌యాదవ్‌ మాట్లాడుతూ.. ఇక్కడ భూములు, ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్న వారికి అమ్మపల్లి రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్‌ 19లో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద పునరావాసం, భూములు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడి వెళ్ళిపోతుండగా సంతృప్తి చెందని భూ నిర్వాసితులు కారుకు అడ్డంగా బైటాయించి, నిరసన వ్యక్తం చేశారు. ఆయన కారు దిగి వచ్చి మళ్లీ మాట్లాడి వెళ్లిపోయారు.

అపోహలు వీడండి.. మెరుగైన నష్టపరిహారం ఇస్తాం : అడిషనల్‌ కలెక్టర్‌ కె.చంద్రారెడ్డి
ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ.. రోడ్ల కోసం భూసేకరణ చేసినప్పుడు కొంతమందికి నష్టం జరిగే అవకాశం ఉంటుందని, మిగతా ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందన్నారు. భూ సేకరణలో పూర్తిస్థాయిలో భూములు, ప్లాట్లు, ఇండ్లు కోల్పోతున్న వారి వివరాలను తెలుసుకోవడం కోసమే సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వారి సామాజిక, ఆర్థిక స్థితిని బట్టి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఏ ఒక్కరినీ నష్టపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. రేడియల్‌ రోడ్డు కోసం భూసేకరణ కచ్ఛితంగా జరుగుతుందని స్పష్టం చేశారు.

2013 చట్టం చేసిన దాన్ని రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఈ చట్టం ప్రకారం భూములు కోల్పోతున్న వారికి భూమికి భూమి ఇవ్వాలని లేదన్నారు. అపోహలు వీడి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రస్తుత మార్కెట్‌, ప్రభుత్వ ధర రెండింటిని ఒకచోట చేర్చి పరిశీలించి మధ్యే మార్గంగా కన్సెంట్‌ అవార్డు ఇస్తామని హామీ ఇచ్చారు. జల వనరులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో అధికారులు మహిపాల్‌రెడ్డి, ఎస్‌.రఘుపతిరెడ్డి, నాయకులు బూర్కుంట గోపాల్‌, ఎలుగని నాగేష్‌, గూడెపు లక్ష్మణరావు, లింగం నవీన్‌, నాగమల్లి శేఖర్‌, ఎంఏ ముఖిత్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -