భూ సమస్యల పరిష్కారం పేరుతో తీసుకొచ్చిన ‘భూ భారతి’ చట్టం రైతులకు ఆశలు కలిగించినా, అమలులో మాత్రం తీవ్ర నిరాశ మిగిల్చింది. గత ప్రభుత్వాల విధానాల లోపాలు సరిదిద్దుతామని చెప్పిన ప్రస్తుత ప్రభుత్వంకూడా సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతోంది. లక్షలాది రైతులు తమ భూమి హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దుస్థితి కొనసాగుతోంది. ధరణి లోపాల వల్ల ఏర్పడిన సమస్యలు ఇంకా పరిష్కారం కాకుండానే కొత్త చట్టం జాప్యానికి గురైంది. భూసర్వేలు పూర్తికాకపోవడం, కేసులు పెండింగ్‌లో ఉండటం రైతుల ఇబ్బందుల్ని మరింత పెంచుతున్నాయి. భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియల్లో అధిక ఫీజులు విధించడం పేద రైతులకు భారంగా మారింది. కొన్ని నిబంధనల వల్ల రైతులు తమ సొంత భూమిని కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కౌలు రైతులకు గుర్తింపు లేకపోవడం వల్ల వారికి రుణాలు, పథకాల ప్రయోజనాలు అందడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం 2025లో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. తర్వాత కాలంలో భూ భారతికి రూల్స్ కూడా ఆమోదించింది. భూముల సమస్యలు పరిష్కరించాలని గత దశాబ్ద కాలంలో ఇరవైలక్షల మంది రైతులు పాసు బుక్కుల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి చట్టం తెచ్చి తొంభైశాతం భూ సమస్యలు పరిష్కరించామని నాటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. వాస్తవానికి ధరణి వచ్చిన తర్వాత, రికార్డలు డిజిటలైజేషన్ జరిగిన తర్వాత అందులో జరిగిన పొరపాట్ల వల్ల పదిహేనుల లక్షల మందికి పాస్ పుస్తకాలు రాలేదు. రెవెన్యూ కోర్టులు (తహసిల్దార్, ఆర్డీఓ, కలెక్టర్) ఎత్తివేయడంతో వేల కేసులు పరిష్కారానికి నేటికీ నోచుకోలేదు.
ట్రిబ్యునల్స్‌ను అపాయింట్ చేసి పెండింగ్ కేసులు ఏకపక్ష పరిష్కారాలు చేయడంతో వారంతా సివిల్ కోర్టుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. సివిల్ కోర్టుకు వెళ్లలేని వారు భూములు వదులుకుని గ్రామాలలో రాజకీయ నాయకులు చుట్టూ తిరగడం ప్రారంభించారు. అయినా పరిష్కారం కావడం లేదు. తెలంగాణ రైతు సంఘాలు అనేక ఆందోళనలు చేపట్టిన ఫలితంగా కేబినెట్ మంత్రులతో హరీశ్‌రావు, సబిత తదితరులతో కమిటీ వేశారు. ఆ కమిటీ పరిశీలన చేసి ధరణిలో 35 లోపాలున్నట్లు గుర్తించింది. ఆ లోపాలను సరిచేయడానికి ఏడు మాడ్యూల్స్ (గ్రూపులు)గా మార్చి పరిష్కారం చేస్తామన్నారు. భూ సమస్యలున్న ప్రతి రైతు రూ.1650 మీ సేవలో చెల్లించమని ఈ కమిటీ ఆదేశించింది.
ఆర్థిక మంత్రి హరీష్‌రావు ఆదేశాలను నమ్మి 4.5 లక్షల మంది డబ్బులు చెల్లించారు. కానీ, ఏ ఒక్కరి సమస్యా పరిష్కరించబడలేదు. సమగ్ర భూ సర్వే చేసి భూ తగాదాలు పరిష్కారం చేస్తానన్న కేసీఆర్ ప్రభుత్వంలోని పాలకులు, ప్రజా ప్రతినిధులు రాష్ట్రంలో (ఫాంహౌజ్ కల్చర్) అమలులోకి తెచ్చారు. తమ సొంత ఫాంహౌజ్‌ల కొరకు ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములు, పేదల అసైన్డ్ భూములు, ఫారెస్టును ఆనుకుని వున్న బంజరు భూములు ఆక్రమించి వ్యక్తిగత ఫాంహౌజ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. కేసీఆర్ ఫాంహౌజ్ కూడా ఆ విధంగా ఏర్పడిందే. గత ప్రభుత్వం ప్రజల సమస్యలు నిర్లక్ష్యం చేస్తూ, భూ సమస్యలు పరిష్కరించనందున దాని స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. తాము అధికారంలోకి రాగానే ‘ధరణి’ని బంగాళాఖాతంలో వేసి భూ భారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. 09 డిసెంబర్ 2023న అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది ఏప్రిల్‌లో భూ భారతి చట్టం రూపొందించింది.
చట్టం రూపొందించి రెండేళ్లు గడిచినప్పటికీ ఇంతవరకు సమగ్ర భూ సర్వే జరుప లేదు. భూ భారతి చట్టంలో ‘భూదార్’ కార్డు ఇవ్వడానికి ప్రాథమికంగా కార్డులిచ్చి తర్వాత సర్వే చేసి, ప్రతి రైతుకు శాశ్వత భూహక్కు కార్డు ఇస్తామని చెప్పి సంవత్సరం కావస్తున్నది. ముఖ్యంగా లక్షల మంది రైతులు ‘ప్రజా పాలన’లో తమ సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్నారు. వాటన్నింటినీ పరిష్కరిస్తామని అధికారులకు దరఖాస్తులు బదిలీ చేశారు. కానీ, ఇంతవరకు లక్షల కేసులు పరిష్కారం కాకుండా పెండింగ్‌లోనే ఉన్నాయి. తహసిల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేయకపోవడంతో స్థానికంగా సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. భూ భారతి చట్టం అమలుకు గ్రామాధికారులను నియమించారు. కానీ, వారిచే పదకొండు అంశాల పహాణీ పత్రిక రాయించి అందులో వాస్తవ సాగుదారు పేరు (కౌలుదారు) నమోదు చేస్తామన్నారు. ఇంతవరకు ఆ ప్రయత్నమే ప్రారంభం కాలేదు.
సాదాబైనామాలు 10అక్టోబర్2020 నుండి నవంబర్ మధ్య దరఖాస్తు చేసుకున్న వారందరినీ రెగ్యులరైజ్ చేస్తామని అనేకసార్లు మంత్రులు హామీలిచ్చారు. చట్టంలో నిర్ధేశించారు. అయినా, నేటికీ అమలు కాలేదు. వాస్తవానికి కాంగ్రెస్ అధికారానికి వచ్చినా 09డిసెంబర్ 2023 వరకు కొనుగోలు సాదాబైనామాలను రెగులరైజ్ చేయాలి. ఐదెకరాలలోపు జరిగిన లావాదేవీలకు మాత్రమే పరిమితం చేస్తామని, వారికి కూడా నేటివరకూ రెగ్యులరైజ్ కాలేదు. వ్యవసాయ, రెవెనూ, నీటిపారుదల శాఖల మంత్రులు కొన్ని గ్రామాలలో సెమినార్లు జరిపి గ్రామ రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి మార్గం చూపారు. కానీ, సంవత్సరంలో అన్ని గ్రామాలలో సమావేశాలు జరిపి పరిష్కరిస్తామన్న ప్రభుత్వం ఆ పథకం కాగితాలకే పరిమితం చేసింది. ధరణి చట్టంలో వారసత్వ భూములు రిజిస్ట్రీ చేసుకుంటేనే మ్యుటేషన్ చేస్తామంది. దాన్ని భూ భారతిలో తొలగించామని పేర్కొంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ్చర్యకర మైన రీతిలో వారసత్వ పట్టాలు మ్యుటేషన్ చేసినప్పుడు రిజిస్ట్రీ ఫీజులు మొదలు ఎకరాకు రూ.2,500 -ఫీజు చెల్లించాలని రూల్స్‌లో షెడ్యూల్డు- బిలో నిబంధన పెట్టింది. వారసులు పదెకరాలు పంపిణీ చేసుకున్నచో రూ.25వేలు ఫీజు చెల్లించాలి. షెడ్యూల్డు- బిలో ఒకసారి రిజిస్ట్రేషన్ వాయిదా పడి రెండవసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నచో 3వసారి రిజిస్ట్రేషన్ తేదీ మార్చినచో రూ.