Saturday, March 28, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిబతుకులు 'బుగ్గి'పాలు!

బతుకులు ‘బుగ్గి’పాలు!

- Advertisement -

రోజువారి చెమటోడ్చి పొట్టనింపుకునే చేతులు..కుటుంబపోషణ కోసం ప్రయాణించిన పాదాలు.. ఒక్క క్షణంలో అగ్నికి ఆహుతైపోయాయి. ఏపీలోని మార్కాపురం దగ్గర రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం రవాణా వ్యవస్థలోని లోపాలను మరోసారి బహిర్గతపరిచింది. ప్రయివేటు బస్సు, టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో పద్నాలుగు మంది సజీవ దహనమవ్వడం తీవ్ర విషాదం. ప్రాణాలు కోల్పోయిన వారంతా కూలీలే కావడం మరీ హృదయ విదారకం. ఉన్న ఊరును, కన్నవారిని వదిలి ఉపాధి కోసం వలసొచ్చిన వారు, చివరకు కుటుంబాలనే అంధకారంలోకి నెట్టారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వాల, ప్రయివేటు యాజమాన్యాల నిర్లక్ష్యమే! ఎందుకంటే, గతేడాది కర్నూల్‌లో జరిగిన ఘటనలో ఇలాగే పందొమ్మిది మంది అసువులు బాశారు. చేవెళ్లలో టిప్పర్‌ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఇరవై మందివరకు కంకర కుప్పల్లోనే ఊపిరొదిలారు. ఇలా వరుస ఘటనలు జరుగుతున్నా అధికారులు పాఠాలు నేర్వక పోవడం విచారకరం.
తాజా ఘటనలో మృతుల వివరాలు చూస్తే సామాన్యుల దుస్థితి స్పష్టమవుతోంది.

వారంతా బతుకుదెరువు కోసం ఏపీ నుంచి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలకు వలసొచ్చిన కూలీలు. కొందరు ఇటుకబట్టీల్లో పనిచేస్తే మరికొందరు భవన నిర్మాణరంగాల్లో స్థిరపడ్డారు. రోజూ పనిచేస్తేనే నాలుగువేళ్లూ నోట్లోకి వెళ్తాయి, లేదంటే పస్తులే. ఆస్తిపాస్తులేమీ లేవు. వచ్చే పదోపరకతోనే కుటుంబాన్ని పోషించుకుంటారు. శ్రీరామనవమి సందర్భంగా కొందరు, ఆప్తులను చూసొద్దామని మరికొం దరు సొంతూళ్లకు బయలుదేరారు. కానీ, వారి బతుకులు కన్నవారిని కలుసుకోకుండానే తెల్లారి పోయాయి.వారు ప్రయాణించిన హరేకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ప్రయివేటు బస్సు కూడా పూర్తిగా వారిని అభద్రతలోకే నెట్టేసింది. బస్సుకు మరమ్మతులు చేయించాల్సి ఉన్నా పట్టించుకోలేదు. గమ్యస్థానానికి మరో మూడు గంటల సమయం ఉందనగా స్టీరింగ్‌ అదుపు తప్పి నేరుగా టిప్పర్‌ డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. వెంటనే అంటుకున్న మంటలు ప్రయాణికులను అగ్నికీలల్లో ముంచేశాయి. ఇన్ని వందల కిలోమీటర్ల మధ్య బస్సు ఫిట్‌నెస్‌ను ఒక్క అధికారి కూడా పరిశీలించక పోవడం ఇక్కడ ఆశ్చర్యకరం.

డ్రైవర్లలో ఎవరిది తప్పన్నది కాసేపు పక్కన బెడితే అమాయకులు చనిపోయారు. బాధ్యత ఎవరు వహిస్తారు? పాలకులా, ప్రయివేటు యజమానులా? కండీషన్‌ లేని బస్సును బయటకు తీసుకురావడం ప్రమాదానికి అసలు కారణం. అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్టర్‌ అయిన బస్సు తెలంగాణ, ఏపీల్లో తిరుగుతుంటే పర్యవేక్షించి సీజ్‌ చేయకపోవడం అధికారుల అలసత్వం. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావిడి చేయడమే తప్ప, ప్రమాదాలు జరగకుండా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు పూర్తిగా శూన్యం! ప్రయివేటు ట్రావెల్స్‌కు లాభాలే ముఖ్య మన్నది తెలిసిందే. డ్రైవర్లకు సరైన విశ్రాంతి కూడా ఇవ్వడం లేదనే విమర్శలు అనేకం. ఎమర్జెన్సీ డోర్లు, ఫైర్‌సెప్టీ వ్యవస్థలు పనిచేయక పోవడం వంటివి కోకొల్లలు. రాత్రి ప్రయాణాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, పర్యవేక్షించే నెట్‌వర్క్‌ లేకపోవడం వీటికి అదనం. ఇక ఫిట్‌నెస్‌ తనిఖీల్లో అవినీతి, కేవలం కాగితాలపైనే పరిశీలనలు ‘మామూలే’! ఇవి మన వ్యవస్థలో దాగున్న లోపాలు. చేవెళ్లలో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లు చనిపోయిన ఘటన మన మనసును ఇప్పటికీ కలచివేస్తూనే ఉంది.

ఇప్పుడు ఏపీలో జరిగిన ప్రమాదంలోనూ అదే కథ. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబమే ఇప్పుడు కూలిపోయింది. ఇంకోచోట వృద్ధ తల్లిదండ్రులను చూసుకునే ఏకైక కుమారుడు మృతిచెందడంతో వారికి ఆధారమే లేకుండా పోయింది. కాగా అభంశుభం తెలియని చిన్నపిల్లలు వారి తండ్రికోసం ఎదురు చూస్తుండగా విన్న మరణవార్త వారి భవిష్యత్తునే చీకట్లోకి నెట్టేసింది. ప్రాణాలు కోల్పోయిన కూలీల కుటుంబాల రోదన మాటల్లో చెప్పలేం. ‘మా వాళ్లు ఏం పాపం చేశారు? ఎందుకు మాకీశోకం?’ వారి కన్నీళ్లు పాలకులపై ఇప్పుడు ప్రశ్నలుగా నిలుస్తున్నాయి.

ప్రతి ప్రమాదం తర్వాత విచారణలు, పరిహారం ప్రకటనలు వస్తున్నా మూల కారణాలపై చర్యలు మత్రం కనిపించడం లేదు. తనిఖీల్లో నిర్లక్ష్యం, ట్రాఫిక్‌ నియమాల అమలులో బలహీనత, ఇవే ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి. ఇలాంటివి మీడియాలో వచ్చినప్పుడో, లేదంటే మరేదైనా ఘటన జరిగినప్పుడో తప్ప మన అధికారుల స్పందన ‘అంతంత’ మాత్రమే! ఇకనైనా తెలుగు రాష్ట్రాల్లోని పాలకులు మేల్కోవాలి. ప్రయివేటు ట్రావెల్స్‌పై కఠిన నియంత్రణలు అమలుచేయాలి. ప్రజల ప్రాణాలు లాభాలకంటే విలువైనవని గుర్తించాలి. లేదంటే, ఇలాంటి ప్రమాదాలు పేదల జీవితాలను నిత్యం ఛిద్రం చేస్తూనే ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -