– తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర సలహాదారు చౌడారం రాంప్రసాద్
– విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాలి
నవతెలంగాణ–కమ్మర్ పల్లి
రేపు (ఈనెల 28న) జరగనున్న పదవ తరగతి గణితశాస్త్ర పరీక్ష రాసేటపుడు విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలను తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర సలహాదారు చౌడారం రాంప్రసాద్ వివరించారు. ఇప్పటికే పదవ తరగతి గణిత శాస్త్ర పరీక్ష కోసం విద్యార్థులు సంసిద్ధులై ఉన్నారని పేర్కొన్న ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు తప్పకుండా పూర్తి పేపర్ ను క్షుణ్ణంగా రెండు సార్లు చదవాలని, రెండవ సారి చదివినపుడు పేపర్ పై అవగాహన వస్తుందని తెలిపారు.సులభ సమస్యలను మొదటగా సాధించి, కష్టమైన సమస్యలను తరువాత సాధించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. సరైన సెక్షన్, ప్రశ్న సంఖ్య వేయడం మర్చిపోవద్దు అని సూచించారు.ప్రతి సమస్యను సాధించే ముందు దత్తాంశం
(సమస్యలో ఇవ్వబడినది, సాధించవలసింది) రాయాలన్నారు.సమస్యకు తగిన పటం ఉంటే పెన్సిల్ తో గీయాలని, సూత్రం రాసి తగిన పద్దతిలో సమస్యను సాధించాలని తెలిపారు.సమస్యను సాధించే క్రమంలో తప్పు జరిగితే చిన్నగా ఆ తప్పుపై గీత గీయాలని, సాధారణంగా చేసే కొట్టివేతలు చేయొద్దన్నారు.సమస్య సాధనలో వాడిన సూత్రమును,చివరగా వచ్చిన ఆన్సర్ ను బాక్స్ లో ఉంచాలన్నారు.రాని సమస్యలను కూడా చివరగా తప్పకుండా ఎంతో కొంత ప్రయత్నం చేయాలని, వదిలేసే కన్నా ప్రయత్నించి కనీస మార్కులైన పొందవచ్చని సూచించారు.సమయం ఉంటే అదనపు సమస్యలకు సమాధానములు చివరగా రాయాలన్నారు.గ్రాఫ్ పేపర్ పై ప్రశ్న సంఖ్యను చేయాలని విద్యార్థులకు సూచించారు.
గ్రాఫ్ ను అదనపు సమాధాన పత్రాలకు చివరగా (ఆబ్జెక్టివ్ పేపర్ కంటే ముందుగా) కట్టాలన్నారు.గ్రాఫ్ కు సంబంధించిన సమస్యకు సమాధానం తెలిసినంత వరకు ప్రయత్నించాలని, కనీసం గ్రాఫ్ పై X-అక్షం, Y-అక్షం గీసి స్కేల్ రాసి విలువలను గుర్తిస్తే కనీస మార్కులు పొందవచ్చన్నారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే క్రమంలో కొట్టివేతలు, దిద్దడం చేయకుండా జాగ్రత్తగా సమాధానాలు గుర్తించాలన్నారు. కొట్టివేతలకు,దిద్దివేతలకు మార్కులు వచ్చే అవకాశం లేదన్నారు. ఉపాధ్యాయులను ప్రిన్సిపుల్స్ ఆఫ్ వాల్యూయేషన్ గురించి అడిగి తెలుసుకోవాలని సూచించారు. సరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శ రేఖలు సమస్యలు చేసేటప్పుడు రఫ్ స్కెచ్ గీయాలని, నిర్మాణాలు చేసేటప్పుడు చక్కగా చేయాలన్నారు. పరీక్ష ప్రారంభంలోనే ఆరు మార్కుల ప్రశ్నలు పూర్తిచేసే ప్రయత్నం చేయాలన్నారు. దాంతో టైం మేనేజ్మెంట్ చేసుకోవడం ద్వారా రివిజన్ చేసుకోవచ్చని తెలిపారు. బిట్ పేపర్ ఇవ్వడానికి ముందే పార్ట్ ఏ పూర్తి అయ్యే విధంగా పరీక్షకు సిద్ధం కావాలని విద్యార్థులకు వివరించారు. గణితంలో కనీసం 50 సూత్రాలు,50 నిర్వచనాలు నేర్చుకుంటే 70 నుంచి 80 మార్కులు సులభంగా సాధించవచ్చన్నారు
ఆత్మవిశ్వాసంతో పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాలి…
విద్యార్థులు పరీక్షను సులభంగా చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర సలహాదారు చౌడారం రాంప్రసాద్ విద్యార్థులకు సూచన చేశారు.9వ తరగతి విద్యార్థులు కూడా పదవ తరగతి గణిత పరీక్ష రాస్తే అప్పటికే నేర్చుకున్న అంశాలతో కనీస మార్కులు 28 సంపాదించుకో గలుగుతారన్నారు. విద్యార్థులు బాగా చదివి గణిత శాస్త్ర పరీక్షను రాయడం ద్వారా అత్యుత్తమ మార్కులు సాధించాలని ఆయన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.