వెయ్యి జరిమానా కట్టాలి. భూభారతి రూల్స్‌లో షెడ్యూల్ -ఎ ప్రకారం భూమి విలువ రూ.5లక్షల లోపు అయినచో తహశీల్దారు అంతకు పైన అయినచో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకోవాలి. నేడు తెలంగాణలోని భూముల విలువ గమనించినచో ప్రతికేసు కలెక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. చట్టంలో ఐదెకరాలలోపు భూముల సమస్యలు తహశీల్దారుకు, ఏడెకరాలలోపు ఆర్డీఓకు, పదెకరాలలోపు కలెక్టర్‌కు నివేదించే విధంగా షెడ్యూలు మార్చాలి. ప్రస్తుత షెడ్యూలులో ఇండ్ల స్థలాలు పూర్తిగా కలెక్టర్ తీర్పు ద్వారానే పరిష్కరించబడాలి. దీన్ని తహశీల్దారుకు ఇవ్వాలి.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అర్హమైన భూములను కూడా రిజిస్టర్ ఆఫీసులో ’22 ఎ రిజిస్టర్ ‘ (రిజిస్ట్రేషన్ నిషేదం జాబితా)లో చేర్చింది. ఎవరైనా ఒక రైతు తనకున్న రెండెకరాలలో ఎకరం భూమి రిజిస్టర్ చేసినచో మిగిలిన భూమిని 22 ఎ రిజిస్టర్‌లో చేర్చారు. 24 అంశాల కింద 19.45 లక్షల ఎకరాలు రాష్ట్రంలో 22 ఎ కింద నమోదు చేసింది. ఈ జాబితాను కూడా నేటికీ పరిష్కరించ లేదు. సొంత భూమి అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. గ్రామ సభలు జరిపి, రెవెన్యూ రికార్డు నమోదు చేసి, పట్టేదారుతోపాటు వాస్తవ సాగుదారు పేరు కూడా నమోదు చేయాలి. వాస్తవ సాగుదారుకు సాగు గుర్తింపు ఇవ్వాలి. ఆ గుర్తింపు కార్డు ద్వారా బ్యాంకులు రుణాలివ్వడం, అకాల వర్షాల వల్ల నష్టం జరిగితే ప్రభుత్వం పరిహారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ సబ్సిడీ పథకాలు అమలు చేయాలి. ఈ వనరులు లేకపోవడంతో కౌలుదారులు ప్రయివేటు రుణాలపై ఆధారపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
యేటా రాష్ట్రంలో 460 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నివేదికలు నమోదవుతున్నాయి. అందువల్ల ప్రభుత్వం ‘భూ భారతి చట్టాన్ని’ తక్షణమే అమలు చేయడంతో పాటు రూల్స్‌లోని షెడ్యూల్ ఎ, బిలను సవరించాలి. పేదలకు ఆర్థిక భారం కలిగే విధంగా చట్టంలో వున్న నిబంధనలను తొలగించాలి. ప్రభుత్వాధి కారులు చేసిన తప్పుల వల్ల నష్టపోయిన రైతులు ఫీజలు చెల్లించాలని, మీ సేవా కేంద్రాలకు వెళ్లాలని, ఆర్థిక భారాలు వేయడం సరైన చర్య కాదు. ప్రభుత్వ భూములను సర్వేచేసి, వాటిని భూమిలేని పేదలకు పంపిణీ చేయాలి. 2005-2008 సంవత్సరాల మధ్య అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏడు లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం భూములు అక్రమ ఆక్రమణలో వున్నాయి. వీటితోపాటు భూదాన భూములు, చెరువు శిఖాలు ఆక్రమణకు గురైనవని రికార్డులు తెలుపుతున్నాయి. అందువల్ల ఇప్పటికైనా సమగ్ర భూ సర్వే జరిపి, చట్టంలో వున్న లోపాలను సవరించాలి. సమస్యలను పరిష్కరించుటకు తగు చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలి.
జూలకంటి రంగారెడ్డి
9490098349



