Sunday, March 29, 2026
E-PAPER
Homeసోపతియువతకు స్ఫూర్తిదాయకం బెల్లి యాదయ్య ప్రయాణం

యువతకు స్ఫూర్తిదాయకం బెల్లి యాదయ్య ప్రయాణం

- Advertisement -

సామాజిక రుగ్మతల నిర్మూలనతో సమసమాజ స్థాపన అనే ఆశయాన్ని ముందుకు పెట్టుకుని విద్య, సాహిత్యం, సామాజిక సేవలను సమన్వయం చేస్తూ సాగుతున్న బెల్లి యాదయ్య ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. గ్రామ పాఠశాల నుంచి ఆచార్య స్థాయికి ఎదిగిన ఆయన జీవన గాథ కృషి, పట్టుదల, అంకితభావం కలిసిన విజయకథగా నిలిచింది.

విద్యా సేవ, సాహిత్య సృజన, సామాజిక చైతన్యం అనే మూడు మార్గాల్లో సమానంగా ముద్ర వేసిన విద్యావేత్త బెల్లి యాదయ్య. తరగతి గదిని జ్ఞానవేదికగా మార్చిన అధ్యాపకుడిగా, కవిగా, రచయితగా సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తో సమాజ సమస్యలపై స్పందించే ప్రజాబుద్ధిజీవిగా నిలిచారు. 38 ఏండ్ల పాటు విద్యా రంగంలో అంకితభావంతో పనిచేసిన ఆయనకు ఇటీవల కళాశాల విద్యాశాఖ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించడం ఆయన కషికి వచ్చిన గౌరవంగా నిలిచింది.

బాల్యం – విద్యాభ్యాసం
నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం పాలెం గ్రామంలో చంద్రమ్మ, సాయిలు దంపతులకు 1968 జూన్‌ 20న బెల్లి యాదయ్య జన్మించారు. గ్రామీణ వాతావరణంలో పెరిగిన ఆయన చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి పెంపొందించుకున్నారు. పాలెం ప్రాథమిక పాఠశాలలో ప్రారంభమైన విద్యాభ్యాసం నోముల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కొనసాగింది. అనంతరం నల్లగొండలోని గీతా విజ్ఞాన ఆంధ్ర కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. తెలుగు భాషపై ఉన్న అభిరుచి ఆయనను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం, రాజమండ్రి వరకు తీసుకెళ్లింది. ఎం.ఏ. (తెలుగు)లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన ఆయన ”అజంతా స్వప్నలిపి ఒక పరిశీలన” అంశంపై ఎం.ఫిల్‌ పూర్తి చేశారు. ”నగముని రచనలు – ఒక పరిశీలన” అనే అంశంపై పిహెచ్‌.డి సాధించి విద్యా రంగంలో అత్యున్నత అర్హతను పొందారు.

అధ్యాపకుడిగా ప్రస్థానం…
1987లో నకిరేకల్‌లోని విజ్ఞాన విద్యామందిర్‌ పాఠశాలలో రెండో తరగతి క్లాస్‌ టీచర్‌గా బోధనా జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన అర్హతలు డి ఓ ఎల్‌, టిపిటి. చిన్నపిల్లలకు పాఠాలు చెప్పిన ఆ తొలి అడుగు తరువాత నిరంతర సాధనతో ముందుకు సాగింది. ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌గా నాలుగు సంవత్సరాలు, ప్రైవేట్‌ లెక్చరర్‌గా ఆరు సంవత్సరాలు పనిచేశారు. అనంతరం ప్రభుత్వ రంగంలో లెక్చరర్‌గా 27 సంవత్సరాలకు పైగా బోధనా అనుభవాన్ని సంపాదించారు. నకిరేకల్‌ విజ్ఞాన విద్యామందిర్‌, మూసి ప్రాజెక్ట్‌ అభ్యుదయ గురుకుల పాఠశాల, ఏవీఎం డిగ్రీ కళాశాల, కోదాడ కేఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నల్గొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (బాలురు), కొండనాగుల శ్రీ ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నల్గొండ నాగార్జున ప్రభుత్వ కళాశాల, రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వంటి పలు విద్యాసంస్థల్లో సేవలందించారు. ప్రస్తుతం నకిరేకల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం ఆయనకు ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఆయన విద్యా ప్రయాణంలో మరో మైలురాయిగా నిలిచింది. గ్రామ పాఠశాలలో ఎలిమెంటరీ టీచర్‌గా ప్రారంభమైన జీవితం నేడు ఆచార్య స్థాయికి చేరడం ఆయన కషి, పట్టుదలకు నిదర్శనం.

సాహిత్య రంగంలో విశిష్ట స్థానం
బోధనతో పాటు సాహిత్యరంగంలో కూడా బెల్లి యాదయ్య విశిష్ట స్థానం సంపాదించారు. వచన కవిత, గేయం, పద్యం, కథ, యాత్రారచన, జీవితచరిత్ర, విమర్శ వంటి విభిన్న ప్రక్రియల్లో ఆయన రచనలు వెలువడ్డాయి. ”నేను గొర్రెల కాస్తుంటాను”, ”బోధివక్షం”, ”విభాజకం”, ”తర్జుమా”, ”మా ఊరు అట్లా లేదు”, ”రెక్కల మనిషి”, ”చదువుల కల”, ”పిల్లలకేం కావాలి — పిల్లలేం కావాలి”, ”కలవస్తే బాగుండును”, ”పదార్థం” వంటి పుస్తకాలు ఆయన సజనాత్మక ప్రతిభను ప్రతిబింబిస్తున్నాయి.

