ద్రిషికా చందర్… థియేటర్ ఆర్టిస్టుగా ఎన్నో వేదికలపై నటించారు. మనసానమ: అనే షార్ట్ ఫిలింతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ చిత్రానికి గాను 40కి పైగా ఉత్తమ నటి అవార్డులు అందుకున్నారు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఆ తర్వాత అనేక షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వెండితెరపై కూడా అనేక చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల విడుదలైన ‘సుయోధన’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఆమె పరిచయం నేటి మానవిలో…
థియేటర్ ఆర్టిస్ట్‌గా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది?
నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. అమ్మతో పాటు సినీ ఇండస్ట్రీని చూస్తూ ఎదిగాను. అమ్మానాన్నలకు నేనూ, అక్క.. అంతే. ఇంట్లో చాలా అల్లరి పిల్లను. కానీ బయట మాత్రం భయస్తురాలిని. స్టేజ్ ఫియర్ బాగా ఉండేది. స్కూల్లో పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. అయితే ఇంట్లో అమ్మ మాత్రం చాలా విషయాలు చెప్పేది. ఆడా మగా అనే తేడా ఉండేది కాదు. అమ్మ దీపా చందర్, థియేటర్ ఆర్టిస్ట్. చాలా వాటికి దర్శకత్వం వహించింది. నేను కూడా చూడటానికి వెళ్లేదాన్ని. చిన్నప్పటి నుండి మొహ మాటంగా, భయంగా ఉండడం వల్ల థియేటర్ ఆర్ట్ నేర్చుకుంటే ఆ భయం పోతుందని అమ్మ నన్ను అటువైపు ప్రోత్సహించింది. చాలా థియేటర్ వర్క్‌షాపులకు వెళ్లాను. అలా థియేటర్ ఆర్టిస్ట్‌గా మారాను.
ఆర్టిస్ట్‌గానే కెరీర్ ప్రారంభించాలనుకున్నారా?
వర్క్‌షాపులకు వెళ్లిన తర్వాత ఒక ఆర్టిస్ట్ ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది తెలిసింది. నాకు తెలిసింది ఆచరణలో పెట్టాలి అని ఆర్టిస్ట్‌గా మారాను. వాస్తవానికి ఈ ఆలోచన నాలో చిన్నతనం నుండే ఉంది. అమ్మ అరుంధతి సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసింది. అప్పుడు జూనియర్ అరుంధతి పాత్రకు నేను ఆడిషన్స్‌కు వెళ్లాను. సెలక్ట్ కూడా అయ్యాను. కానీ చిన్నదాన్ని కదా.. షూటింగ్ కోసం రోజూ ట్రావెలింగ్ చాలా ఇబ్బంది అవుతుందని అమ్మ తర్వాత చూద్దాంలే అన్నది. దాంతో నటించలేకపోయాను. అప్పటి నుండే నటించాలి అనే కోరిక ఉండేది. ట్రైనింగ్ తర్వాత ఇది నిజం చేసుకోగలిగాను. ఇందులోనే నా కెరీర్ రూపొందించుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. తర్వాత హిందీ, తెలుగులో నేను కూడా కొన్ని వర్క్‌షాప్‌లు నిర్వహించాను. రెగ్యులర్ ఎడ్యుకేషన్ తర్వాత న్యూయార్క్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను.
ఇండస్ట్రీలోకి వస్తుంటే మీ బంధువులు ఏమీ అనలేదా?
చాలా మంది ఏవేవో అన్నారు. ఇలా ఎందుకు అని అడిగేవాళ్లు. ఎందుకంటే ఈ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవడం చాలా కష్టం. కానీ నేను కష్టపడగలను అనే నమ్మకం ఉంది. కాబట్టి నిరూపించుకోవాలి అనుకున్నాను. అమ్మ ఎప్పుడూ ‘మీకు ఏం కావాలో అది చెయ్యాలి. మీ మనసు చెప్పింది వినాలి. ఏదో ఒక పని మీద ఏకాగ్రత పెట్టాలి. అయినా మీరు అది సాధించలేకపోతే ఇంకా కష్టపడాలి’ అని చెప్పేది. అలా నా మనసుకు నచ్చింది నేను చేయాలని నిర్ణయించుకున్నా. ఎవరు ఏమాన్నా నా ప్రయత్నం కొనసాగించాను. థియేటర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకోగలిగాను. ఇప్పుడు సినిమాల్లో కూడా నిరూపించుకుంటున్నాను. నిజాయితీగా కష్టపడితే కచ్చితంగా విజయం సాధించగలం అనే నమ్మకం వచ్చింది. అయితే కాస్త ఆలస్యం కావొచ్చు కానీ కష్టపడితే కచ్చితంగా సాధిస్తాం.
‘ఏవం ఇంద్రజిత్’ అనే హిందీ నాటికలో ఆరు పాత్రలు నటించారు? అది ఎలా సాధ్యమయింది?
అదంతా నిజంగా నా డైరెక్టర్ గొప్పదనం. 21 రోజుల్లో అది ప్రాక్టీస్ చేశాం. 24 గంటలూ వర్క్ చేసే వాళ్లం. నాలో ఈ టాలెంట్ ఉంది అనేది అప్పుడే బయటపడింది. సాధారణ మహిళల జీవితాలు ఎలా ఉంటాయో ఈ ఆరు పాత్రల్లో చూపించగలిగాను. అప్పుడు ఎలా చేశానో ఇప్పుడు తలచుకుంటే నా ఊహకు అందడం లేదు.
మీ సినీ ప్రస్థానం ఎలా సాగుతోంది?
ముందుగా ‘మనసానమ:’ అనే షార్ట్ ఫిల్మ్ నాకు ఒక గుర్తింపును తీసుకొచ్చింది. దీని ద్వారానే తెలుగు ప్రేక్షకులకు పరిచయ మయ్యాను. ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు సాధించిన లఘు చిత్రంగా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా అవార్డులు కైవసం చేసుకున్న షార్ట్ మూవీ ఇది. 2022లో ఆస్కార్ అర్హత కూడా పొందింది. అంతర్జాతీయ స్థాయిలో నలభైకి పైగా ‘ఉత్తమ నటి అవార్డులు’ అందుకోవడం నిజంగా నాకు దక్కిన అరుదైన అవకాశం.
ఇందులో నటించిన తర్వాత తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. ‘బుచ్చి నాయుడు కండ్రిగ: తూర్పు వీధి’, ‘ఏ బ్యూటిఫుల్ గర్ల్’ వంటి చిత్రాలలో నటించాను. ఇప్పుడు ‘సుయోధన’ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాను. అలాగే ఇటీవలే జియో సినిమాలో విడుదలైన హిందీ చిత్రం ‘హే కమీనీ’లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోగలిగాను. ఇంకా తెలుగులో నాలుగు, హిందీలో రెండు సినిమాల్లో నటిస్తున్నాను. వీటి షూటింగ్ నడుస్తుంది. త్వరలోనే మలయాళంలో కూడా నటించబోతున్నాను.
నేటి యూత్‌కు మీరేం చెబుతారు?
మిమ్మల్ని మీరు నమ్మండి. మీలోని ఆలోచనలను అణిచివేయడానికి చుట్టూ చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అవేవీ మీరు పట్టించుకోకండి. మీరేం చేయాలనుకుంటున్నారో దానిపైనే దృష్టి పెట్టండి. పర్సనాల్టీ డెవలప్‌మెంట్ పెంచుకోండి. దీనికి థియేటర్ ఆర్ట్ చాలా ఉపయోగపడుతుంది. నాకు చాలా నేర్పించింది. కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి.
- సలీమ



