Sunday, March 29, 2026
E-PAPER
Homeహెల్త్ఆటిజం అంటే ఏమిటి?

ఆటిజం అంటే ఏమిటి?

- Advertisement -

ఇది జన్మతః ఉండి పసిప్రాయంలోనే బహిర్గతమయ్యే దీర్ఘకాల రుగ్మత; కానీ, ఒక్క సమస్యకు పరిమితమైనది కాదు. వ్యక్తి నిత్య కార్యకలాపాలలో ఎన్నో సమస్యలకు దారి తీసే అత్యంత జటిలమైన రుగ్మత ఆటిజం. పరస్పర భావవ్యక్తీకరణలో మానసికంగా తీవ్రమైన ఇబ్బందికి గురవ్వడాన్ని స్థూలంగా సూచించే పదం; నిజానికిది మెదడు ఎదుగుదల లోపంతో కూడుకున్న సమస్య.

ప్రపంచ వ్యాప్తంగా ఒకటి నుండి రెండు శాతం ప్రజలు ఈ రుగ్మత వలన సాధారణతకి దూరమై, బాధాగ్రస్తులుగా జీవనాన్ని గడుపుతున్నట్టుగా గణాంకాల అంచనా.
ఈ పదం గ్రీకు భాష, ఆటో అంటే స్వీయ, నుండి అన్వయించుకోబడినది; ఆటిజం ఉన్న వ్యక్తి ఇంకొకరితో సంబంధం లేనట్లుగా, వారి ప్రపంచంలోనే ఉంటారు; దానిలో ఇంకొకరికి స్థానం ఉండదు. అవతలివారి ఉనికి వారు గ్రహించలేరు; స్వీయ తత్వంలో మునిగి ఉంటారు.
పిల్లల్లో ఈ రుగ్మతకు సంబంధించిన ఆనవాళ్లు పెద్దలు గమనించినప్పటికీ, కొంత వయసు వచ్చే వరకు, పలు కారణాలవల్ల, వాటి పర్యవసానాలు బయటపడకపోవచ్చు.

ఆటిజం ఉన్న పిల్లల సామర్థ్యాలు, అవసరాలు, రెండూ కూడా భిన్నంగా ఉండి, కాలక్రమేణా పరిణామం చెందవచ్చు; కొందరు స్వతంత్రంగా జీవితాన్ని గడపవచ్చు, కానీ, అన్ని అవసరాలకు దగ్గరి ఆత్మీయులపైనే ఆధారపడే వారి సంఖ్యే ఎక్కువ!
నిపుణుల ద్వారా తగు సాక్ష్యాధారిత మానసిక-సామజిక చికిత్సా పద్ధతులతో వీరికి పునరావాసం కల్పించవచ్చు.
ఆటిజం అనేది ఒకే జబ్బు కాదు; మానసిక వద్ధి తగినంత లేదనడానికి కొన్ని కొలమానాల సమూహం; అందుకే దీనిని సంక్షిప్తంగా ఆటిజం అన్నప్పటికీ, దీని జటిలత దృష్ట్యా ‘ఆటిజం స్పెక్ట్రమ్‌ డిసార్డర్‌’ అని పేర్కొంటారు.

ఎందుకు వస్తుంది?
కారణాలు కచ్చితంగా తెలియనప్పటికీ, జెనెటిక్‌, పర్యావరణ పరిస్థితులను కారకులుగా పేర్కొనవచ్చు. దీని గురించిన అవగాహన, నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులో పెరిగినందు వలన కావొచ్చు, ఇటీవల ఈ రుగ్మతతో బాధపడే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు నిపుణలు వెల్లడిస్తున్నారు.
ఆటిజం ఆడపిల్లల్లో కన్నా మగపిల్లల్లో నాలుగు రేట్లు ఎక్కువగా ప్రబలి ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లల్లో ఇది రావచ్చు. ఫ్రేజైల్‌ ఎక్స్‌ సిండ్రోమ్‌ ట్యూబెరస్‌ స్కల్రోసిస్‌ రెట్‌ సిండ్రోమ్‌ వంటి కొన్ని అరుదైన జబ్బులతో బాధపడే పిల్లల్లో వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇరవై ఆరు వారాల కంటే ముందుగా జన్మించిన పసికందుల్లో, అవయవ మాంద్యం వలన, 35 సంవత్సరాలు దాటిన తల్లి ప్రథమ కాన్పు, తరువాత జన్మించిన పిల్లల్లో కూడా ఇది సంభవించవచ్చు.

వాక్సిన్ల వలన వస్తుందన్నది పరిశోధనల ద్వారా అవాస్తవమని నిపుణులు తేల్చి చెప్పారు.
ఆటిజం స్పెక్ట్రమ్‌ డిసార్డర్‌లో ఆటిజమే కాకుండా ఆస్పెర్గెర్స్‌ సిండ్రోమ్‌, చైల్డ్‌హుడ్‌ డిస్‌ఇంటెగ్రటివ్‌ డిసార్డర్‌, అట్టెన్షన్‌ డెఫిసిట్‌ హైపెరాక్టీవ్‌ డిసార్డర్‌ (ఎడిహెచ్‌ డి) వంటి ఎన్నో రకాల, ఎదుగుదల లోపాన్ని సూచించే రుగ్మతలు, మానసిక వెనుకబాటుతో కూడుకొన్న అసాధారణతలు మిళితమై ఉంటాయి.
సూచికలు:
సంవత్సరం వయసు లోపే మొదలయ్యి, క్రమేణా పిల్లల సాంఘిక జీవితంలో సమస్యలను పెంచుతూ పోతుంది.
ఒక్కొక్కరిలో సూచికలు వేర్వేరుగా ఉండవచ్చు. సూటిగా కళ్ళలోకి చూడలేకపోవడం; చూపు తిప్పేయడం, పేరు పిలిచినప్పుడు పలకకపోవడం, ఆలనా పాలనా చేసేవారిపై శ్రద్ధ లేకపోవడం, ఎవరితో కలవకుండా విడిగా ఉండడం, మాటలు మాట్లాడలేకపోవడం, తోటివారితో సమానంగా విషయాల గ్రహింపు లేకపోవడం, పాఠాలు నేర్చుకోలేకపోవడం వంటి లక్షణాలు కొందరిలో కనిపిస్తే, మరి కొందరిలో అన్ని విషయాల ఆకళింపు చాలా వేగంగా ఉండవచ్చు, కానీ వాటి వ్యక్తీకరణలో, రాతపూర్వకంగా/ మౌఖికంగా, సమస్య ఉండవచ్చు.
ఈ విధంగా మిశ్రమ సూచికలు ఉండడంతో వ్యాధి తీవ్రతను గుర్తించడం కష్టతరమవ్వచ్చు.
తీవ్ర స్థాయి ఆటిజం ఉన్న పిల్లలను కనిపెట్టడం అంత కష్టం కాదు. వారు ఇతర పిల్లలకి చాల భిన్నంగా ఉంటారు.
సాంఘిక కలయికల్లో వారిని ఎవరైనా తాకడం, కౌగిలించుకోవడం, ముద్దుపెట్టడం వంటి ఆప్యాయతతో కూడిన చేష్టలను ఇష్టపడరు.
అందరిలోనూ ఒంటరిగా, ఒక్కరే ఉండడం తమతో తామే మాట్లాడుకోవడం వంటివి చేస్తుంటారు. ముఖకవళికల్లో మార్పులుండవు. ఎవరితోనూ మాట్లాడడానికి సుముఖంగా ఉండరు. సంభాషణలకు దూరంగా ఉంటారు; అవసరాల మేరకు చాలా మితమైన పదాలతో సరిపెడతారు. ఇతరులు చెప్పేవి వెంటనే గ్రహించలేకపోవచ్చు; అర్థం కాలేదని చెప్పడానికి కూడా కష్టపడతారు.
ఒకే రకమైన చర్యలు చాలాసేపు చేస్తూనే ఉండిపోవడం, తమను తాము గాయపర్చుకొనేవి కూడా కావొచ్చు, మాటలను, చేతలను మళ్లీమళ్లీ పునరావతం చేస్తుంటారు.

