యుద్ధ క్షేత్రంలోకి హౌతీలు..
ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
సౌదీలో అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి
దెబ్బతిన్న రీఫ్యూయలింగ్ విమానాలు..పలువురికి గాయాలు
పోర్టులు, ఎయిర్‌పోర్టులే లక్ష్యంగా టెహ్రాన్ భీకర దాడులు
నవతెలంగాణ – సెంట్రల్ డెస్క్
ఇరాన్ యుద్ధం ఐదో వారంలో ప్రవేశించిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమాసియాలో గత నెల 28న మొదలైన పోరు శనివారం కొత్త మలుపు తిరిగింది. యుద్ధం మొదలైన తర్వాత తర్వాత తొలిసారిగా యెమన్‌కు చెందిన హౌతీలు రంగంలోకి దిగారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌కు దక్షిణాన ఉన్న ఇజ్రాయిల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. లక్ష్యాలను సాధించే వరకూ సైనిక చర్యలను కొనసాగిస్తామని ప్రకటించారు. ఇరాన్, లెబనాన్, ఇరాక్, పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులకు ప్రతీకారంగా పోరు ప్రారంభించామని తెలిపారు.
యెమన్‌కు ఆవల ఉన్న లక్ష్యాలపై కూడా దాడి చేసే సామర్ధ్యం తమకు ఉన్నదని హైతీలు ఈ చర్య ద్వారా నిరూపించుకున్నారు. అరేబియన్ ద్వీపకల్పం, ఎర్ర సముద్రం పరిసరాలలో ప్రయాణించే నౌకలను అడ్డుకునే సామర్ధ్యం హౌతీలకు ఉంది. 2023 అక్టోబర్ 7 తర్వాత గాజాలో హమాస్‌కు మద్దతుగా వారు జల రవాణాను అడ్డుకున్న విషయం తెలిసిందే. హర్మూజ్ జలసంధిపై ఇరాన్‌కు పట్టు ఉండగా సూయజ్ కెనాల్‌కు దారితీసే బాబ్ అల్-మందబ్ జలసంధిపై హౌతీలకు నియంత్రణ ఉంది.
సౌదీలో దెబ్బతిన్న అమెరికా రీఫ్యూయలింగ్ విమానాలు…పలువురికి గాయాలు
గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై దాడులను ఇరాన్ ముమ్మరం చేసింది. సౌదీ అరేబియాలోని కీలక అమెరికా స్థావరంపై ఆరు క్షిపణులు, 29 డ్రోన్లతో శుక్రవారం పెద్ద ఎత్తున దాడి జరిపింది. ఈ దాడిలో పదిహేను మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దాడిలో అనేక అమెరికా రీఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నాయి. ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడి చేసిందని అమెరికా అధికారి ధృవీకరించారు.
యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ దాడి చేయడం ఇది రెండోసారి. కాగా ఒమన్ తీరంలో ఉన్న అమెరికా నౌకపై ఇరాన్ దళాలు శనివారం ఉదయం దాడి చేశాయి. ఒమన్ తీరంలో దాడి జరిగినప్పటికీ ఆ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని పూర్తిగా గౌరవిస్తూనే ఈ చర్యకు దిగామని ఖతమ్ అల్-అన్బియా కేంద్ర కార్యాలయ ప్రతినిధి అబ్రహం జోల్ఫగనీ తెలిపారు.
ఓడరేవులు, విమానాశ్రయాలు లక్ష్యంగా…
గల్ఫ్‌లోని ఓడరేవులు, విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ శనివారం దాడులు చేసింది. అబూధాబీలోని ఖలీఫా ఓడరేవు సమీపంలో ఉన్న ఆర్థిక మండలి వద్ద మూడు దఫాలుగా మంటలు చెలరేగాయి. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకునే క్రమంలో శకలాలు భూమిపై పడి ఐదుగురు భారతీయులు సహా ఆరుగురు గాయ పడ్డారు. ఇరాక్‌లో స్వయంప్రతిపత్తి కలిగిన కుర్దిస్థాన్ ప్రాంతంలోని ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పేలుడు సంభవించింది. ఆకాశంలో దట్టమైన పొగలు అలముకున్నాయి.