రచనా కృషికి అవార్డులు
బెల్లి యాదయ్య రచనా కషికి అనేక అవార్డులు లభించాయి. మయూరి కళాసమితి రాష్ట్రస్థాయి కవితా రచన పోటీలో ప్రథమ బహుమతి (1992), విద్యాసంవర్ధనీ పరిషత్‌ బెంగుళూరు నుండి ఆంధ్రభాషాభూషణ స్వర్ణపతకం (1994), రంజని కుందుర్తి అవార్డు (1997), జిల్లా ఉత్తమ అధ్యాపక అవార్డు (2002), నర్రా కోటయ్య స్వర్ణపతకం (2003), గూటం తాతారావు కళావేదిక నాన్న కవితా పురస్కారం (2015), రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు (2015), కాళోజీ పురస్కారం (2017), విద్యా సేవారత్న పురస్కారం (2019), జీవన సాఫల్య పురస్కారం (2019), మల్లోజుల సదాశివుడు పురస్కారం (2019), జాషువా స్మారక కవితా పురస్కారం (2023), బెజవాడ గోపాలరెడ్డి పురస్కారం (2024), ఉదారి నాగదాసు స్మారక పురస్కారం (2024), అలిశెట్టి ప్రభాకర్‌ స్మారక రాష్ట్ర పురస్కారం (2025) వంటి అనేక గౌరవాలు లభించాయి.

వివిధ పదవులు
విద్యా రంగంలో కూడా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలో తెలుగు సబ్జెక్ట్‌ కమిటీ సభ్యుడిగా, డైట్‌ నల్లగొండలో బాలసాహిత్యం సంపాదక మండలి సభ్యుడిగా పనిచేశారు. మహారాష్ట్ర స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ మిడిల్‌ అండ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ పాఠ్యపుస్తక రచన సంఘ సభ్యుడిగా సేవలందించారు. ఇంటర్మీడియట్‌ బోర్డ్‌లో తెలుగు సబ్జెక్ట్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ పాఠ్యపుస్తక రచన కమిటీ సభ్యుడిగా కూడా సేవలందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో తెలుగు, ప్రాచ్య భాషల పాఠ్య ప్రణాళిక సంఘానికి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. సామాజిక రంగంలో కూడా చైతన్యవంతమైన పాత్ర పోషించారు. తెలంగాణ రచయితల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు. బీసీ సబ్‌ ప్లాన్‌ సాధన కమిటీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా, ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్ల పోరాట సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ల సంఘం తెలంగాణ రాష్ట్రానికి గౌరవ సలహాదారుగా ఉన్నారు.

పత్రికా రంగంలో సైతం…
పత్రికా రంగంలో కూడా ఆయన చురుకైన పాత్ర పోషించారు. ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, వార్త, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి, మన తెలంగాణ, నవతెలంగాణ వంటి పత్రికల్లో ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగా రచనలు చేశారు. సాహిత్య, సామాజిక, విద్యా అంశాలపై 295కు పైగా సంపాదకీయ వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో 32 పరిశోధనా పత్రాలు సమర్పించారు.

సాంస్కతిక చైతన్య పెంపుకు కృషి
1992లో పాలెం గ్రామంలో స్నేహ యూత్‌ అసోసియేషన్‌ను స్థాపించి గ్రామీణ యువతలో క్రీడా, సాంస్కతిక చైతన్యాన్ని పెంపొందించారు. రంగస్థల కళలపై ఆసక్తితో ”కొక్కొరోకో”, ”నరకంలో లంచం”, ”శవం లేచిపోయింది”, ”భూస్వామి మొగుడు” వంటి నాటకాలకు దర్శకత్వం వహించారు. జీవోఏఎల్‌ (జెన్యూన్‌ ఆప్షన్‌ అండ్‌ ఆక్టివిటీ త్రో లెర్నింగ్‌) సంస్థను స్థాపించి మహారాష్ట్ర, కర్ణాటక, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని వందలాది విద్యాసంస్థల్లో అభ్యసన పద్ధతులపై ప్రసంగాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌సి, బిసి స్టడీ సర్కిల్స్‌, రాష్ట్ర జైళ్ల శాఖకు కౌన్సిలర్‌గా కూడా సేవలందించారు.

బెల్లి యాదయ్య పర్యవేక్షణలో పీహెచ్‌ డీ
పరిశోధన రంగంలో ఆయన మార్గదర్శకత్వం విశేషం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన పర్యవేక్షణలో పలువురు పరిశోధకులు పిహెచ్‌.డి చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన జె. మహేందర్‌ ”దేవులపల్లి కష్ణమూర్తి రచనలు — పరిశీలన”, భువనగిరి జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సిద్ధగాని సరిత ”తెలుగు కథల్లో శ్రామిక స్త్రీ జీవన చిత్రణ” అంశాలపై డాక్టరేట్‌ పట్టాలు పొందారు. ఆయన రచనలపై కూడా పరిశోధనలు జరిగాయి. బోయపల్లి చిట్టెమ్మ మద్రాసు విశ్వవిద్యాలయం చెన్నైలో, మందుల విప్లవ్‌ కుమార్‌ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో ఎం.ఫిల్‌ పరిశోధనలు పూర్తి చేశారు.

చివరగా….
బోధన, పరిశోధన, సజన అనే మూడు రంగాలను సమానంగా ప్రేమించే బెల్లి యాదయ్యకు ఇష్టమైన స్థలాలు పొలం మరియు తరగతి గది. ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా విద్యా సేవలో అంకితభావంతో పనిచేస్తున్న ఆయన మిగిలిన సేవా కాలంలో కూడా అదే ఉత్సాహంతో సమాజానికి సేవ చేస్తానని స్పష్టం చేస్తున్నారు.

– యరకల శాంతి కుమార్‌, 9849042083

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -