విద్యా కమిషన్ సిఫారసులపై సమగ్ర చర్చ జరగాలి
పీఆర్సీ నివేదిక తెప్పించుకుని అమలు చేయాలి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి : వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు చావ రవి, ఎ. వెంకట్
గద్వాల జిల్లా ఆలంపూర్‌లో విద్యా సదస్సు
నవతెలంగాణ-అలంపూర్
తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ రిపోర్టుపైన సమగ్ర చర్చ జరపాలని, ప్రభుత్వ విద్యా రంగానికి నష్టం కలిగించే అంశాలను, ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించే అంశాలను తిరస్కరించి, విద్యాభివృద్ధికి దోహదపడే అంశాలను అమలుచేస్తూ విద్యారంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు చావ రవి, ఎ.వెంకట్ డిమాండ్ చేశారు. ఆదివారం గద్వాల జిల్లా అలంపూర్‌లో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు డి. రమేష్ అధ్యక్షతన విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘యుద్ధం-భారత దేశంపై ప్రభావం’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో బి. వెంకట్ మాట్లాడారు.
అమెరికా, ఇజ్రాయిల్ సామ్రాజ్యవాద ధోరణి కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు. అమెరికా ప్రపంచంపై ఆధిపత్య ధోరణితోనే వెనుజులా, ఇరాన్‌పై దాడి చేసిందన్నారు. అణుబాంబుల బూచి చూపిస్తూ ఇరాన్‌పై యుద్ధం చేస్తూ ప్రజా నివాసాలను ధ్వంసం చేస్తూ, అక్రమంగా చొరబడి ఆ దేశ అధ్యక్షున్ని సైతం హతమార్చడం తీవ్ర ఆక్షేపనీయమని తెలిపారు. గ్యాస్ నిక్షేపాలను ఆక్రమించుకోవడమే ఈ దాడి ముఖ్య ఉద్దేశమని, గతంలో అణు ఒప్పందానికి వ్యతిరేకంగా బాంబులు తయారు చేస్తున్నారనే కారణంతో ఈ యుద్ధానికి అమెరికా పాల్పడు తుందని తెలిపారు. యుద్ధం పట్ల భారత ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదని అన్నారు. యుద్ధం ధరల పెరుగుదలకు, ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. యుద్ధాన్ని తక్షణమే నిలిపేయాలని, ప్రపంచ శాంతిని కాపాడాలని డిమాండ్ చేశారు.
సమస్యలపై పోరాటాలకు సన్నద్ధం కావాలి : ఎ.వెంకట్
అనంతరం చావ రవి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ మాట్లాడుతూ.. ఉద్యోగులు, పెన్షనర్లు తెలంగాణ రెండో పీఆర్సీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం పీఆర్సీ గడువు పొడిగించకుండా, వెంటనే నివేదిక తెప్పించుకుని సంఘాలతో చర్చించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, బకాయి ఉన్న నాలుగు వాయిదాల డీఏను ప్రకటించాలని అన్నారు. ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలను రూపొందించి పర్యవేక్షణా అధికారుల పదోన్నతులు చేపట్టాలని కోరుతూ ఏప్రిల్‌లో పోరాటాలు చేయనున్నట్టు తెలిపారు.
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేసవి సెలవుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వాహన జాతాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 2003 డిఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలని, కేజీబీవీ, సమగ్ర శిక్షా ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలని, మోడల్ స్కూల్స్, గురుకులాల ఉద్యోగులకు 010, హెల్త్ కార్డులు అమలు చేయాలని తదితర తీర్మానాలను సమావేశం ఆమోదించింది. విద్యా సదస్సు అనంతరం టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో అలంపూర్ పట్టణంలో యుద్ద వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. సమావేశం ప్రారంభంలో జాతీయ పతాకాన్ని డి. రమేష్, ఎస్టీఎఫ్‌ఐ పతాకాన్ని మద్దిలేటి, టీఎస్ యూటీఎఫ్ పతాకాన్ని ఎం. గోపాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గా భవాని, రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు, వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యా కమిషన్ పేర కాలయాపన చావ రవి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించకుండా, ప్రభుత్వ విద్యకు సరైన బడ్జెట్ కేటాయించకుండా, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా విద్యా కమిషన్ పేరున రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి అన్నారు. ‘విద్యా కమిషన్ సిఫారసులు – పరిశీలన’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విద్యా రంగంలో సంక్షోభాన్ని నివారించడానికి సంస్కరణలు అవసరమని, జాతీయ విద్యా విధానాన్ని దొడ్డిదారిన అమలు చేస్తే ప్రయోజనం లేదని అన్నారు.
విద్యా వ్యవస్థ కునారిల్లటానికి ఉపాధ్యాయులే ప్రధాన కారణమన్నట్టు తెలంగాణ విద్యా కమిషన్ నివేదికలో ప్రస్తావించటం విచారకరమని అన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాలల సంఖ్యను భారీగా కుదించే ఆలోచనలు మానుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ రిపోర్టు పైన ఉపాధ్యాయ సంఘాలు, విద్యా రంగ నిపుణులతో చర్చించకుండా, కనీసం అసెంబ్లీలో చర్చకు పెట్టకుండా ఏకపక్షంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు.



