నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) సర్వీస్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి బ్రిడ్జి పిల్లర్‌ను బలంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన శుక్రవారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన కనయ్యలాల్ (25), దేరామ్ (24) నగరంలో టైల్స్ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి వీరిద్దరూ ఇంద్రారెడ్డి నగర్ నుంచి నానక్‌రామ్‌గూడకు టవేరా కారులో (AP01AB2232) బయలుదేరారు.
గచ్చిబౌలి సమీపంలోని నియోపోలిస్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే, కారు అదుపుతప్పి సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న పిల్లర్‌ను అతివేగంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, వాహనంలో ఉన్న ఇద్దరూ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



