Saturday, March 28, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసభలో సీరియస్‌నెస్‌ ఎక్కడ..?

సభలో సీరియస్‌నెస్‌ ఎక్కడ..?

- Advertisement -

అసెంబ్లీ కంటే ఇతర అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత
అసమగ్రంగా చర్చలు.. అంతంతమాత్రంగా హాజరు
చిట్‌చాట్‌లపై ఉన్న శ్రద్ధ చర్చలపై లేదు?
ఇక ప్రజా సమస్యలకు చోటేది?

బి.వి.యన్‌.పద్మరాజు
ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలకు చట్ట సభలు వేదికలు. ఆయా సమస్యలను సభల్లో లేవనెత్తటం ద్వారా ప్రజా ప్రతినిధులు వాటి పరిష్కారానికి కృషి చేయాలి. కానీ గత కొంత కాలంగా అటు పార్లమెంటులోగాని.. ఇటు అసెంబ్లీలోగాని ఈ మౌలిక సూత్రం పక్కకుపోతోందనే వాదనలు వినబడుతున్నాయి. రాజ్యాంగపరంగా, సాంకేతికంగా సభను నడపాలి కాబట్టే నడుపుతున్నారు తప్పితే అందులో చిత్తశుద్ధి కానరావటం లేదనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తీరు తెన్నులను పరిశీలిస్తే ఈ విషయం మరింతగా స్పష్టమవుతోంది.
ఈనెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆరోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా ప్రసంగించారు. ఆ మరుసటి రోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీ హీటెక్కింది.

19న ఉగాది, 21న రంజాన్‌, 22న ఆదివారం, 27న శ్రీరామనవమి సెలవులను మినహాయిస్తే… మిగతా సభ జరిగినన్ని రోజులు ఇదే హీట్‌ కంటిన్యూ అయ్యింది తప్ప అర్థవంతమైన చర్చలకు ఆస్కారమే లేకుండా పోయింది. 20న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ వేడి మరింత ఎక్కువైంది. బడ్జెట్‌పై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిగితే రాష్ట్ర ప్రజానీకానికి ఎంతోకొంత మేలు జరుగుతుందని ఆశించిన వారికి ఈసారి కూడా నిరాశే మిగిలింది. ప్రధాన ప్రతిపక్షంపై దూషణ భాషణలతో అధికారపక్షం కాంగ్రెస్‌ చెలరేగితే..నిర్మాణాత్మక సూచనలు,సలహాలను ఇవ్వటంలో విఫలమైన ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ తిట్ల పురాణాలకే పరిమితమైంది. ఇక్కడ ప్రజలు కేంద్ర బిందువుగా సాగాల్సిన బడ్జెట్‌, దానిపై చర్చలు.. వ్యక్తుల వాగాడంబరం, వాగ్దాటిలో కొట్టుకుపోయాయి.

ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ఈసారి కూడా అసెంబ్లీకి డుమ్మా కొట్టటం…ప్రజాస్వామ్యం, చట్టస భల పట్ల ఆయనకున్న ‘గౌరవాన్ని’ తెలియజేస్తోంది. మరోవైపు కీలకమైన శాసనసభా సమావేశాలు జరుగుతున్నప్పుడు, అందునా బడ్జెట్‌పై చర్చకు సమాధానమివ్వాల్సిన తరుణంలో సభా నాయకులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు ఉంటే సభకు గౌరవంగా ఉంటుంది. కానీ కీలక సమయాల్లో ఈ ప్రధాన నేతలంతా సభకు రాకపోవటంతో సభ్యులకు చర్చల పై తగిన కేంద్రీకరణ ఉండటం లేదు. అలాగే విరామ సమయాలు కూడా సభ సీరియస్‌నెస్‌ను తగ్గిస్తున్నాయి. ఈనెల 23న మధ్యాహ్నం టీ బ్రేక్‌ అని చెప్పి.. సభను 2.50 గంటలపాటు వాయిదా వేయ టం కూడా విస్మయానికి గురి చేసింది. ఆ సమయంలో సభా కార్యకలాపాలను, దాని పనితీరును వీక్షిద్దామని వచ్చిన పాఠశాల విద్యార్థులకు మన చట్టసభలు ఇచ్చే సందేశమేమిటి?

మరోవైపు అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం అనే తేడా లేకుండా సభ జరుగుతున్నప్పుడు సభ్యులు అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌లు నిర్వహించటం పరిపాటిగా మారింది. మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు, ఆ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్‌ సహా అందరూ ఇష్టాగోష్టుల్లో మునిగి తేలుతున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో…’ప్రతి ఒక్కరూ సభకు విధిగా హాజరు కావాలి.. కొత్తగా ఎన్నికైన సభ్యులు సభా కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తూ కొత్త విషయాలను నేర్చుకోవాలి. చర్చల్లో అందరూ పాల్గొనాలి.. మీడియాతో చిట్‌చాట్‌లు తగ్గించి, సబ్జెక్టులపై దృష్టి సారించాలి…’ అని సీఎం రేవంత్‌ రెడ్డి దిశా నిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆయన ఆదేశాలను కాంగ్రెస్‌ సభ్యులెవరూ పట్టించుకున్నట్టు కనబడటం లేదు. బీఆర్‌ఎస్‌ సభ్యులు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. బడ్జెట్‌, పద్దులు, బిల్లులపై చర్చ కొనసాగుతున్న తరుణంలో సభలోని సభ్యుల సంఖ్యను పరిశీలించినప్పుడు ఈ విషయం స్పష్టమవుతోంది.

గురువారం సభలో అత్యంత ముఖ్యమైన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల పద్దులు, బీసీలకు రిజర్వేషన్ల అంశం చర్చకొచ్చినప్పుడు మొత్తం 119 మంది సభ్యులకుగాను 40 మంది మాత్రమే ఉండటం గమనార్హం. అంటే 79 మంది సభ్యులు సభ బయట ఉన్నారన్నమాట. ఈనెల 16 నుంచి 30 వరకు బడ్జెట్‌ సమావేశాలు అనుకున్నప్పటికీ… ఇప్పటి వరకు ఐదారు రోజులు సెలవులకే పోయాయి. ఇక మిగిలిన మూడు రోజుల్లో రెండు రోజులపాటు (శని, ఆదివారాలు) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించటం వివాదాస్పదమవుతోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వాటిని నిర్వహించుకోవచ్చుగదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ‘ప్రభుత్వ హామీలను, ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించేందుకే ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోంది…’ అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో వామపక్షాల ప్రాతినిధ్యం తగ్గితే…చర్చలు ఎలా జరుగుతాయో? సభ ఎలా నడుస్తుందో? చివరకు ప్రజలకు ఎంత నష్టం వాటిల్లుతుందనే దానికి ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -