సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రపంచ దేశాలపై అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యధోరణి అత్యంత ప్రమాదకరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర దేశాలు తాము చెప్పిందే వినాలనే ధోరణి కనిపిస్తోందని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంహెచ్ భవన్‌లో జరిగిన జనరల్ బాడీలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ సభ్యులు రాంపల్లి రమేష్ అధ్యక్షత వహించారు. పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు పి ప్రభాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కె. ఆనందాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ లాటిన్ అమెరికా దేశాల్లో పెత్తనం చెలాయించాలని అమెరికా ప్రయత్నిస్తోందన్నారు. ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడిని అక్రమంగా అరెస్టు చేసిందని విమర్శించారు.
చమురు నిల్వలపై అధిపత్యం కోసం ఇజ్రాయిల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై యుద్ధం చేస్తోందన్నారు. ప్రపంచ దేశాలపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. ముఖ్యంగా అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందన్నారు. అక్కడ కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయన్నారు. నిరుద్యోగ సమస్య కూడా వెంటాడుతున్నదని తెలిపారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితులను ట్రంప్ తట్టుకోలేకపో తున్నారని గుర్తు చేశారు. సోషలిజం అనే మాట వినపడకుండా అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. ప్రస్తుతం ఏకధృవ ప్రపంచం లేదన్నారు. చైనా, రష్యా దేశాలు కూడా అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అమెరికాకు దీటుగా చైనా శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. ఇప్పటికే చైనా 37 దేశాలతో మంచి సంబంధాలను కొనసాగిస్తోందన్నారు.
వలసవాదులకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉన్న భారతదేశంలో సామ్రాజ్యవాదులకు మోకరిల్లే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రారంభించబోయే ముందు ప్రధాని మోడీ ఇజ్రాయిల్ దేశంలో రెండు రోజులపాటు పర్యటించారని తెలిపారు. కనీసం యుద్ధం గురించి ఇప్పటికీ ఆయన స్పందించలేదని విమర్శించారు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధం ఫలితంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందనీ, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్న చట్టాలను కార్పొరేట్లకు అనూకూలంగా మార్చేందుకే పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. అటవీ హక్కుల చట్టాన్ని సవరణ చేయడం ద్వారా కార్పొరేట్ల కంపెనీలకు బాటలు వేశారని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ ఉందని గుర్తు చేశారు. మతం మారినంత మాత్రాన కులం మారదని చెప్పారు. ఏ మతంలోకి వెళ్లినా ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.