ఈ విమానాశ్రయంలోనే అమెరికా కాన్సులేట్ ప్రాంగణం ఉంది. అమెరికా నేతృత్వంలోని జిహాదీ వ్యతిరేక కూటమికి చెందిన సైనిక సలహాదారులు కూడా అక్కడే ఉంటారు. కాగా డ్రోన్ దాడి కారణంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం బాగా దెబ్బతిన్నది. విమానాశ్రయంలోని రాడార్ వ్యవస్థ ధ్వంసమైంది. ఒమన్‌లోని సలాలాహ్ ఓడరేవుపై జరిగిన డ్రోన్ దాడిలో ఓ కార్మికుడు గాయపడగా క్రేన్ స్వల్పంగా దెబ్బతిన్నది. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్ల దాడిలో యూఏఈలోని పారిశ్రామిక మండలిలో మంటలు చెలరేగాయి.
ఆరు నౌకలపై దాడి చేశాం : భారీ సంఖ్యలో అమెరికా దళాలను చంపాం : ఐఆర్‌జీసీ
పర్షియన్ గల్ఫ్ జలాలలో అమెరికా సైన్యానికి చెందిన ఆరు వ్యూహాత్మక నౌకలపై దాడులు చేశామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తెలిపింది. ఈ దాడులలో అమెరికా సైనికులు భారీ సంఖ్యలో చనిపోయారని చెప్పింది. ‘ట్రూ ప్రామిస్-4 కింద 84వ విడత దాడులలో భాగంగా అల్-షొయోఖ్ పోర్ట్, దుబాయి తీర ప్రాంతాలు, ఓడరేవు వద్ద మోహరించిన అమెరికా, ఇజ్రాయిల్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మా నౌకాదళ విభాగాలు హైబ్రిడ్ ఆపరేషన్ చేపట్టాయి. అనేక అమెరికా దళాలను హతమార్చాయి. వ్యూహాత్మక హార్డ్‌వేర్ వ్యవస్థను ధ్వంసం చేశాయి’ అని ఐఆర్‌జీసీ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఓ ప్రకటనలో వివరించింది.
ఖద్ర్-380 క్రూయిజ్ క్షిపణులు సహా అనేక స్వదేశీ తయారీ బాలిస్టిక్ క్షిపణులతో ఆరు అమెరికా లాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ (ఎల్‌సీయూ)లపై దాడి చేశామని చెప్పింది. దాడుల తర్వాత మూడు నౌకలు నీట మునిగిపోయాయని, మిగిలినవి అగ్ని జ్వాలలలో చిక్కుకున్నాయని క్షేత్ర స్థాయి నుంచి సమాచారం వచ్చిందని తెలిపింది. అల్-ఖర్జ్ స్థావరంలో అమెరికా దళాలకు చెందిన అనేక రీఫ్యూయలింగ్ వాహనాలను కూడా విజయవంతంగా ధ్వంసం చేశామని పేర్కొంది. తీర ప్రాంతాలలో అమెరికా డ్రోన్ విభాగాల సిబ్బందికి చెందిన కేంద్రాలపై కమికాజ్ డ్రోన్లతో దాడి చేశామని ఐఆర్‌జీసీ తన ప్రకటనలో తెలియజేసింది.
టెహ్రాన్‌లో పేలుళ్లు
ఇరాన్‌పై శనివారం ఉదయమే పెద్ద ఎత్తున దాడులు చేశామని ఇజ్రాయిల్ తెలిపింది. రాజధాని టెహ్రాన్‌లో పది చోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి. పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. సిరియా గగనతలంలోకి ప్రవేశించిన ఇరాన్ క్షిపణులను ఇజ్రాయిల్ గగనతల వ్యవస్థలు అడ్డుకొని కూల్చివేశాయి. దీంతో సిరియా రాజధాని డెమాస్కస్, దాని పరిసర ప్రాంతాలలో పేలుడు శబ్దాలు వినిపించాయి.
మధ్యప్రాచ్యానికి మరో అమెరికా నౌక
ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ మధ్యప్రాచ్యానికి అమెరికా ప్రభుత్వం అదనపు దళాలను తరలిస్తోంది. యుద్ధ విమాన వాహకనౌక యూఎస్‌ఎస్ జార్జ్ డబ్ల్యూ బుష్ త్వరలోనే సెంట్రల్ కమాండ్‌లో చేరుతుందని వార్తలు వస్తున్నాయి. యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్, యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌లను గతంలోనే మధ్యప్రాచ్యానికి అమెరికా తరలించిన విషయం, వాటిపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే. కాగా అమెరికా నౌకాదళ సిబ్బంది, పారాట్రూపర్లు కూడా పశ్చిమాసియా సమీపానికి చేరుకున్నారు.
మోడీకి ట్రంప్ ఫోన్… చర్చల్లో మస్క్
ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మంగళవారం జరిగిన టెలిఫోన్ సంభాషణ సందర్భంగా ఓ అసాధారణ, ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ‘మోడీతో ట్రంప్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. వీరి సంభాషణ ఫలప్రదంగా సాగింది’ అని శ్వేతసౌధం పత్రికా కార్యదర్శి కరోలిన్ లీవిట్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అయితే ఆ చర్చలో వ్యాపారవేత్త ఎలన్ మస్క్ కూడా చేరారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. ట్రంప్‌తో మస్క్‌కు తిరిగి సత్సంబం ధాలు ఏర్పడ్డాయని ఈ పరిణామం సూచిస్తోందని వ్యాఖ్యానించింది. యుద్ధ సమయంలో ఇరువురు ప్రభుత్వాధినేతల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నప్పుడు ఓ ప్రైవేటు వ్యక్తి అందులో తలదూర్చడం అసాధారణమని పరిశీలకులు వ్యాఖ్యానించారు. చర్చలలో మస్క్‌ను ఎందుకు అనుమతించారన్నది తెలియరాలేదు.
యుద్ధంపై పాక్‌లో నేడు, రేపు చర్చలు
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధంపై పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ విదేశాంగ మంత్రులు ఆది, సోమ వారాలలో ఇస్లామాబాద్‌లో సమావేశమవుతున్నారు. సమావేశానికి హాజరు కావాల్సిందిగా పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తన సహచర మంత్రులను ఆహ్వానించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత నివారణకు చేపట్టాల్సిన చర్యలు సహా పలు అంశాలపై వీరు చర్చిస్తారని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వివిధ దేశాల విదేశాంగ మంత్రులు తమ పర్యటనలో భాగంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అవుతారు. ఇదిలావుండగా షెహబాజ్ శనివారం ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు ఫోన్ చేసి తాజా పరిస్థితిపై చర్చించారు. పౌర మౌలిక సదుపాయాలు సహా ఇరాన్‌పై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులను ఖండించానని ఆయన చెప్పారు. ఇరాన్ ప్రజలకు సంఘీభావం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
కాండ్లా టెర్మినల్‌కు చేరిన ఎల్పీజీ నౌక
హర్మూజ్ జలసంధి మీదుగా మరో ఎల్పీజీ నౌక భారత్ చేరుకుంది. 47,000 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో ఎంటీ జగ్ వసంత్ నౌక కాండ్లాలోని వదినార్ టెర్మినల్ (జామ్‌నగర్)కు చేరుకున్నదని దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ (డీపీఏ) తెలియజేసింది. ఈ గ్యాస్‌ను ఇతర నౌకలకు బదిలీ చేస్తామని, ఇంధన సరఫరాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పోర్ట్ అథిరిటీ చెప్పింది.



