ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా భారీ నిరసనలు
నినాదాలతో హౌరెత్తించిన ఆందోళనకారులు
న్యూయార్క్, వాషింగ్టన్, లాస్ఏంజెల్స్, చికాగో సహా పలు నగరాల్లో నిర్వహణ
అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలు.. ఇరాన్‌పై యుద్ధానికి ఖండన
న్యూయార్క్ : పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా మళ్లీ ‘నో కింగ్స్’ నిరసనలు హౌరెత్తాయి. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు ఈ ఆందోళనలు జరిగాయి. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, లాస్ఏంజెల్స్, చికాగో సహా అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఈ నిరసనలు జరిగాయి. ఈ నిరసనల్లో భాగంగా అమెరికన్లు అధిక సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. తమ నిరసన గళాన్ని వినిపించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చర్యలను వ్యతిరేకించారు. ‘అధికారవాద వ్యతిరేక’ బృందాలుగా ఏర్పడి ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శించారు. కార్మిక సంఘాలు , ఇతర క్షేత్రస్థాయి సంస్థలతో కూడిన నిర్వాహకుల కూటమి ప్రకారం.. యూఎస్‌లోని 50 రాష్ట్రాలతో పాటు 16 దేశాలలో మూడువేలకు పైగా ప్రాంతాల్లో ఆందోళనకారులు తమ నిరసనగళం విప్పారు. ”మార్చి 28 అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసన” అని ఇండివిజిబుల్ సహ వ్యవస్థాపకుడు ఎజ్రా లెవిన్ అన్నారు.
మూడో ‘నో కింగ్స్’ నిరసన
‘నో కింగ్స్’ కూటమి ఈ కార్యాచరణ దినం ”అహింసాత్మక” స్వభావాన్ని పదేపదే చెప్పింది. నో కింగ్స్ వెబ్సైట్ ప్రకారం.. ‘నో కింగ్స్’ నిరసనలను బహిరంగంగా కించపరచడం నుంచి ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గింది. ప్రజల శక్తిని నిర్మించడం, ట్రంప్ పరిపాలనతో పోరాడటం అనే విస్తృత ప్రయత్నాలలో ‘నో కింగ్స్ డే’ కేవలం ఒక అంశం మాత్రమేనని, ఆ పోరాటం మార్చి 28 తర్వాత ముగిసిపోదని నిర్వాహకులు పదేపదే చెప్పారు.
”మా మూడో ‘నో కింగ్స్ డే ఆఫ్ యాక్షన్’ ప్రకారం.. ‘నో కింగ్స్’ను కేవలం ఒక శక్తివంతమైన ధిక్కార దినంగానే కాకుండా, ప్రతిచోటా స్థానిక సంఘటనలకు మద్దతు ఇచ్చే ఒక సంఘటన ఉత్ప్రేరకంగా కూడా చూస్తున్నాము”అని చెప్పారు. కాగా తొలి రెండు రౌండ్ల నిరసనల్లో 50 నుంచి 70 లక్షల మంది వరకు పాల్గొన్నారనీ, అయితే ఈ మూడో ‘నో కింగ్స్’లో అంతకు మించి ఆందోళన కారులు పాల్గొంటారని నిర్వాహకులు చెప్పారు. గతంలో జరిగిన ‘నో కింగ్స్’ నిరసనలు ట్రంప్‌పై అమెరికన్లలో నిరసనను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాయి. దీంతో ఈ ఆందోళనలు ట్రంప్ యంత్రాంగానికి తలనొప్పిగా మారాయి. తాజాగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ ఈ నిరసనలు ప్రారంభమవడం ట్రంప్‌నకు కొత్త తలనొప్పిగా మారిందని విశ్లేషకులు చెప్తున్నారు.