వారు చేసే పనులకు, వారి వైఖరికి, ఇతరుల స్పందన ఎలా ఉన్నా పట్టింపు ఉండదు. వారికనుగుణంగా పనులు కానప్పుడు పట్టనట్టుగా ఉండవచ్చు/ ఆవేశపడి పోవచ్చు; అరుదుగా హింస ప్రవత్తి కనిపించవచ్చు. ఎదుటివారి హావభావాలు మాటలు ఆలోచనలు వారికీ అసలు అర్థం కాకపోవచ్చు.
ఒక నిర్దిష్ట జీవన శైలి నిర్మించుకొని, అదే పాటిస్తూ, వాటిలో చిన్న మార్పులనుకూడా సహించలేని పరిస్థితి కల్పించుకొంటారు; ఏ పని పద్ధతిలో చేయలేకపోవచ్చు.
సామాన్యంగా అందరూ పట్టించుకొనే సున్నిత విషయాల పట్ల ఆసక్తి కనబరిచినప్పటికీ, వాటి పనితనం వారికి అంతుబట్టకపోవచ్చు.
నొప్పికి, వాతావరణ తీవ్రతలకి వారిలో ఉండవలసిన స్పందన ఉండదు; అవతల వారి నొప్పి అర్థం కాదు.
ఎవరినీ అనుకరించడం వారి వల్ల కానీ పని. ఒకే విషయం, వస్తువు పైన అనూహ్యమైన దష్టి పెట్టగలుగుతారు.
ఆహార విషయంలో కొన్నిటిని తింటూ వాటికే కట్టుబడి ఉంటారు; మార్పును సహించలేరు.

వీరిని ఎలా చూసుకోవాలి?
కారకాలపై పూర్తి అవగాహన లేనందున దీనిని నివారణ అందుబాటులో లేదు.
ఎంత త్వరగా సూచికలు గ్రహిస్తే చికిత్స పరంగా అంత త్వరగా ప్రక్రియలు చేపట్టడానికి వీలౌతుంది. దానితో ఆ పిల్లల జీవితాల్లో కాలక్రమేణా మెరుగైన మార్పులకు నాంది వేయడం జరుగుతుంది.
తల్లితండ్రుల ఆప్యాయత, ఓర్పు- ఈ రెండూ దివ్యౌషధాలు.
మంద్ర స్థాయి ఆటిజం ఉన్నట్లయితే చాలామంది పిల్లలు కాలక్రమేణా ఆత్మీయుల సహకారంతో కోలుకొంటారు.
కొన్ని అధ్యయనాలు తల్లి గర్భావస్థలో ఉన్నప్పుడు ఫోలిక్‌ ఆసిడ్‌ తదితర ‘ప్రీనేటల్‌ విటమిన్లు’ తగినంత మోతాదులో, వైద్యపరివేక్షణలో తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డలో ఆటిజం నివారించవచ్చని చెప్తున్నాయి.
ఈ రుగ్మత పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా పిల్లల్లో ఈ రకమైన ప్రవత్తి ఎంత త్వరగా గమనించగల్గితే అంత త్వరగా దీనిని అరికట్టే ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి వీలౌతుంది; సహకారమందించడానికి పిల్లల వైద్య నిపుణులున్నారు; స్పెషల్‌ స్కూల్స్‌, ఇంటిగ్రేటెడ్‌ సెంటర్స్‌ టు హెల్ప్‌ చిల్డ్రన్‌ విత్‌ ఆటిజం స్పెక్ట్రమ్‌ డిసార్డర్‌ వంటి స్వచ్ఛన్ద సంస్థలూ నిర్విరామంగా కషిచేస్తున్నాయి!

డాక్టర్‌ మీరా,
రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అఫ్‌ మైక్రోబయాలజీ,
ఫీవర్‌ హాస్పిటల్‌ / ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌, హైదరాబాద్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -