నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని రేగులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల దేవరాంపల్లి గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని రేగులగూడెం సర్పంచ్ పాగే ఆమని సురేష్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. పశుపోషకులకు గాలికుంటు వ్యాధి ప్రాముఖ్యత, దాని నివారణ మార్గాలపై అవగాహన కల్పించారు. ప్రతి రైతు తప్పనిసరిగా తమ పశువులకు టీకాలు వేయించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా పశువైద్యాధికారి డాక్టర్ జి. రమేష్ మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి ఒక అంటువ్యాధి అని, ఇది పికార్నో వైరస్ వల్ల వ్యాపిస్తుందని తెలిపారు. మన రాష్ట్రంలో ప్రధానంగా O, A, ASIA-1 రకాల వైరస్ల వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని చెప్పారు. ఈ వ్యాధి వల్ల పశువుల్లో మరణాల శాతం తక్కువగా ఉన్నప్పటికీ, పాలు ఉత్పత్తి తగ్గడం, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు. ముఖ్యంగా సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు.
పశువుల్లో అధిక జ్వరం (104°F–106°F), నోరు మరియు కాళ్ల గిట్టల మధ్య బొబ్బలు, నోటి నుండి చొంగ కారడం, పాలు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. వ్యాధి తీవ్రమైతే పశువులు మేత, నీరు తీసుకోకుండా బలహీనమై మరణించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ వ్యాధి నివారణకు పశువుల పాకలను శుభ్రంగా ఉంచడం, 4 నెలల వయస్సు దాటిన దూడలు మరియు పెద్ద పశువులకు ప్రతి 6 నెలలకు ఒకసారి టీకాలు వేయించడం అత్యంత అవసరమని సూచించారు. వ్యాధి సోకిన పశువులను వెంటనే వేరుచేసి, పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రపరచడం, నోటి పుండ్లకు బోరోగ్లిసరిన్ ఉపయోగించడం మంచిదని తెలిపారు.
ఇదే సందర్భంలో ఈ సంవత్సరం కూడా ఉచిత టీకాల కార్యక్రమం కొనసాగుతుందని, పశువైద్య బృందాలు గ్రామాల వారీగా పర్యటించి టీకాలు వేస్తాయని తెలిపారు. రైతులు తమ పశువులకు టీకాలు వేయించి, చెవిపోగు వేయించుకొని వివరాలను భారత్ పశుధన్ యాప్లో నమోదు చేయాలని కోరారు. డాక్టర్ ధీరజ్, పశు వైద్య సహాయకులు తుంగల రాజశేఖర్, సుల్తానాబేగం, పశుమిత్ర నజీమా, గోపాలమిత్ర చిట్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



