పేదోళ్లకు న్యాయం చేయండి
ఏ రాష్ట్రం వారైనా ఇండ్లివ్వండి : వెలుగుమట్ల భూదాన్ భూముల పరిశీలనలో మంత్రి తుమ్మల
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
‘పేదోళ్లకు న్యాయం చేయండి.. ఏ రాష్ట్రం వారైనా, ఎక్కడి నుంచి వచ్చినా వారికి ఇల్లు ఇవ్వండి.. గతంలో పదేండ్ల కాలంలో వాళ్లని పీల్చి పిప్పి చేశారు. ఇకమీదటైనా వారికి న్యాయం జరిగేలా చూడాలి..’ అని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి మంత్రి తుమ్మల వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మాలిక వసతుల కల్పన చర్యలను శనివారం పరిశీలించారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు, రోడ్లనిర్మాణం, విద్యుత్ సౌకర్యం, ఇండ్ల నిర్మాణం.. తదితర పనులపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. వారికి తగు సూచనలు ఇచ్చారు.
‘ఎక్కడా సమస్య రాకూడదు.. పేదో ళ్లను ఇబ్బంది పెట్టొద్దు.. ఎవరైనా దొంగతనంగా దూరాలని ప్రయత్నించినా వదలొద్దు. పేదోళ్లు కూలీనాలి చేసుకొని బతకడానికి వచ్చారు. అలాంటి వారికి న్యాయం చేయండి. ఏదో ఒక సంఘం పేరు పెట్టుకొని ఈ పదేండ్లు వారిని పీల్చిపిప్పి చేశారు. వాళ్ల కష్టమంతా తిన్నారు. అప్పుడు ఎవరైతే ఇక్కడి పేదలను దోచుకున్నారో ఇప్పుడు వాళ్లే ఇక్కడ జరుగుతున్న పనులను ఆపాలని మళ్లీ కోర్టుకు వెళ్లారు. కోర్టు వారికి సరైన బుద్ధి చెప్పింది. కలెక్టర్ ఎవరినైతే అర్హులుగా నిర్ధారించారో.. వారికి స్థలాలు కేటాయించి, మౌలిక వసతులు కల్పించమని ఆదేశించింది. సంఘాల నుంచి ఏమైనా సమస్యలు ఉత్పన్నం అయితే పోలీసులు చూసుకుంటారు. అధికారులు మాత్రం వసతుల కల్పనపై దృష్టి పెట్టండి. ఇప్పటికే లేఅవుట్ అయింది కాబట్టి లబ్దిదారులు ఇండ్లు కట్టే లోపు రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి. తాగునీటి పైప్ లైన్లు వేయాలి. వర్షాకాలం వెళ్లాక సీసీ రోడ్లు నిర్మించాలి’ అని మంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో లబ్దిదారులు తమ ఇండ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసుకోవాలని మంత్రి సూచించారు. అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తూ, నిర్దేశిత గడువులోనే అన్ని పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ మ్యాప్ ద్వారా వివరిస్తూ కాలనీలో ఇప్పటికే విద్యుత్ స్తంభాల ఏర్పాటు, వీధి దీపాల పనులు పూర్తి అయ్యాయని, వాటర్ ట్యాంక్ నుంచి ఇంటింటికీ తాగునీటి పైప్‌లైన్ అనుసంధానం జరిగిందని తెలిపారు. అలాగే అంతర్గత రోడ్ల నిర్మాణం, రవాణా సౌకర్యం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వివరించారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ పినిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మెన్ హనుమంతరావు, ఆర్ అండ్‌బీ ఎస్‌ఈ యాకూబ్, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్లు డి.జయచందర్, సైదులు, నాయకులు మిక్కిలినేని నరేందర్, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.


