Sunday, March 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళా ఉన్నతే తెలంగాణ ప్రగతి

మహిళా ఉన్నతే తెలంగాణ ప్రగతి

- Advertisement -

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క
ఘనంగా శ్రీనిధి 13వ సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌

మహిళా ఉన్నతే తెలంగాణ ప్రగతి అని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఆడిటోరియంలో శనివారం శ్రీనిధి 13వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మైక్రో ఫైనాన్స్‌ సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రీనిధి సంస్థను ఏర్పాటు చేసిందన్నారు. శ్రీనిధి ఈ స్థాయికి ఎదగడం వెనుక ప్రతి మహిళా కృషి ఉందని చెప్పారు. శ్రీనిధిలో రుణ నిల్వ రూ.5,017 కోట్లు ఉందని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో శ్రీనిధి రూ.154 కోట్ల నికర ఆదాయం పొందడం అభినందనీయమని, వాటాదారులకు 14 శాతం డివిడెంట్‌ డిక్లేర్‌ చేయడం సంస్థకే గర్వకారణమని అన్నారు. మహిళలు తీసుకున్న రుణాలకు ప్రభుత్వమే వడ్డీలు చెల్లిస్తోందన్నారు.

ఉచిత బస్సు ప్రయాణం నుంచి బస్సు యజమానుల దాకా మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఈ రెండేండ్లలో రూ.57 వేల కోట్ల బ్యాంక్‌ రుణాలను అందజేశామని వవరించారు. శిల్పారామంలో కోట్ల విలువైన వ్యాపార సముదాయాన్ని మహిళా సంఘాలకు ఇచ్చామని గుర్తు చేశారు. అదేవిధంగా సమ్మక్క-సారలమ్మ జాతరలో మహిళా సంఘాలు రూ.6 కోట్ల పెట్టుబడులు పెడితే.. రూ.3కోట్లకు పైగా లాభాలు వచ్చాయని తెలిపారు. ఇప్ప పువ్వు లడ్డు రూపకర్త దివ్యదేవరాజన్‌ శ్రీనిధికి సీఈఓగా ఉండటం అదృష్టం అన్నారు. ఒకప్పుడు బ్యాంకులోకి వెళ్లాలంటే మహిళలు భయపడేవారని, ఇప్పుడు మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు క్యూ కడుతున్నాయని చెప్పారు. 67 లక్షల మంది సభ్యులుగా ఉన్న మహిళా సంఘాల సభ్యత్వం కోటి మందికి చేరాలన్నారు. మహిళలు అధికంగా బలపడినప్పుడే.. పేదరికం అంతమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -